పళనిస్వామికి తప్పని పరిస్థితి ఎందుకొచ్చిందంటే?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బీజేపీకి జై అనక తప్పదా? ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా మారనున్నారా? రాష్ట్రపతి ఎన్నికలకు ముందే పళని ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా చేరిపోతుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. వరుస పరిణామాలతో పళనిస్వామి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటు ఐటీ దాడులు, మరోవైపు పన్నీర్ సెల్వం పర్యటనతో పళని సర్కార్ కాలం చెల్లిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కమలాన్ని మంచి చేసుకునేందుకే పళని స్వామి రెడీ అయినట్లు కన్పిస్తోంది. వాస్తవానికి బీజేపీకి కూడా పళనిస్వామితో పని ఉంది. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పళని మద్దతు బీజేపీకి అవసరం. దీంతోనే పళనిస్వామిని ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు తాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్న వాదనలు కూడా విన్పించాయి. అయితే ఈరోజు పళనిస్వామి తన సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని చెప్పారు. త్వరలోనే అన్నాడీఎంకే ఎన్డీఏకు మద్దతిస్తుందని కూడా పళని చెప్పినట్లు తెలుస్తోంది. పళని స్వామి ప్రభుత్వం సజావుగా మనుగడ కొనసాగించాలన్నా కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరమన్న విషయం పళనికి తెలియంది కాదు. అందుకే దిగి వచ్చి మద్దతు ప్రస్తావన తెచ్చారని చెబుతున్నారు.

ఎన్డీఏకి దగ్గరగా….

వాస్తవానికి తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీతోనే మైత్రీ బంధం కొనసాగించేది. విపక్ష డీఎంకే కాంగ్రెస్ తో జత కట్టింది. జయలలిత బతికున్న రోజుల్లో కూడా బీజేపీ పట్ల ఆమె సానుకూలంగా ఉండేవారు. కాని జయ మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. అక్రమస్తుల కేసులో జయ నెచ్చలి శశికళ జైలు కెళ్లే ముందు సీఎం పీఠం కోసం పార్టీలో చీలిక ఏర్పడింది. పన్నీర్ సెల్వం వేరు కుంపటి పెట్టుకుని శశికళను నిద్రపోనివ్వలేదు. అయితే పన్నీర్ వెనక బీజేపీ నేతలు ఉన్నారని, వారు ఆడిస్తున్నట్లుగానే పన్నీర్ ఆడుతున్నాడని శశికళ బ్యాచ్ అనుమానం. అందుకోసమే తనను అక్రమాస్తుల కేసులో ఇరికించారని కూడా శశికళ భావించారు. ఈనేపథ్యంలో శశికళ వర్గం బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. శశికళ భర్త నటరాజన్ స్వయంగా తమిళనాడు లో సంక్షోభానికి కారణం బీజేపీయేనని చెప్పారు. దీంతో బీజేపీకి, అన్నాడీఎంకే దోస్త్ కటీఫ్ అయిందనుకున్నారు. కాని మారిన పరిస్థితులు, వరుసగా జరుగుతున్న సంఘటనలు పళనిస్వామిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ మద్దతు బీజేపీకే ఉంటుందని పళని స్వామి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం బీజేపీకి చేరువ కావడానికేనని చెబుతున్నారు. 122 మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామి సహకారం కూడా బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం అవుతుంది. మొత్తం మీద పళనిస్వామి బీజేపీతో దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*