పవన్ అమెరికాలో ఏం చేస్తున్నారు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు పవన్ కు ఇప్పటికే ఆహ్వానం అందిన నేపథ్యంలో ఆయన ప్రసంగించేందుకు బయలు దేరి వెళ్లారు. ఈ నెల 11, 12 తేదీల్లో జనసేనాని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగం ఉంటుంది. ‘బి కమింగ్ జనసేనాని ’ అనే అంశంపై పవన్ ప్రసంగిస్తారు. పవన్ ఏ ఏ అంశాలపై ప్రసంగిస్తారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాలుగు రోజులు యూఎస్ లోనే…

పవన్ కల్యాణ్ మొత్తం నాలుగు రోజులు అమెరికాలో ఉంటారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రసంగంతో పాటుగా కొందరు ప్రముఖులను ఈ సందర్భంగా పవన్ కలవనున్నారని చెబుతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి వివిధ అంశాల గురించి ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవన్ తన పర్యటనలో కొందరు శాస్త్రవేత్తలు, నిపుణులను కూడా కలిసే అవకాశమున్నట్లు సమాచారం. శుక్రవారం ఉత్తర అమెరికా ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో జరిగే ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అలాగే అమెరికన్ కాంగ్రెస్ సెనేటర్స్, స్థానిక మేయర్, మాజీ సెనేటర్స్, భారత్ కు చెందిన పలు రకాల సంస్థల ప్రతినిధులను ఆయన కలవనున్నారు. జనసేన పార్టీని ఏపీలో బలంగా తీసుకెళ్లే విషయంలో వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ ప్రసంగంపైనే అందరి ఆసక్తి ఉంది. ఈ సమావేశాల్లో కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, తమిళ నటుడు మాధవన్ కూడా ప్రసంగించనున్నారు. ఒక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించడం ఇదే తొలిసారి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*