పవన్ ‘‘కత్తి’’ దూసేదెప్పుడు?

జనసేనాని అజ్ఞాతంలోకి వెళ్లారా? అజ్ఞాత వాసి సినిమా విడుదలయి అభిమానులను నిరాశపర్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ సినిమా ఫ్లాప్ అయినందుకు పెద్దగా పట్టించుకోరు. కాని జనవరిలో ప్రజాక్షేత్రంలోకి వస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ జనవరి నెల ముగింపుకొచ్చినా ఇంతవరకూ రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించలేదు. సంక్రాంతి పండగ తర్వాత జనసేనాని జనంలోకి వస్తారని భావించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలులో పవన్ పర్యటనకు మంచి స్పందన లభించింది. ఆ రెస్పాన్స్ చూసిన పవన్ కల్యాణ్ ఇక ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్నారు. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పి ప్రజాక్షేత్రంలోనే గడుపుతానని చెప్పారు.

ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు?

అయితే ఇంతవరకూ ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఎటువంటి కార్యాచరణను రూపొందించుకోలేదు జనసేన పార్టీ. ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెలలోనే ప్లీనరీ ఉంటుందన్నారు. అయితే ప్లీనరీ తర్వాత జనసేనాని జనంలోకి వస్తారా? లేదా? అన్నది ఆ పార్టీ కార్యకర్తలకే తెలియదు. జనసైన కార్యకర్తలకు ప్రస్తుతం హైదరాబాద్ లో శిక్షణ ఇస్తున్నట్లుచెబుతున్నారు. ఏపీ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నా పవన్ మాత్రం పట్టించుకోనట్లు ఊరుకోవడం పార్టీ క్యాడర్ లోనూ, అభిమానుల్లోనూ నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.

ఏపీలో పరిణామాలకు స్పందించరే…..

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో విభజన హామీలు అమలు కాకపోవడాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం కావడంతో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేక పోతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనైనా ప్రత్యేక హోదా, ఏపీకి రావాల్సిన ప్రయోజనాల గురించి పోరాడాల్సిన పవన్ కల్యాణ్ పత్తా లేకుండా పోవడాన్ని రాజకీయ నేతలు తప్పుపడుతున్నారు. ఇలా ఉంటే పార్టీని ఏం నడుపుతారని ప్రశ్నిస్తున్నారు. అప్పుడప్పుడూ జనంలోకి వస్తే ఓట్లు రాలుతాయా? అని అంటున్నారు.

పార్టీకి నష్టమేనంటున్న….

ప్రజాసమస్యలపై నిత్యం ప్రశ్నించే పవన్ కల్యాణ్ గత కొద్దిరోజులుగా నిశ్శబ్దాన్నే పాటిస్తున్నారు. పవన్ అనంతపురం నుంచి రధయాత్ర చేస్తారన్న ప్రచారం జరిగింది. అనంతపురంలో కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ రాష్ట్ర కార్యాలయాలను ప్రారంభించబోతున్నట్లు కూడా చెప్పారు. కాని నెలలు గడుస్తున్నా ఇవి కార్యరూపం దాల్చలేదు. అసలు పవన్ సీరియస్ గా పాలిటిక్స్ నడుపుతారా..? లేక పార్ట్ టైం పాలిటిక్స్ ను చేస్తారా? అన్న సందేహం ఆయన అభిమానుల్లోనే నెలకొని ఉంది. పవన్ ఇలాగే ఉంటే జనసేన కు నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంటే పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకూ కత్తి తీయరే అని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ మౌనం పార్టీకి డ్యామేజ్ అని చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1