పవన్..కత్తి..మధ్యలో పూనం…!

మీడియా ఆకాశానికెత్తేస్తుంది. అథ:పాతాళానికి తొక్కేస్తుంది. పైకి ఎగరేసినప్పుడు బాగానే ఉంటుంది. కిందపడేస్తే పక్కటెముకలు విరిగి బాధపడుతున్నప్పుడే అర్థమవుతుంది మీడియా మాయాజాలం. ప్రచార మాధ్యమాలు సృష్టించే ఆరోపణల లోకంలో పడి ఎదుటి వాళ్లు ఎంత ఇబ్బందులకు గురైనదీ తెలుసుకోవాలంటే సెలబ్రిటీల చరిత్రను తరచి చూడాలి. కత్తి మహేష్ , పవన్ కల్యాణ్ ల వివాదం తాజా టీవీ రేటింగులకు ప్రధాన ముడిసరుకుగా మారింది. లక్షల మంది అభిమానులను కలిగిన పవన్ కల్యాణ్ ఇమేజ్, పాప్యులారిటీకి , సగటు సినిమా విమర్శకుడు అయిన కత్తి మహేష్ కు మధ్య అసలు పొంతనే లేదు. పవన్ మీద ఈగ వాలినా తట్టుకోలేని అభిమాన గణం కోకొల్లలుగా ఉన్నారు. తమ అభిమాన హీరోను ఏమైనా అంటే వారు సహించలేరు. విమర్శను సహేతుకంగా తీసుకోకుండా వ్యక్తిగతంగా దాడికి పాల్పడే స్థాయి వారిది. దీనిని ఆసరాగా చేసుకొనే కత్తి మహేష్ పవన్ పై ఆరోపణలు, విమర్శలతో మీడియా మెట్లపై సెలబ్రిటీ స్టేచర్ సాధించగలిగారు. ఇమేజ్ ఎవరికి పెరిగింది, డ్యామేజీ ఎవరికి జరిగిందన్న విషయాలను పక్కనపెడితే మీడియా పులిజూదంలో దీర్ఘకాలంలో అటు పవన్, ఇటు కత్తి మహేష్ బకరాలుగా మిగిలిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

రేటింగు రెక్కలు…

పవన్, కత్తి మహేష్ ల వివాదం అత్యంత ఆదరణ కలిగిన సీరియల్ గా తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడంలో టీవీ9 ది కీలకపాత్ర అన్నది నిర్వివాదాంశం. కత్తి మహేష్ ఎప్పుడో పవన్ కు సంబంధించి వ్యక్తిగత జీవితంపై చిన్న ట్వీట్ చేశారు. పవన్ దానిగురించి అసలు పట్టించుకోనే లేదు. కానీ ఆయన అభిమానులు విపరీతంగా స్పందించారు. మహేష్ కు బెదిరింపు కాల్స్ చేశారు. ఆయన హర్ట్ అయ్యారు. మంచి ఎపిసోడ్ దొరికిందని మీడియా రంగప్రవేశం చేసింది. కత్తి చేతికి మీడియా ప్లాట్ ఫారంగా మారింది. వివాదాన్ని చినికిచినికి గాలివానగా మార్చేసింది. పవన్, కత్తి ఆగర్భశత్రువులన్న స్థాయిలో రచ్చ రచ్చ చేసేసింది. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ ఎపిసోడ్ టెలివిజన్ రేటింగు పాయింట్లలో దూసుకుపోయి తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో అదే వివాదాన్ని కెలుకుతూ కత్తి ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ స్టూడియోల్లో కూర్చోబెడుతూ గత కొంతకాలంగా మాస్ మసాలా సినిమాలా నడుపుతోంది మీడియా. టీవీ9 ది ఇందులో అగ్రస్థానం. తాజాగా నటి పూనం కౌర్ ను కూడా ఈ గొడవలోకి లాగేశారు. కత్తిని కూర్చోబెట్టి గంటల తరబడి డిస్కషన్లు లాగించేశారు. రేటింగులు పైపైకి దూసుకుపోయాయి. మూఢనమ్మకాలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు అన్నిటినీ తమ ప్రజాదరణ రేటింగుకు కొలమానంగా తీసుకుంటున్న మీడియా కనీస నైతిక విలువలు, జర్నలిజం ప్రమాణాలను పక్కనపెట్టేస్తోంది. ఎటువంటి ప్రజాప్రయోజనంతోనూ ముడిపడని ఉబుసుపోని సెలబ్రిటీ గాసిప్స్ ను కాలక్షేపం కబుర్లుగా మార్చి రేటింగు పెంచుకొంటోంది. రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, విద్య,వైద్యం, రాజకీయ విధాన నిర్ణయాలు- పర్యవసానాలు , రేట్ల పెరుగుదల వంటి ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలేమీ కూడా ప్రధాన వార్తలు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం మీడియాలోని వ్యాపారాత్మక ధోరణి ,రహస్య అజెండా.

లీడర్ షిప్ తాపత్రయం…

టీవీ9 ప్రసారాలు మొదలు పెట్టిన దగ్గర్నుంచి దూకుడు కనబరిచింది. తెలుగు న్యూస్ చానల్ అన్నపదానికి టీవీ9 పర్యాయపదంగా మారింది. ఏకచ్ఛత్రాధిపత్యాన్ని సాధించింది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఈ ధోరణిలో మార్పు వచ్చింది. పోటీ చానళ్లు సైతం టీవీ9 టెక్నిక్కులనే ప్రయోగిస్తూ రేటింగు తెచ్చుకుంటున్నాయి. తెలుగు న్యూస్ చానళ్లలో 60 శాతం పైగా ఉండే టీవీ9 రేటింగు 25 , 30 శాతానికి పడిపోయింది. నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నప్పటికీ లీడర్ షిప్ మాత్రం కోల్పోయింది. పోటీ చానళ్లకు తనకు మధ్య అంతరం నాలుగైదు పాయింట్ల లోపునకు పరిమితమవుతోంది. నిజానికి మార్కెట్ లో లీడర్ కనీసం 40 శాతం వ్యూయర్షిప్ , రీడర్ షిప్ సాధించగలిగితేనే తన ప్రాముఖ్యాన్ని కాపాడుకోగలుగుతుంది. పత్రికల్లో ఈనాడు 20 లక్షల దరిదాపు సర్క్యులేషన్ తో కొనసాగుతుంటే సాక్షి, ఆంధ్రజ్యోతిల సర్క్కులేషన్ కలిపినా అంతమొత్తం కాదు. మిగిలిన తెలుగు పత్రికల సర్క్యులేషన్ నామమాత్రమే. అందుకే మొత్తం తెలుగు పత్రికల సర్క్యులేషన్ లో 40 శాతం పైగా ఉన్న ఈనాడును తెలుగు పత్రికల్లో లీడర్ గా గుర్తిస్తారు. పోటీ పత్రిక కంటే ఒక్క సంచిక ఎక్కువ అమ్ముడైనా నంబర్ వన్ అవుతుంది. కానీ లీడర్ కాలేదు. కానీ తన పోటీదారుతో చాలా తేడా ఉన్నప్పుడే లీడర్ అవుతుందనేది మార్కెట్ సూత్రం. వాహనరంగంలో మారుతి, హీరో మోటార్ సైకిళ్లు కూడా ఇలా మార్కెట్ లో 40 శాతం పైగా షేర్ ను కలిగి ఉంటాయి. తెలుగు ప్రసార మాధ్యమాల్లో నంబర్ వన్ గా ఉన్న టీవీ9 తాను కోల్పోయిన లీడర్ షిప్ స్థానాన్ని తిరిగి సాధించే క్రమంలో భాగంగా ప్రేక్షకుల బలహీనతతో ముడిపడిన వివాదాలకు పెద్ద పీట వేస్తోంది. పూనమ్ కౌర్, పవన్ లకు సంబంధించిన విషయాల్లో కత్తి మహేశ్ కు అవసరమైన సమాచారం, సాంకేతిక సహకారాన్ని కూడా టీవీ9 అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. తన రేటింగు కోసం దారి తప్పుతున్న దుష్ట సంప్రదాయానికి ఇదొక నిదర్శనం.

పెంచి…తుంచేసే …

మీడియా తన అవసరం తీరగానే ఎవరినైనా నట్టేట ముంచేస్తుంది. దీనినే నమ్ముకుని పైకి ఎదగాలని అనుకున్నవారు బొక్కబోర్లాపడ్డ ఉదంతాలు అనేకం మనకు కనిపిస్తాయి. కత్తి మహేశ్ కూడా ఈవిషయంలో జాగ్రత్త పడటం మంచిది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ రంగప్రవేశం తర్వాత మొదటి పొలిటికల్ ఇంటర్వ్యూ ఇచ్చింది టీవీ9 రవిప్రకాశ్ కే. కానీ అదే టీవీ9 ఈ రోజున కత్తి మహేశ్ ని వినియోగించి పవన్ కల్యాణ్ ని బద్నాం చేసే కార్యక్రమానికి పూనుకుంది. రేటింగు యావలో నిజమో, అబద్ధమో తెలియని, తేల్చుకోలేని ఒక ఉదంతాన్ని వైవాహికేతర సంబంధం అన్న రీతిలో అనుమానాలు రేకెత్తేలా ప్రసారం చేస్తూ పూనం కౌర్, పవన్ కల్యాణ్ లను బజారు కీడ్చే క్రమంలో అతి పెద్ద వేదికగా నిలిచింది టీవీ9. మీడియా తమకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది కదా అని సంబరపడాల్సిన అవసరం కత్తి మహేశ్ కు కూడా ఉండకూడదు. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఏ మాత్రం అవకాశం దొరికినా, అతనిలోని వ్యక్తిగత , సామాజిక జీవితంలోని చిన్న లోపం బయటపడినా అదే మీడియా బ్లోఅప్ చేసి కత్తి మహేశ్ జీవితాన్ని బజారున పడేస్తుంది. అప్పుడు జరిగే డ్యామేజీకి అడ్డు ఉండదు. గజల్ శ్రీనివాస్ విషయంలో టీవీ9, ఏబీఎన్ లు చేసినది అదే. ఏబీఎన్ చానల్ కు మా బడి పిలుస్తోంది వంటి అనేక ప్రత్యేక కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన శ్రీనివాస్ ఉదంతం బయటకు రాగానే ఏబీఎన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కేసులో బాధితురాలను బెదిరించినట్లు సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ , వేరే స్త్రీతో శ్రీనివాస్ ఉన్న దృశ్యాలను పదే పదే ప్రసారం చేసి ఆమె బతుకును కూడా బజారు పాలు చేసింది మీడియా. టీవీ 9 కి కూడా ప్రతి ప్రత్యేక సందర్బంలో నూ గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇస్తూ రేటింగుకు ముడిసరుకుగా ఉపయోగపడ్డాడు శ్రీనివాస్. కానీ ఏబీఎన్, టీవీ9 లు రెండో కోణం వైపు కనీసం తొంగిచూడకుండా అతని కుటుంబ ప్రతిష్టను, పేరు ప్రఖ్యాతులను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టేశాయి. కేసులో ఏం తేలుతుందో తెలియదు, పరువు మాత్రం భంగపడింది. అది పూడ్చలేనిది. కేవలం శ్రీనివాస్ కుటుంబమే కాదు, వేరొక గృహిణి జీవితమూ మీడియా ముడిసరుకై పోయింది. సెలబ్రిటీలు కావాలనుకుంటున్నవారు, ఆల్రెడీ ఇప్పటికే సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నవారు మీడియా విషయంలో జాగరూకంగా ఉంటే మంచిది. రేటింగు కోసం వీరు ఎక్కడికైనా తెగిస్తారు. తస్మాత్ జాగ్రత్త.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*