పవన్ క్యారెక్టర్ ఇదీ….

పవన్ స్వతహాగా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆయన చాలా సున్నిత మనస్కుడు. పుస్తకాలు ఉంటే చాలు ఇక వేరే సంగతిని పట్టించుకోరు పవన్. సమస్యల పట్ల కూడా ఆయన స్పందించే తీరు వేరే విధంగా ఉంటుంది. తనకు తెలిసిన వ్యక్తి ఆర్థిక, ఆరోగ్య సమస్యల్లో ఉన్నాడని తెలిస్తే చాలు పవన్ చాలా వేగంగా స్పందిస్తారు. అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తారు. పవన్ చేయూత నిచ్చిన విషయం మూడో వ్యక్తికి కూడా తెలియదు. అంత జాగ్రత్త పడతారు. ఎందుకంటే సాయం పొందిన వ్యక్తి అవమానం పాలవకూడదన్నది ఆయన భావన. ఇవీ పవన్ గురించి ఆయన సన్నిహితులు చెప్పే నిజాలు. సినిమా షూటింగ్ లో సయితం గ్యాప్ లో పవన్ అందరిలోనూ కలవరు. తనకు తాను వేరుగా పుస్తకం చదువుతూ కూర్చొని ఉంటారు. డైరెక్టర్ నుంచి పిలుపు వచ్చిన తర్వాతే షూటింగ్ స్పాట్ కు వెళతారు. పవన్ లో కలుపుగోలు తనం లేకపోవడానికి కూడా కారణాలు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఆయనది సిగ్గుపడే మనస్తత్వం. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. పవన్ మనస్ఫూర్తిగా మాట్లాడే వ్యక్తులు అతి కొద్దిమందే ఉంటారని ఆయనను దగ్గర నుంచి గమనించిన వ్యక్తులు చెబుతారు.

జిల్లా ఓకే…నియోజకవర్గమే….?

అలాంటి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణించగలరా? అన్న ప్రశ్న కూడా ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తమవుతోంది. ప్రస్తుత రాజకీయాలకు పవన్ సరిపోడన్నది వారి వాదన. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఈ రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తరచూ అనే మాట తనకు అధికారం అవసరం లేదని. అధికారం కోసమే రాజకీయాల్లోకి రాలేదని. అధికారంలోకి రాకుండా ప్రజాసేవ చేయడం ఎలా అని వారంటున్నారు. కాని పవన్ మాత్రం అధికారం లేకపోయినా ప్రజాసేవ చేయొచ్చని చెబుతున్నారు. ఇంతకీ పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో ఏ స్థానం నుంచి పోటీ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కదిరి లేదా గుత్తి నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ మేరకు పవన్ ప్రయివేటుగా ఆప్రాంతాల్లో సర్వే కూడా చేయించుకుంటున్నట్లు సమాచారం. ఏ పార్టీ నుంచి ఏ నేత పోటీ చేస్తారు? వారిపై తాను పోటీకి దిగితే ఎలా ఉంటుంది? పవన్ పై ఆ నియోజకవర్గ ప్రజల మనసులో మాటను సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. సర్వే నివేదిక వచ్చిన తర్వాత గాని పవన్ నియోజకవర్గాన్ని ఎంచుకునే వీలుండదు. అనంతపురం జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించేందుకు జనసేన పార్టీ సన్నాహాలు చేస్తోంది. పవన్ ప్రకటించారు కాబట్టి రాయలసీమ నుంచే పార్టీ కార్యక్రమాలను ప్రారంభించే వీలుందని తెలుస్తోంది.