పవన్ క్లారిటీ ఇచ్చినా టీడీపీ మాత్రం….?

నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన మద్దతు తమకేనని టీడీపీ చెబుతుండటం జనసేన వర్గాలకు మింగుడు పడటం లేదు. తమ మద్దతు ఎవరికీ లేదని, ఈ అభ్యర్థికీ తాను అండగా నిలిచేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం జనసేన మద్దతు తమకేనని బాహాటంగా చెబుతుండటం విచిత్రంగా ఉంది. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అధికార టీడీపీ ఇదే వైఖరిని అవలంబిస్తోంది. నంద్యాల నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కాల్వ శ్రీనివాసులు నేరుగా మీడియా ముందుకు వచ్చి పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు టీడీపీ అభ్యర్థికే మద్దతిస్తున్నారని ప్రకటించారు. పవన్ తన మద్దతు ఎవరకీ లేదని తెలిపిన తర్వాతే కాల్వ ఈ ప్రకటన చేయడం వెనక వ్యూహమేంటన్న చర్చ జరుగుతోంది. మంత్రి కాల్వతో పాటు భూమా అఖిలప్రియ, మౌనిక కూడా న్యాయం వైపే జనసేనాని ఉంటారని, తమవైపే న్యాయం ఉంది కాబట్టి టీడీపీ అభ్యర్థికే పవన్ మద్దతు ఉందని తెలిపారు. జనసేన కార్యకర్తలు కూడా తమ వెంటే ఉన్నారన్నారు.

పవన్ మా వెంటే అంటున్న టీడీపీ…….

నంద్యాల ఓటర్లలో అయోమయాన్ని సృష్టించేందుకే టీడీపీ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పదిహేను రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడిని కలిసిన మరుసటి రోజు నుంచే నంద్యాలలో పవన్ ను టీడీపీ ఉపయోగించుకుంటోంది. స్థానికంగా ఉన్న జనసేన కార్యకర్తలతో కూడా మంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పవన్ మద్దతు తమకే ఇస్తారని చెప్పడంతో జనసేన కార్యకర్తలు కూడా జెండా, పవన్ ఫొటోతో ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా బుధవారం పవన్ ప్రకటన చేయడంతో టీడీపీ షాక్ కు గురయింది. పవన్ ఏ ప్రకటన చేయరని టీడీపీ భావించింది. అయితే స్పష్టంగా తన మద్దతు ఎవరికీ లేదని పవన్ ప్రకటించడంతో మరో వ్యూహానికి తెర లేపింది. దురదృష్టకర పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికకు పవన్ మద్దతు ఉందని ఆ పార్టీ ప్రకటించడంతో స్థానిక జనసేన కార్యకర్తలు పవన్ ను కలిసేందుకు రాజధాని బయలుదేరి వచ్చినట్లు తెలిసింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా టీడీపీ ఇదే వ్యూహాన్ని అమలుపరుస్తోంది. దీంతో పవన్ మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*