పవన్ ను నమ్మడం ఎలా?

ప్ర‌జా రాజ‌కీయంలో ఉన్న‌వారు ఎవ‌రైనా ప్ర‌జ‌ల నాడిని తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటేనే రాజ‌కీయాల్లో గెలుపు గుర్రం ఎక్కుతార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. దీనికి ఎవ్వ‌రూ అతీతులు కారు. న‌ట‌సార్వ‌భౌముడిగా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిన అన్న‌గారు ఎన్టీఆర్ సైతం.. రాజ‌కీయ జీవితంలోకి అడుగుపెట్టాక ఎలా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారో.. రాజ‌కీయ నేత‌గా వారి హృద‌యాల్లో స్థానం పొందేందుకు ఎంత‌గా శ్ర‌మించారో తెల‌యందికాదు. ఇక‌, కాంగ్రెస్‌పై పోరు బాట ప‌ట్టిన జ‌గ‌న్‌.. కూడా ప్ర‌జ‌లతో మ‌మేక‌మ‌య్యేందుకు నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉన్న విధానం అంద‌రికీ తెలిసిందే.

నాలుగేళ్లు గడిచినా…..

ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వ‌స్తోందంటే.. ప్ర‌శ్నిస్తానంటూ ప్ర‌జా రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. పార్టీ పెట్టి నాలుగేళ్లు గ‌డిచిపోయింది. ఆయ‌న వ్యూహాలు, సిద్ధాంతాల మాటేమో కానీ.. అస‌లు గ్రామ స్థాయిలో ఆయ‌న‌కున్న గుర్తింపుపైనే ఇప్పుడు పెనుచ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో ప‌ట్ట‌ణాలు ఉన్న‌వి నాలుగు మాత్ర‌మే. మిగిలిన‌వ‌న్నీ ప‌ల్లెలు, గ్రామాలే. వీటిలో నివ‌శింసే వారి కరుణ లేకుంటే.. ఎంత‌టి రాజ‌కీయ నాయ‌కుడు సైతం.. బోల్తా కొట్టాల్సిందే. హ‌డావుడిగా నాలుగు ప్ర‌క‌ట‌న‌లు, మ‌రో నాలుగు విమ‌ర్శ‌ల‌తో పొద్దు పుచ్చుతే.. రాజ‌కీయాల్లో గెలుపు గుర్రం ఎక్క‌గ‌ల‌మ‌నుకుంటే.. అంత‌క‌న్నా మిడిసిపాటు మ‌రొక‌టి లేద‌నేది ప్ర‌జారాజ్యం వంటి విఫ‌ల‌మైన రాజ‌కీయ పార్టీ చ‌రిత్ర చూస్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంది.

గ్రామస్థాయిలో పట్టు……

ప్ర‌శ్నిస్తాన‌న్న ప‌వ‌న్‌.. విష‌యాన్ని తీసుకుంటే.. గ‌త ఎన్టీఆర్‌కు ఉన్న‌టువంటి క్రేజ్ ఏమీ లేద‌నే చెప్పాలి. యూత్‌కు తెలిసినంత మాత్రాన రాజ‌కీయాల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మే. మ‌రి గ్రామ‌స్థాయిలో ఎంత‌మందిని క‌దిలించ‌గ‌లిగే శ‌క్తి సామ‌ర్ధ్యాలు ప‌వ‌న్‌కు ఉన్నాయి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. నిజానికి ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ శూన్య‌త ఉంది. అధికారంలో ఉన్న పార్టీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం బొత్తిగా కొర‌వడింది. ఇది న‌గ్న‌స‌త్యం. ఎమ్మెల్యేల దూకుడు, అవినీతి, ప్ర‌జ‌ల కు అందాల్సిన ఫ‌లాలు జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో టీడీపీ త‌మ్ముళ్లే కొట్టేస్తున్న వైనం. పైపై మెరుగుల పాత్ర పోషిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. ఎందుకూ కొర‌గాని మంత్రులు.. ఇలా చెప్పుకొంటూ పోతే.. టీడీపీ విఫ‌ల చిట్టా చాంతాడును మించిపోతుంది.

వైసీపీని నమ్ముదామనుకున్నా….

పోనీ.. విప‌క్షం వైసీపీని న‌మ్ముదామ‌న్నా.. ఆయన చుట్టూ కేసులు ఉన్నాయి. త‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను త‌ప్పించుకునేందుకు కానీ, త‌నపై పెట్టిన కేసులు నిజం కావ‌ని నిరూపించుకోవ‌డం లో కానీ జ‌గ‌న్ ఇప్ప‌టికీ స‌క్సెస్ కాలేక‌పోతున్నారు. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయ‌కులు కూడా చాలా మందికి వ‌చ్చే ఏడాది ఏక‌ప‌క్షంగా ప్ర‌జ‌లు త‌మ‌కు ఓట్లేస్తార‌నే న‌మ్మ‌కం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఏపీలో నిఖార్స‌యిన‌, నిజ‌మైన నేత కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు.

పవన్ పై నమ్మకం పెట్టుకుందామంటే…?

ఈ క్ర‌మంలోనే వారికి ఆశాకిర‌ణంగా ప‌వ‌న్ క‌నిపిస్తున్నారా? ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకుందామా? అంటే అది కూడా మిలియ‌న్ డాల‌ర్ల సందేహంగానే మిగిలిపోయింది. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. ప్ర‌స్తుతం విజయనగరంలో బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తున్నా.. ఆయ‌న‌పై ఎక్క‌డో అనేక సందేహాలు నెల‌కొన్నాయి. నిజానికి శ్రీకాకుళం క‌న్నా ఎక్కువ స‌మ‌స్య‌ల‌తో అల్లాడిపోతున్న జిల్లాలు అనేకం ఏపీలో ఉన్నాయి. మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ అన్ని జిల్లాల్లోనూ ప‌ర్య‌టించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ, ఆయ‌న 45 రోజుల టూర్ షెడ్యూల్ పెట్టుకోవ‌డం అంటే.. త‌న పార్టీని కొన్ని జిల్లాలకే ప‌రిమితం చేస్తున్న‌ట్టు అనుకోవాలా? అనే ప్ర‌శ్న‌లూ వ‌స్తున్నాయి.

సిక్కోలు రెండు పార్టీలకూ….

పైగా ఈ జిల్లా అటు టీడీపీకి, ఇటు కాంగ్రెస్‌, వైసీపీల‌కూ కంచుకోట‌. ఇక్క‌డ రాజ‌కీయ దిగ్గ‌జాలు బ‌రిలో ఉండ‌నున్నాయి. వారికి స‌రైన పోటీ ఇచ్చే నాయ‌కుడు జ‌న‌సేనాని తీసుకు రాగ‌ల‌డా ? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్ర‌జ‌ల నాడి ఏంటి? వారు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి నాయ‌కుడు ఉండాల‌ని ఆశిస్తున్నారు? వ‌ంటి కీల‌క అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని జిల్లాకు నాలుగు రోజుల చొప్పున కేటాయించుకుని క‌నీసం ఎన్నిక‌ల షెడ్యూల్ నాటికి రెండు నుంచి మూడు సార్లు ప‌ర్య‌టిస్తేనే.. ప‌వ‌న్ ఏమిటో ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేది! మ‌రి ఆదిశ‌గా జ‌న‌సేనాని అడుగులు ప‌డ‌తాయా?! చూడాలి!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*