పవన్ పార్టీ ఇలా చేస్తే సరిపోతుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనినిర్ణయించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ పై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయన సభ్యత్వాలను పరిశీలించారు. ఇటీవల జరిగిన ప్లీనరీలో మిస్డ్ కాల్ సభ్యత్వాన్ని జనసేనాని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం వచ్చినట్లేనని పవన్ కల్యాణ్ సభలో చెప్పడంతో దీనికి మంచి స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 17 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నట్లు జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.

జనసైనికులకు శిక్షణ….

అయితే పార్టీ సభ్యత్వం తీసుకున్న వారందరికీ శిక్షణతో పాటు జనసేన సిద్ధాంతాలు, విధివిదానాలను వారికి వివరించాలని నిర్ణయించారు. వీరిలో కొంతమందిని ఎన్నికల్లో బూత్ లెవెల్లో ఉపయోగించుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ముందుగా ఏపీలోని వివిధ జిల్లాల కార్యకర్తలతో ఆయన మాట్లాడనున్నారు. ఈనెల 4,5 తేదీలలో పవన్ విజయవాడ పర్యటన పెట్టుకున్నారు. విజయవాడలోనే కృష్ణా, గుంటూరు జనసేన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ప్లీనరీలో తాను చేసిన వ్యాఖ్యలు, తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.

వామపక్ష నేతలతో భేటీ….

అలాగే విజయవాడలో ఈనెల 4వ తేదీన వామపక్ష పార్టీ నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, జనసేన కలసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే జనసేనతో కలసి వెళ్లేందుకు సీపీఐ సిద్ధమయిపోయింది. సీపీఎం కూడా రెడీగానే ఉంది. మూడు పార్టీలతో కలిపి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది.

ఉద్యమ కార్యాచరణపై క్లారిటీ…..

వామపక్షాలతో చర్చల అనంతరం విభజన హామీల అమలుపై పోరాటాన్ని కూడా పవన్ ప్రకటించనున్నారు. విద్యార్థులు, యువతను పక్కనపెట్టి ఉద్యమం చేయాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలన్నదానిపై సీపీఐ, సీపీఎం నేతలతో పవన్ చర్చిస్తారు. రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమల నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం కోసం చర్యలు ప్రారంభించడమే కాకుండా, పొత్తులు, ఉద్యమ కార్యాచరణపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*