పవన్ పై చంద్రబాబు కోపానికి ఇదే కారణమా?

పవన్ పై చంద్రబాబు అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటి? తాను ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని… శాసనసభకు మాత్రమే ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన లెక్కలెంతో అడిగారు. తాను ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏపీకి జరిగిన అన్యాయంపై నిజాలను వెలుగుతీస్తుందని చెప్పారు. అయితే నిన్నటి వరకూ పవన్ చేస్తున్న పోరాటం మంచిదేనన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారు. ఎవరో లెక్కలు అడిగితే తాము చెప్పాల్సిన పనిలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

తొలిరోజు పొగిడి….

అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యల వెనక కారణాలున్నాయంటున్నారు. తొలిరోజు జరిగిన జేఎఫ్ సి సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ జరుగుతుందని అందరూ భావించారు. కాని సాంకేతిక అంశాలను తేల్చడానికి పవన్ కల్యాణ్ ముగ్గురి సభ్యులతో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీని నిన్న సాయంత్రం ప్రకటించారు. అయితే ఈ కమిటీలో మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ రావులు ఉన్నారు.

ఐవైఆర్ ను నియమించడంతోనే….

ఇదే చంద్రబాబుకు నచ్చని విషయమంటున్నారు. ఐవైఆర్ కృష్ణారావు విభజన ఆంధ్రప్రదేశ్ కు తొలి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత చంద్రబాబు ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. అయితే కార్పొరేషన్ కు నిధులు కేటాయించకపోవడం, తనకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడతో ఫేస్ బుక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐవైఆర్ పోస్టింగ్ లు పెట్టారు. దీంతో కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి చంద్రబాబు ఐవైఆర్ ను తప్పించారు. అప్పటి నుంచి ఏపీ సర్కార్ పై ఐవైఆర్ యుద్ధమే చేస్తున్నారు. రాజధాని భూముల విషయంలో అవకతవకలను బయటపెట్టారు.

ఇప్పటికే ఐవైఆర్ విమర్శలు….

అంతేకాకుండా రాజధాని డిజైన్ల విషయంలో విదేశీ కంపెనీలకు అప్పగించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వంలో లొసుగులన్నింటినీ ఒక్కొక్కటిగా ఇటీవల ఐవైఆర్ బయటపెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐవైఆర్ ను కమిటీలో నియమించడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఐవైఆర్ తనను, తన ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తుంటే ఆయనను కమిటీలో నియమించి తనను అవమానించారని చంద్రబాబు భావించారు. అందుకోసమే పవన్ పై చంద్రబాబు పరోక్షంగా ఫైరయినట్లు అమరావతి వర్గాల టాక్. పవన్ మీద మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ ఐవైఆర్ వల్లనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*