పవన్ రాజకీయాలన్నా…. సినిమాలన్నా!

రాజ‌కీయ వార‌స‌త్వాల గురించి జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ అభిమానుల స‌మావేశంలో వీరావేశంగా ప్ర‌సంగించారు. వినేందుకు చాలా బాగుంద‌ని అనిపించినా.. ప‌వ‌న్ ఒక్క రాజ‌కీయాల్లో వార‌స‌త్వం గురించే కాకుండా.. సీని రంగంలో వార‌స‌త్వానికి కూడా కౌంట‌ర్‌గా మాట్లాడి ఉంటే బాగుండేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో వార‌స‌త్వంపై ప‌వ‌న్ పేల్చిన బాంబులు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ ను ప‌రోక్షంగా పేర్కొంటూ పేల్చిన కామెంట్లు, తండ్రి చ‌నిపోగానే సీఎం సీటు ఇచ్చేయాలా? అంటూ అడిగిన ప్ర‌శ్న‌లు. ఇలాంటివి త‌న‌కు న‌చ్చ‌వ‌ని చెప్ప‌డం అంతా.. ఓకే.. అయితే అదేస‌మ‌యంలో సీనిమా రంగంలో ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న వార‌స‌త్వ విష‌యాల‌పైనా ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేద‌నే టాక్ వినిపిస్తోంది.

మెగా ప్యాక్ అంటే….

సినిమాల్లో మెగా కుటుంబం నుంచే ఫ్యామిలీ ప్యాక్ ఉంది. చిరంజీవి త‌మ్ముడు అయి ఉండకపోతే పవన్ కళ్యాణ్ సినిమా హీరో అయ్యేవాడా? ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తనకు అసలు నటనే రాదని చెప్పారు. మరి అసలు నటనే రాని పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో పవర్ స్టార్ ఎలా అయ్యారు?. చిరంజీవి విషయానికి వస్తే ఆయన స్వయంకృషితో పరిశ్రమలో ఎదిగారు. చిరు సోదరులుగా ఉన్న నాగబాబు, పవన్ కళ్యాణ్ పరిశ్రమలో అడుగుపెట్టారంటే దానికి చిరంజీవే కారణం కదా?. చిరు తనయుడు రామ్ చరణ్ పరిస్థితి ఏంటి?. మెగా ఫ్యామిలీ ప్యాక్ అంతా ఎక్కడో నైపుణ్యాలు సాధించి పరిశ్రమలోకి వచ్చారా? రామ్ చరణ్ తొలి సినిమాలో ఏ మాత్రం హావభావాలు ప్రకటించలేకపోయినా..కేవలం మెగా ప్యామిలీ అని.. చిరు అభిమానులు ఆదరించలేదా ? ఆ మాట‌కు వ‌స్తే రాంచ‌ర‌ణ్‌కు ఇప్ప‌ట‌కీ న‌ట‌న రాద‌న్న విమ‌ర్శ‌లే ఎక్కువుగా వినిపిస్తుంటాయి. రాంచ‌ర‌ణ్‌ను సింగిల్ ఎక్స్‌ప్రెష‌న్ హీరో అని సెటైర్లు వేసే వాళ్లే ఎక్కువ‌. మరి సినిమాల్లో తప్పుకాని వారసత్వాలు రాజకీయాల్లో తప్పు ఎలా అవుతాయో ప‌వ‌న్ వెల్ల‌డించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.

లోకేష్ ది వారసత్వం కాదా?

రామ్ చరణ్ కంటే గొప్పగా నటించగల వ్యక్తులు బయట ఎవరూ లేరా? వారికి అవకాశం వస్తుందా? పోనీ మెగా ప్యామిలీ అలాంటి వాళ్ళను గుర్తించి ఇప్పటివరకూ ఒక్కరికైనా పరిశ్రమలో అవకాశం కల్పించిందా? అలాంటి చరిత్ర ఉందా? అది సినిమా అయినా…రాజకీయాల్లో అయినా ఎవరి రంగాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని.. తమ కంటే ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళకు కనీసం ఎంట్రీ కూడా లేకుండా చేయటంలేదా? సో.. రంగంతో ప‌నిలేకుండా ఆధిప‌త్యం, నిల‌బెట్టుకోవ‌డం, అజ‌మాయిషీలతోనే ప్ర‌తి రంగం వ‌ర్ధిల్లుతోంది. చంద్ర‌బాబుకు జ‌గ‌న్ సీఎం సీటును కోరితే అనుభ‌వం ఉన్న‌వారికే ఆ సీటు ఇవ్వాల‌ని ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి ఏ క్వాలిఫికేష‌న్‌, అనుభ‌వంతో లోకేష్‌కు అత్యంత కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖ‌లు అప్ప‌గించారు? మ‌రి ప‌వ‌న్ వీటిపైనా పొడి పొడి మాట‌లు కాకుండా.. పూర్తిగా మాట్ల‌డితే బాగుండేది. చెప్ప‌డానికి, చేయ‌డానికి చాలా తేడా ఉంటుంది గురూ!!