‘పవర్ ’ కావాలంటే పవర్ స్టార్ కావాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జాతీయ పార్టీని వదిలేసి ప్రాంతీయ పార్టీల పొత్తుల కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీల కోసం ఇప్పుడు ఎవరూ వెంపర్లాడటం లేదు. ఏపీలో పవర్ లోకి రావాలంటే పవర్ స్టార్ తో పొత్తు పెట్టుకోవాల్సిందేనని రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీలు రెండూ పవన్ కల్యాణ్ పార్టీని తమ వెంట తెచ్చుకునేందుకు అనేక రకమైన వ్యూహాలను ఇప్పటి నుంచే అమలుపరుస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసేనతో పొత్తు పెట్టుకుని తీరాలని ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ తోపాటు ఒక యువ ఎమ్మెల్యే ఈ మేరకు పవన్ తో చర్చలు జరుపనున్నారు. నిన్న జరిగిన పార్టీ నేతల సమావేశంలోనూ వైసీపీ అధినేత జగన్ సూత్రప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం అటు పవన్, ఇటు జగన్ ఇద్దరూ పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసిందని, విభజన వల్ల కష్టాల పాలయిన ఏపీని కేంద్ర పట్టించుకోవడం లేదన్నది ఇద్దరీ అభిప్రాయం. దీంతోపాటు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి తలొగ్గిన టీడీపీపై కూడా ఈ యువనేతలిద్దరూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకటవుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వైసీపీ సీనియర్ నేత ఒకరు చర్చలు జరుగుతున్నాయని కూడా నిర్ధారించారు. అయితే ఈ ప్రతిపాదనకు పవన్ అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

బీజేపీ బకరా అవుతుందా?

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీని వదిలించుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఎన్నికలు వచ్చేంతవరకూ కేంద్రం ఇచ్చే నిధుల కోసం పొత్తులపై బహిరంగంగా మాట్లాడకపోయినా ఎన్నికలకు ముందు కమలనాధులకు చంద్రబాబు ఝలక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పార్టీకి తలనొప్పిగా మారారు. ఏపీలో వారికి బలం లేకపోయినా మోడీని చూసి రెచ్చిపోతున్నారని టీడీపీ వర్గాలే అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నాయి. అయితే బలం లేని బీజేపీని దగ్గరకు చేర్చుకోవడం కంటే… పవన్ పార్టీతో పొత్తు పెట్టుకుని నలభై నుంచి యాభై సీట్లు ఇచ్చినా మంచిదేనని అధినేత ఆలోచిస్తున్నారు. పవన్ కు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు ఇవ్వాలన్నది చంద్రబాబు వ్యూహం. పవన్ తో పొత్తు పెట్టుకుంటే కేవలం కాపు సామాజిక వర్గ ఓటర్లను మాత్రమే కాకుండా యూత్ ఓట్లను రాబట్టుకోవచ్చన్నది నాయుడి గారి ఆలోచన. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పై ఎవరు మాట్లాడినా చంద్రబాబు అంగీకరించడం లేదు. కాపు మంత్రి ఒకరు పవన్ తో పొత్తు చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీని వదిలేస్తే పవన్ ఖచ్చితంగా తమ వైపు వస్తారని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బకరా కాక తప్పేలా లేదు. అయితే ఈ రెండు పార్టీల్లో పవన్ ఏ పార్టీతో పొత్తుకు అంగీకరిస్తారన్నది సస్పెన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*