పాక్ లో రాజకీయ అనిశ్చితి కారణాలేంటి?

పనామా గేట్….ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చీనీయాంశం. వివిధ దేశాల పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే అంశం. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను పదవీచ్యుతిని చేసిందీ కుంభకోణం. విచారణ సక్రమంగా, సాఫీగా జరిగితే ఒక్క పాకిస్థానే కాదు ఇతర దేశాల్లోనూ పాలకుల పీఠాలను కదిలించగల శక్తి ఉంది ఈ కుంభకోణానికి. 2016లో వెలుగులోకి వచ్చిందీ కుంభకోణం. అప్పటి నుంచి ఆయా దేశాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ అంశం. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్విస్టిగేషన్ జర్నలిస్ట్ (ఐసీఐజే) 1.15 కోట్ల రహస్య పత్రాలను బయటపెట్టింది. సుమారు 2.15 లక్షల విదేశీ కంపెనీల వ్యాపార లావాదేవీల వివరాలతో కూడిన ఇవన్నీ పనామా సంస్థ మొసాక్ ఫోన్సెకా పత్రాలే. అందువల్లే వీటిని పనామా పత్రాలుగా వ్యవహరిస్తారు. వివిధ దేశాల అధినేతలు, సంపన్నులు, ఉన్నతాధికారులకు సంబంధించిన అక్రమ లావాదేవీలను ఇవి వెల్లడించాయి.

పనామా కుంభకోణంలో ఎందరో…..

ఈ కుంభకోణంలో ఒక్క నవాజ్ షరీఫ్ కాక, వివిధ దేశాల అధినేతలు, వారిబంధువులు,కుటుంబ సభ్యుల బాగోతాలు బయటపడ్డాయి. కుంభకోణం వెలుగు చూసిన వెంటనే ఐస్ ల్యాండ్ ప్రధాని సిగ్మందర్ గున్ లాంగ్ సన్ పదవి నుంచి వైదొలిగారు. సూడాన్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అల్ మిర్ఘానీ, ఖతార్ కు చెందిన హమద్ బన్ ఖలీఫా, జార్జియా, ఉక్రెయిన్, ఇరాక్, మాల్దోవా, జోర్డాన్ మాజీ ప్రధానుల పాత్రను వెల్లడించాయి. చైనా అధినేత జిన్ పింగ్ దగ్గరి బంధువులు, మలేసియా ప్రధాని నజీబ్ రజక్ కుమారుడు, అజర్ బైజాన్ అధ్యక్షుడి పిల్లలు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా సమీప బంధువు,కజికిస్థాన్ అధ్యక్షుడి మనవడు, మొరాకో రాజు మహమ్మద్ వ్యక్తిగత కార్యదర్శి, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్ కుమారుడు, మెక్సిక అధ్యక్షుడు ఎన్రిక్ ఫెనా సన్నిహిత గుత్తేదారు స్పెయిన్ రాజకుటుంబ సభ్యుల పాత్ర ఉందని పనామా పత్రాలు వెల్లడించాయి.

వివిధ దేశాల్లో నత్తనడకన….

కుంభకోణానికి సంబంధించి ఇతర దేశాల్లో వివిధ కారణాల వల్ల విచారణ ప్రక్రియ నత్తనడకన సాగుతోండగా, న్యాయవ్యవస్థ క్రియాశీలత,మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ న్యాయ పోరాటం ఫలితంగా నవాజ్ షరీఫ్ పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. తొలుత ఆరోపణలు రాగానే ఖండించిన షరీఫ్ విచారణకు ఆదేశించారు. అంతేకాక ఆరోపణలు రుజువైతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. షరీఫ్ రాజీనామా కోరుతూ ఆందోళన చేయడంతో పాటు ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పాక్ సర్వోన్నత న్యాయస్థానం గత ఏడాది నవంబరు 1న విచారణకు స్వీకరించడంతో కదలిక వచ్చింది. ప్రాధమిక విచారణ అనంతరం సయుక్త దర్యాప్తు సంఘం (జిట్ జాయింట్ ఇన్విస్టిగేషన్) ఏర్పాటు చేసింది. రెండు నెలల విచారణ అనంతరం ఈనెల 10న జిట్ నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. నవాజ్ తో పాటు ఆయన ఇద్దరు కుమారులు, కూతురు మర్యం షరీఫ్, తమ్ముడైన పంజాబ్ ముఖ్యమంత్రి షెబనాజ్ ను విచారించిన జిట్ షరీఫ్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించింది. షరీఫ్ పదవిని అడ్డుపెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో అక్రమంగా ఆస్తులు సంపాదించారని స్పష్టంగా పేర్కొంది. లండన్ లని కీలక ప్రాంతాల్లో విలాసవంతమైన భవంతులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. విచారణకు స్వయంగా షరీఫ్ జిట్ ముందు హాజరయ్యారు. పాక్ చరిత్రలో ఒక ప్రధాని విచారణ సంఘం ముందు హాజరవ్వడం ఇదే ప్రధమం. జిట్ నివేదికను సమగ్రంగా పరిశీలించిన అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం షరీఫ్ అవినీతిని నిర్ధారిస్తూ, పదవిలో కొనసాగేందుకు అనర్హుడిగా ప్రకటించింది.

మూడుసార్లూ అర్ధంతరంగానే……

పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన షరీఫ్ ది సంపన్న వ్యాపార కుటుంబం. ఆయన తండ్రి హయాం నుంచే విదేశాల్లో ఇనుము వ్యాపారం చేస్తోంది. భారత్ లోని పంజాబ్ రాష్ట్ర సరిహద్దుల్లో పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ ఉంది. ఈ ప్రావిన్స్ ు షరీఫ్ తమ్ముడే పాలిస్తున్నాడు. షరీఫ్ కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలతో పరిచయం ఉంది. భారత్ లోని వ్యాపార కుటుంబాలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకూ మూడుసార్లు ప్రధాని పదవి చేపట్టిన నవాజ్ షరీఫ్ ఏ ఒక్కసారి పూర్తికాలం పదవిలో కొనసాగలేక పోయారు. 1990లో బాధ్యతలు చేపట్టిన తొలిసారి అప్పటి అధ్యక్షుడితో విభేదాల కారణంగా 1993 ఏప్రిల్ నెలలో రాజీనామా చేశారు. రెండోసారి 1997లో అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సైనిక కుట్ర ఫలితంగా బలవంతంగా పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. మూడోసారి 2013లో తిరుగులేని ప్రజాతీర్పుతో పదవి చేపట్టిన షరీఫ్ అయిదేళ్లు పూర్తి కాకుండానే అర్థంతరంగా రాజీనామా చేశారు. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం వ్యక్తిగతంగా నవాజ్ షరీఫ్ కు, ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లి లీగ్ (ఎన్) కు శరాఘాతమే. కారణాలు ఏమైనప్పటికీ పాక్ ప్రధానుల్లో ఇప్పటి వరకూ ఏ ప్రధానీ పూర్తి కాలం పదవిలో కొనసాగక పోవడం ఆ దేశ రాజకీయ అస్థిరతకు నిదర్శనం. న్యాయవ్యవస్థ, సైన్యం కుమ్మక్కై షరీఫ్ కు వ్యతిరేకంగా పనిచేశాయన్న వాదన ఆ దేశ వర్గాల్లో ఉంది. పొరుగుదేశం పరిణామాలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. వేచి చూసే ధోరణిలో ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*