పాజిటివ్ పాలిటిక్స్ తో పవన్ రాణిస్తారా …?

దేశంలో ప్రపంచంలో ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పాజిటివ్ మార్గంలో వెళ్ళే రాజకీయాలు ఎక్కడన్నా నడుస్తున్నాయా …? చాలా వరకు కనపడటం లేదు. కానీ ఒక సరికొత్త రాజకీయ చరిత్రకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరతీస్తూ పూర్తి స్థాయి రాజకీయ అరంగేట్రానికి శంఖారావం పూరించడం విశేషం. వాస్తవానికి మంచిని మంచిగా చెడును చెడుగా ప్రస్తావించే రాజకీయ శకం గతంలోనే ముగిసిపోయింది. ఇప్పుడు పరనింద… ఆత్మస్తుతి అనే విధంగానే రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యం అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల దృష్టికి ఆయా సమస్యలు తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి ఇలాంటి తీరు చాలా మంచి రాజకీయానికి సరికొత్త సంప్రదాయానికి నాంది ప్రస్తావనే. కానీ ఆయా ప్రభుత్వాలు చేస్తున్న అవినీతి అక్రమాలను ఎప్పుడైతే జనసేన ప్రశ్నలు వేయలేదో సర్కార్ వ్యతిరేక ఓటు దక్కించుకునే పరిస్థితి ఉండదు సరికదా పొత్తు లేకుండా పోటీచేస్తే అధికారపార్టీ ఓట్ల చీలికకే దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ రూటే సపరేట్ ….

పవన్ కళ్యాణ్ తీరు శైలి విభిన్నం. గతంలో ప్రజారాజ్యం లో వున్నప్పుడు కూడా ప్రచారం కానీ, చేసిన వ్యాఖ్యలు, అభిమానులతో భేటీలు కానీ ప్రత్యేకంగా స్పష్టంగా కనిపించేవి. జనసేన పార్టీ స్థాపించిన తరువాత కూడా విభిన్న రాజకీయాలనే ఆయన నడుపుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో టిడిపి,బిజెపి లతో కలిసి ఓట్లు చీలుతాయనే పోటీకి దూరమని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బలపడి పోటీ చేస్తామని చెప్పారు. ఆ తరువాత కొన్ని కొన్ని సమస్యలపై మాత్రం స్పందించి ఏపీలో చంద్రబాబు తో కొంతవరకు ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా పవన్ అడుగులు వేశారు. రాజధాని భూములు అంశంలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటమని వెనుకడుగులు జనసేన కు మైనస్ లుగా వున్నాయి. ఆవేశపూరిత రాజకీయ ప్రసంగాలకు కేరాఫ్ అయిన పవన్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో కూల్ గానే వ్యవహరించారు. తన షెడ్యూల్ తన ఆలోచనలు తెలియచేస్తూ కేసీఆర్, చంద్రబాబు లకు తాను వ్యతిరేకంగా వెల్లబోవడం లేదని స్పష్టం చేశారు. జనసేన అనేక అంశాలపై క్లారిటీ ఇవ్వడం లేదన్న అంశాలకు తాము భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలే సమాధానం చెబుతాయన్నారు జనసేనాని.

బలం తెలుసుకునే పనిలో …

అసలు జన సైన్యం బలమెంత ? క్షేత్ర స్థాయిలో వున్న పరిస్థితులు, ప్రజల్లో వున్న భావనలు ఏంటి ? ఇలాంటి అంశాలపై జనసేన అధినేత పూర్తి క్లారిటీ తీసుకోవడానికే తానూ చేయబోయే యాత్రను వినియోగించనున్నారు. గ్రౌండ్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా పవన్ తన పార్టీ గమనాన్ని నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. సరికొత్త తరహా రాజకీయంతో మరోసారి ప్రజల ముందుకు రాబోతున్న జనసేన ను ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు వచ్చే ఎన్నికల్లో తీర్పు ఏమి ఇవ్వబోతారు అన్నది కాలమే తేల్చాలి. పాజిటివ్ పాలిటిక్స్ పేరిట సాగే కొత్త ప్రయత్నం కాయా? పండవుతుందా రాబోయే ఎన్నికల ఫలితాలే చెప్పనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*