పాదయాత్ర కంటే ఆ రెండింటికే జగన్ ప్రాధాన్యత

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పన్నెండో రోజుకు చేరుకుంది. అయితే ఆయన పాదయాత్ర కన్నా ఎక్కువ నైట్ మీటింగ్ లు, ఉదయం సమావేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. పార్టీకి క్యాడర్ ముఖ్యం. ద్వితీయ శ్రేణి నేతలు అంతకంటే ఎక్కువ ముఖ్యం. అది గుర్తించిన జగన్ ముందుగా నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూనే క్యాడర్ పైన, ద్వితీయ శ్రేణి నేతలతో ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యనేతలను పక్కనపెట్టి వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఇప్పటికి పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర పూర్తయింది. ఇప్పుడు బనగానపల్లెలో పర్యటిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రికి 7.30గంటల సమయంలో పాదయాత్రను బహిరంగ సభతో జగన్ ముగిస్తున్నారు. బహిరంగ సభ ముగిసిన వెంటనే తనకు కేటాయించిన బస వద్దకు జగన్ చేరుకుంటున్నారు.

రెండు పూటలా సమావేశాలు….

జగన్ బస చేసిన ప్రాంతంలోనే రాత్రి పూట ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీ పరంగా ఏ సాయం కావాలన్నా చేస్తామని వారికి జగన్ హామీలు ఇస్తున్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం 7.30గంటలకు ద్వితీయ శ్రేణి నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. వీరందరితో చాలాసేపు ముచ్చటిస్తున్నారు. వారితో సెల్ఫీలు దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడమని, విజయం సాధిస్తే పదవులు ఖచ్చితంగా అందరికీ లభిస్తాయని వారిలో జగన్ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి నేతల్లోనూ ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఇలా పాదయాత్ర కంటే జగన్ ముఖ్యంగా ఈ రెండు పూట్ల జరిగే సమావేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైసీపీ నేతలు చమత్కరిస్తున్నారు. బహిరంగ సభలో ఉండగానే కార్యకర్తల సమావేశం ఉంది కదా? అని స్థానిక నియోజకవర్గ ఇన్ ఛార్జిని జగన్ ఆరాతీయడం చూస్తుంటే కార్యకర్తలను కలవడానికి జగన్ ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పాదయాత్రకు తోడుగా ఈ రెండు సమావేశాలూ పార్టీకి లాభిస్తాయనే జగన్ భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1