పార్టీపై చంద్రబాబుకు పట్టు సడలిందా?

ఒకవైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం….మరోవైపు అధికార పార్టీ నేతలు భూకబ్జాల కేసుల్లో ఇరుక్కోవడం ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయారైంది. క్రమశిక్షణ అని ప్రతి సమావేశంలో ఊదరగొట్టే అధినేతకు ఇది సవాల్ గా మారింది. విశాఖ భూకుంభకోణం కేసులో టీడీపీ నేతలు ఉన్నారంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అక్కడ పది వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. విశాఖ కలెక్టర్ పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి పంపారు. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఈ భూకబ్జాకు పాల్పడ్డారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు సయితం ఆరోపించారు. అలాగే మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా విశాఖలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, కోట్లాది రూపాయల భూములు మాయం చేస్తున్నారని ప్రకటించి అధికార పార్టీని ఇరుకున పడేశారు. విశాఖలో భూముల రికార్డులనే మాయం చేశారు. ఇప్పటి వరకూ కబ్జాకు కారకులైన నేతల పేర్లు బయటకు రాకపోయినా…. అధికారులపై మాత్రం వేటు వేస్తున్నారు. అలాగే తాజాగా హైదరాబాద్ లో భూకబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వీటన్నింటితో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉక్కిరి బిక్కిరవుతోంది.

ఆరోపణలొచ్చినా చర్యలేవీ?

క్రమశిక్షణకు మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తామని ఇటీవల జరుగుతున్న నవనిర్మాణ దీక్షల్లో చంద్రబాబు చెబుతున్నారు. 1100 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, ఒక్క కాల్ తో చిన్నమొత్తంలో లంచం తీసుకున్నా పట్టుకుంటున్నామని చెబుతున్నారు. అవినీతిపరుల పట్ల తాను చండశాసనుడినని పదేపదే చంద్రబాబు ప్రకటించుకుంటున్నారు. కాని అధినేత ప్రకటనలు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకదానికి ఒకటి పొంతనగా లేవు. ఇప్పుడు పార్టీలో క్రమశిక్షణ, కట్టుబాటు, నమ్మకం అనేవి మచ్చుకు కూడా కన్పించకుండా పోయాయని సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎన్టీఆర్ పెట్టినప్పుడు పార్టీలా ఇప్పుడు లేదని, కొత్త నీరు వచ్చి చేరి కలుషితమైపోయిందన్న బుచ్చయ్య వ్యాఖ్యలు నిజమనిపిస్తున్నాయని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఇంతకుముందులాగా చంద్రబాబు కూడా ఎటువంటి చర్యలకు దిగే పరిస్థితి లేదు. గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాలు మంత్రుల ముందే బాహాబాహీకి తలపడ్డా చర్యలు లేవు. అనంతపురంలో నేతలు ఇనుపరాడ్లతో కొట్టుకున్నా చూసీ చూడనట్లు వదిలేశారు. ఇప్పుడు భూకబ్జా నేతలపై కూడా చంద్రబాబు చర్య తీసుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. మొత్తం మీద పార్టీ పై చంద్రబాబు పట్టు సడలిందనే అనుమనాలు ఆ పార్టీ నేతల్లోనే కలుగుతున్నాయి. ఇలాగైతే పార్టీ పుట్టిమునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*