పార్టీ మారుతోన్న బాబు రైట్ హ్యాండ్‌

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారిపోతోంది. నాయ‌కులంతా కారెక్కేయ‌గా.. మిగిలిన వారు కూడా ఏదో ఒక దారి పట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. పార్టీ నాయ‌క‌త్వం టీటీడీపీపై దృష్టిసారించ‌క‌పోవడంతో.. ఇప్పుడు మిగిలిన నేత‌లు కూడా భ‌విష్య‌త్‌ను వెదుక్కుంటూ వెళ్లిపోతున్నారు. ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబుకు అత్యంత‌ న‌మ్మ‌క‌స్తుడిగా, రైట్ హ్యాండ్‌గా, టీటీడీపీకి పెద్ద‌దిక్కుగా ఉన్న నేత కూడా.. టీటీడీపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇన్నాళ్లు వేచి ఉన్న ఆయ‌న.. ఇక ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే ఉండ‌టంతో కారెక్కేందుకు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. తాను పోటీ చేయాల‌ని భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కూడా ఫిక్స్ చేసుకుని మ‌రీ టీఆర్ఎస్ జెండా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నా ర‌ట‌. ప్ర‌స్తుతం పార్టీలో ఉన్న అతి కొద్ది మంది నాయ‌కులు కూడా ఎవ‌రి దారి వారు చూసుకుంటే..ఇక టీటీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌వుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

టీడీపీ ఇక ఖాళీ అవుతుందా?

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో తెలంగాణ‌లోని నాయ‌కులంతా వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో నిమ‌గ్న‌మై ఉన్నారు. టీఆర్ఎస్‌తో ఢీ కొట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధ‌ప‌డుతుంటే టీటీడీపీలో మాత్రం విచిత్ర వైఖ‌రి క‌నిపిస్తోంది. రెక్క‌లు తెగిన ప‌క్షిలా ఆ పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌ట్టు కోల్పోయినందున ఆ పార్టీలో కొంత‌మంది మాత్ర‌మే ఉన్నారు. క్యాడ‌ర్ ఉన్నా ముందుండి న‌డిపించే నాయ‌కులు లేక‌పోవ‌డంతో సీనియ‌ర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. పార్టీలో ఉన్నా ఉప‌యోగం లేద‌ని భావిస్తున్న నేత‌లు.. ఇత‌ర పార్టీలో చేరేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని డిసైడ్ అయిపోయారు. వీరిలో సీనియ‌ర్ నేత మాజీ శాస‌న స‌భ్యులు రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి ఒక‌రు. ఆయ‌న ప్ర‌స్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొన‌సాగుతున్నారు.

ఆయన దారి టీఆర్ఎస్ మాత్రమే….

ఆయ‌న గ‌తంలో రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ లో చేర‌తారని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న‌ గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన న‌ర్సంపేట నుంచి కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి కొన‌సాగుతున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ న‌ర్సంపేట కాంగ్రెస్ టికెట్ మాధ‌వ‌రెడ్డికే ద‌క్కే అవ‌కాశం లేద‌ని భావించిన కాంగ్రెస్‌లో చేరే ఆలోచ‌న విర‌మించుకు న్నార‌ట‌. ఇక ఆయ‌న‌కు ఉన్న ఒకే ఒక్క దారి టీఆర్ఎస్. కాబ‌ట్టి క‌చ్ఛితంగా కారెక్కుతార‌ని జిల్లా నేత‌లు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చేరాల‌ని ఆయ‌న‌కు ఆహ్వానం అందినా ఒకే ఒక్క కార‌ణంతో వెన‌క్కి త‌గ్గార‌ట‌. న‌ర్సంపేట టీఆర్ఎస్ లో మొద‌టినుంచి ప‌ట్టున్న నాయ‌కుడు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి. గ‌తంలో పోటీచేసిన ఆయ‌న రెండో స్థానంతో స‌రిపెట్టు కో వాల్సి వచ్చింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

సీటు కోసం అన్వేషణలో…..

ఆయ‌న‌కు కాకుండా వేరే ఎవ‌రికి ఇచ్చినా టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. దీంతో రేవూరి ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక నర్సంపేట‌ను న‌మ్ముకోకుండా మ‌రో నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి ఉన్నార‌ట. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం చిక్కిన‌ట్లు తెలుస్తుంది. అక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దాస్యం విన‌య్ భాస్క‌ర్ పై వ్య‌తిరేక‌త భారీగా పెరిగింద‌ట‌. ఆయ‌న‌పై గ‌తంలో కేటీఆర్ కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు తిరిగి టికెట్ ఇచ్చినా గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని టీఆర్ఎస్ పెద్ద‌లు ఫిక్స‌య్యార‌ట‌. ఈ స్థానం నుంచి సీటు సులువుగా ద‌క్క‌తుందని భావించిన ఆయ‌న‌.. వ్యూహాలు సిద్ధం చేసుకున్నార‌ట‌. ఇక రేపో మాపో రేవూరి.. గులాబీ గూటికి చేర‌డం ఖ‌రారైన‌ట్లేన‌ని నేత‌లు స్ప‌ష్టంచేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*