పాల‌కుర్తికి ఎర్ర‌బెల్లి గుడ్ బై… ఇదే హాట్ టాపిక్‌..!

తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన జ‌న‌గామ జిల్లాలో రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఓట‌మెరుగని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డిని ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దించే ఆలోచ‌న‌లో సీఎం కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. స్థానికంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇటీవ‌ల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయ‌న ఇక్క‌డి నుంచి పోటీచేస్తే గెలిచే అవ‌కాశం లేక‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గం మార్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు స‌మాచారం.

ఐదుసార్లు ఓటమి ఎరుగకుండా….

ఎర్ర‌బెల్లి 1994, 1999, 2004లో వ‌ర్థ‌న్న‌పేట నుంచి 2009, 2014 ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నుంచి వ‌రుస‌గా టీడీపీ త‌ర‌పున ఐదుసార్లు గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు త‌ర్వాత ఆయ‌న టీటీడీపీ ఫ్లోర్ లీడ‌ర్ ఉండి కూడా టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఇక ఇప్పుడు మ‌రోసారి జ‌న‌గామ‌కు మారితే ఆయ‌న మూడోసారి నియోజ‌క‌వ‌ర్గం మారిన‌ట్ల‌వుతుంది. జ‌న‌గామ జిల్లా కేంద్రంలోని బ‌తుక‌మ్మ కుంట భూమి ఆక్ర‌మ‌ణ విష‌యంలో ముత్తిరెడ్డిపై ఆరోప‌ణ‌లు రావ‌డం, స్వ‌యంగా జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌దేవ‌సేన క‌బ్జా జ‌రిగిందంటూ చెప్ప‌డం తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు, ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. అయితే స్వ‌యంగా చైన్‌మ్యాన్‌, స‌ర్వేయ‌ర్‌గా ప‌నిచేసిన ముత్తిరెడ్డికి భూములు, రికార్డుల లోటుపాట్ల‌పై మంచి ప‌ట్టుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌తుక‌మ్మ కుంట‌కు రికార్డుల ప్ర‌కారం ఉన్న‌భూమికంటే అద‌నంగా తేలిన భూమిని ముత్తిరెడ్డి త‌న ద‌గ్గ‌రి బంధువు పేరుపై రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే జిల్లా క‌లెక్ట‌ర్ ఈ విష‌యాన్ని సీఎంకు నివేదిక రూపంలో స్వయంగా అంద‌జేసిన‌ట్లు కూడా స‌మాచారం.

రా…రమ్మంటున్న….

అంతేకాకుండా జిల్లాలోని ఓ కీల‌క నేత అండ‌తోనే ముత్తిరెడ్డిపై క‌లెక్ట‌ర్ ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు స‌మాచారం. స్థానికుల నుంచి ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డుతోందని, ఆ ప్ర‌భావం పార్టీపై కూడా పడే అవ‌కాశం ఉన్న‌ట్లు గుర్తించిన ముఖ్య‌మంత్రి ఎలాగైనా ముత్తిరెడ్డిని జ‌న‌గామ‌ నుంచి త‌ప్పించే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎర్ర‌బెల్లిని జ‌న‌గామ బ‌రిలో దించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు కీల‌క నాయ‌కులు కూడా ఎర్ర‌బెల్లిని ఆహ్వానిస్తున్నార‌ట‌. ఎర్ర‌బెల్లిని సీక్రెట్ గా క‌లిసి ఇక్క‌డ‌కు వ‌స్తే త‌మ స‌హ‌కారం పూర్తిగా ఉంటుంద‌ని వారు కోరుతున్న‌ట్టు తెలుస్తోంది.

ముత్తిరెడ్డిని ఉప్పల్ కు….

వ‌రంగ‌ల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్‌లో సీట్ల కోసం గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఆరోప‌ణ‌లు ఉన్న ముత్తిరెడ్డిని గ్రేట‌ర్‌లో వ‌రంగ‌ల్ జిల్లా సెటిల‌ర్లు ఎక్కువుగా ఉన్న ఉప్ప‌ల్‌కు పంపాల‌ని చూస్తున్నార‌ట‌. ఇక ఎర్ర‌బెల్లిని జ‌న‌గామ బరిలో దింపాల‌ని ఆయన చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్ నాయ‌కుడు, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ వార్త‌లు ఎలా ఉన్నా ఎర్ర‌బెల్లి నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*