పీకే ఫీడ్ బ్యాక్ తో జగన్…?

వైసీపీ అధినేత జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి ఇప్పటికి దాదాపు ఏడు నెలలు కావస్తుంది. పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని పదకొండో జిల్లాలోకి జగన్ అడుగుపెట్టారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతోంది. అయితే ప్రకాశం జిల్లా దాటిన తర్వాత జగన్ అభ్యర్థులను ఎవరినీ ప్రకటించకపోవడం విశేషం. అంతకు ముందు కొందరి అభ్యర్థులను జగన్ ప్రకటించారు. పాదయాత్రలోనూ, బహిరంగ సభల్లోనూ నియోజకవర్గ సమన్వయ కర్తలను తన వెంట ఉంచుకుంటున్న జగన్ ప్రకాశం దాటిన తర్వాత అభ్యర్థుల పేర్లను ప్రకటించడం లేదు.

కొందరి అభ్యర్థుల పేర్లను….

తొలుత కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రమౌళిని ప్రకటించారు. తర్వాత ప్రకాశం జిల్లా దర్శినియోజకవర్గంలో అభ్యర్థిగా బాదం మాధవరెడ్డిని జగన్ ప్రకటించారు. వీరిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా ఆయన బహిరంగ సభల్లో కోరారు. అయితే కర్నూలు జిల్లా పత్తికొండ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అభ్యర్థులను ప్రకటించినా పెద్దగా సమస్యలు తలెత్తలేదు. కాని ప్రకాశం జిల్లా అద్దంకిలో బాదం మాధవరెడ్డిని ప్రకటించడంతో అక్కడ వైసీపీకి కొంత డ్యామేజ్ అయిందని ఫీడ్ బ్యాక్ వచ్చింది.

దర్శిలో పరిస్థితులు మారడంతో….

దర్శినియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి ఇప్పటికీ పట్టుంది. ఆయన వైసీపీ నేతగానే కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని శివప్రసాద్ రెడ్డి చెప్పడంతో బాదం మాధవరెడ్డిని జగన్ ప్రకటించారంటున్నారు. కాని శివప్రసాద్ రెడ్డి తర్వాత మనసు మార్చుకుంన్నారు. ఆయన పలు దఫాలుగా నియోజకవర్గంలో కార్యకర్తలతో, అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించారు. వచ్చే ఎన్నికలకు బూచేపల్లి రెడీ అవుతున్నారని చెబతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మాధవరెడ్డికి టిక్కెట్ ఖచ్చితంగా ఇస్తారన్న గ్యారంటీలేదు. శివప్రసాద్ రెడ్డి పోటీకి అంగీకరిస్తే ఆయనకే ఇచ్చే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

అందుకే మౌనం….

ఈ నేపథ్యంలో దర్శి నియోజకవర్గం పరిణామాలతో జగన్ ఇక అభ్యర్థులను ప్రకటించడం మానుకున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కడా అభ్యర్థుల ప్రస్తావన తేలేదు. కాకుంటే ఆ నియోజకవర్గ బాధ్యులను మాత్రం తనవెంట ఉంచుకుని బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. వివాదం లేని చోట అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అభ్యర్థుల పేర్లను జగన్ ప్రకటించడం లేదు. దర్శి నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు జగన్ ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*