పెళ్లిళ్ల ను అడ్డుకుంటున్న ప్రభుత్వం

ప్రభుత్వం నిర్లక్ష్యం కారణగా ఆ గ్రామాల్లో పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. బంధువులు కూడా వారిని దరిచేరనీయడం లేదు. తమ భూములను వదులుకున్నా ప్రభుత్వం మాత్రం పరిహారం చెల్లించకపోవడంతో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. సిక్కోలు జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజల దయనీయ గాధ ఇది. శ్రీకాకుళం జిల్లాలో పలాస, వజ్రపు కొత్తూతరు, నందిగాం, మెళియాపుట్టి మండలాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో జలయజ్ఞం పధకం కింద ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. శంకుస్థాపన కూడా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ మరణంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రైతులకు పరిహారం కూడా దక్కలేదు.

ప్రాజెక్టు పనులు నత్తనడక…
వైఎస్ మరణానంతరం కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య కూడా ఈ ప్రాజెక్ట్ ఆఫ్ షోర్ పనులను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సుమారు 25,600 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో నిర్మించతలపెట్టిన ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో నిధులు కూడా కేటాయించలేదు. అప్పటి కాంగ్రెస్, ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. కేటాయించిన అరకొర నిధులతో ప్రాజెక్టు పనులు మందకొడిగా నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు అంచనా విలువ 127 కోట్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2,476 ఎకరాలు అవసరమైంది. రైతుల నుంచి 1900 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం మాత్రం ఇప్పటి వరకూ చెల్లించలేదు. ప్రాజెక్టుకు భూమి సరిపోదన్న కారణంతో అధికారులు ప్రాజెక్టు పనులను చేపట్టడం లేదు. దీంతో భూములిచ్చిన రైతుల ఆవేదన చెందుతున్నారు. మెళియాపుట్టి మండలం జూడుపల్లి వద్ద మహేంద్ర తనయ నదికి చేరే వరద నీటిని ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు మళ్లించాలని ప్రాజెక్టు డిజైన్ ను రూపొందించారు. ఇలా చేస్తే సుమారు 26 వేల ఎకరాలకు సాగునీరు, నాలుగు మండలాలకు తాగునీరందించవచ్చని ప్రభుత్వం భావించింది. ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం చెల్లిస్తామని, భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఇళ్లు కట్టించి జీవన భృతిని కల్పిస్తామని మాట ఇచ్చింది. ఆ మాటలను నమ్మి రైతులు భూములను ప్రభుత్వానికి ఇచ్చేశారు.

పరిహారం ఏదీ?
అయితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తొలి దశ కింద రైతుకు ముప్ఫయి వేల రూపాయలను మాత్రమే చెల్లించింది. మిగిలిన సొమ్మును ఇంతవరకూ చెల్లించలేదు. ప్రాజెక్టు వస్తుందని చెప్పి ముంపుకు గురవుతాయని చాలా గ్రామాలను తొలగించారు అధికారులు. దీంతో రైతులు ఉండేందుకు నివాసం లేక బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. పరిహారం మాట ఎత్తితే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పరిహారం అందక మానసిక వ్యధతో చాలా మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. తాము ఉండేందుకు ఇల్లులేక, భూములు కోల్పోయి రోడ్డు మీద పడ్డామని, తమ పిల్లలకు వయసు పైబడుతున్నా పెళ్లిళ్లు చేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*