‘పొత్తు’ పొడిచేనా…?

లైన్ క్లియర్ అయిపోయింది. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితులు కలిసి నడిచేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న టీటీడీపీ వర్కింగు ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి నిష్క్రమణతో ఈ రెండు పక్షాలు జట్టుకడతాయన్న నమ్మకం బలపడింది. కానీ తాజాగా టీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో సాగుతున్న అంతర్మథనం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. టీడీపీకి చెందిన నియోజకవర్గాలు, జిల్లా స్థాయుల్లో బలమైన నాయకులు, మాజీ మంత్రులు కూడా చాలామంది కాంగ్రెసు బాట పట్టడంతో రాష్ట్రంలో తెలుగుదేశం దాదాపు నిర్వీర్యమైపోయినట్లేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ ను వ్యక్తిగతంగాను, ప్రభుత్వ విధానాలను రాజకీయంగాను దుయ్యబట్టడంలో రేవంత్ ఒక చరిత్ర సృష్టించారు. బలమైన భాష,యాసతో కేసీఆర్ కు దీటైన బదులు చెబుతూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ మైనస్ టీడీపీ వెలవెలబోతోంది. నిన్నామొన్నటివరకూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని భావించిన టీఆర్ఎస్ నాయకులే తాజాగా తెలుగుదేశం తమకు లయబిలిటీగా మారుతుందేమోనన్న భావనకు లోనవుతున్నారు. అగ్రనాయకత్వం మదిలో కూడా రెండో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అటు కాంగ్రెసు..ఇటు టీఆర్ఎస్…

రేవంత్ తో దాదాపు 30 మంది నియోజకవర్గ స్థాయి ఇన్ ఛార్జులు కాంగ్రెసులో చేరుతున్నారు. ఇంకా కొందరు కీలక నేతలతోనూ మంతనాలు సాగుతున్నాయి. నవంబరు నెలలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన తర్వాత మరికొందరు నాయకులు చేరవచ్చని కాంగ్రెసు భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు దేశం మరింత బలహీనపడే అవకాశాలున్నాయి. సిద్దాంతపరంగా ఇప్పటికీ టీడీపీని పొరుగు రాష్ట్రం పార్టీగానే టీఆర్ఎస్ చూస్తోంది. టీడీపీ ఓటు బ్యాంకు బలంగా ఉందని తేలిన పక్షంలోనే పొత్తు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఒకవేళ నాయకులతోపాటు ఓటు బ్యాంకు కూడా చెల్లచెదురైపోతే పొత్తు పెట్టుకున్నా రాజకీయంగా కలిసొచ్చేదేమీ ఉండదు. అందువల్ల కాంగ్రెసులో చేరకుండా మిగిలిపోయిన బలమైన నాయకులను ఏదోరకంగా టీఆర్ఎస్ లో చేర్చుకుంటే సరిపోతుందని హరీష్ రావు తమ అధినేత కేసీఆర్ కు నివేదించారని పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు అంగీకరిస్తే తాను సంప్రతింపులు జరుపుతానని ఆయన ప్రతిపాదించారంటున్నారు. అవసరమైతే ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కొనసాగుతున్న మాజీ టీడీపీ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు వంటివారిని రంగంలోకి దింపితే గరిష్టంగా ప్రయోజనాలు ఉంటాయని టీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

మళ్లీ ఊపిరిపోయడం ఎందుకు?

2014 ఎన్నికల్లో టీడీపీకి తెలంగాణలో 14శాతం మేరకు ఓట్లు లభించాయి. 15 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఆ స్థాయి బలం లేదు.సెటిలర్లు ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సహా అన్నిచోట్లా 2014 తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అంతంత మాత్రంగానే కనిపించింది. రేవంత్ వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రబావం మరింత ఎక్కువగా ఉంటుంది. కాలక్రమంలో చాపచుట్టేసే పార్టీకి మళ్లీ పొత్తు రూపంలో ఎందుకు జీవం పోయాలని టీఆర్ఎస్ లో ఒక వర్గం వాదిస్తోంది. అయితే టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలోని 50 నుంచి 60 నియోజకవర్గాల్లో నాలుగు నుంచి అయిదువేల మంది హార్డ్ కోర్ ఓటర్ల మద్దతు ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. 2019 ఎన్నిక టీఆర్ఎస్ , కాంగ్రెసుల మధ్య చావోరేవో అన్న రీతిలో పోరాటంగా రూపుదాల్చబోతోంది. రాష్ట్రం ఇచ్చాము కాబట్టి కచ్చితంగా గెలుస్తామనే అతివిశ్వాసంతో 2014లో కాంగ్రెసు నాయకులు పదవుల కోసం పోటీలుపడి టీఆర్ఎస్ కు అధికారం అప్పగించేశారు. ఇప్పుడు అంతా కలిసికట్టుగా పనిచేసే దిశలో కదులుతున్నారు. అధిష్టానం కూడా సీరియస్ గానే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు గట్టిపోటీని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని టీడీపీకి సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెసు వైపు మళ్లకుండా అధికారపక్షానికి దక్కాలంటే పొత్తు అవసరమని టీఆర్ ఎస్ లోని కేటీఆర్ వర్గం సూచిస్తోంది. ఏం చేయాలనే విషయంలో కేసీఆర్ తన మనసులోని మాటను ఇంతవరకూ బయటపెట్టలేదు. అసలు టీడీపీ వాస్తవబలమేమిటన్న విషయంపై ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకు అవసరమైతే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ తో పొలిటికల్ సర్వే కూడా రానున్న రెండు నెలల్లో నిర్వహించే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

 

– ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*