పోలవరం…క్యా…బాత్ హై ….?

పోలవరం పనుల తీరు మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ సాధికార కమిటీ ఎగువ కాఫర్ డ్యామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన గతంలోని టెండర్లకు అనుమతి ఇచ్చింది. అయితే 2019 కి తాజా గా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలనే తాజా లక్ష్యాన్ని ప్రకటించింది. 2018 మార్చి కి గ్రావిటీ పై నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తీరుపై మాత్రం అనుమానం వ్యక్తం చేసింది.

మూడు నెలలుగా జీతాలు లేక …

పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కాంట్రాక్టర్ టాన్స్ స్ట్రాయి తమ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సంక్రాంతి పండగకు ముందు సిబ్బంది తిరుగుబాట పట్టారు. జీతాలు చెల్లించే వరకు పనులు చేసేది లేదని తేల్చి చెప్పేశారు. దాంతో అసలే అరకొరగా సాగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తిగా పడకేసాయి. ఇప్పటికే భారీ యంత్రాలకు ఆయిల్ కి సైతం ప్రధాన కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక మూలాన పడి వున్నాయి.

శరవేగం అంటూ తప్పుడు ప్రచారం …

ప్రాజెక్ట్ పనులు ఎక్కడికక్కడ పడకేస్తే రాష్ట్ర ప్రభుత్వం శరవేగమంటూ, కేంద్ర ప్రభుత్వం 2019 కి నీరిచ్చేస్తామంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా మారింది. స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులకు ఇప్పుడు కొత్త టెండర్లకు ఆమోదముద్ర పడింది. 1480 కోట్ల రూపాయలకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక కొత్త కాంట్రాక్టర్ పని మొదలు పెట్టనున్నారు. దీనిని బట్టి పోలవరం లో జరుగుతున్న దానికి సాగుతున్న ప్రచారానికి అర్ధమే లేకుండా పోయింది. ప్రాజెక్ట్ సైట్ లో సైతం మందకొడి వ్యవహారమే సాగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ తో వున్న యంత్ర పరికరాలు సైతం పక్కన పెట్టేసి ఉండటం అక్కడికి వెళ్ళి చూసే వారికి షాక్ ఇస్తుంది.

రాజకీయ లబ్ది కోసమే కేంద్ర రాష్ట్రాల పాకులాట …

ప్రాజెక్ట్ పనులు మొదలైన నాటినుంచి తెలుగుదేశం సర్కార్ నిర్మాణం కన్నా ప్రచారం చేసుకోవడం పైనే దృష్టి పెట్టింది. ఎత్తి పోతల పథకాలతో సొమ్ము చేసుకుందన్న విమర్శలను ప్రజలు నమ్మే స్థితికి పాలకుల చేష్టలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జాతీయ ప్రాజెక్ట్ కావడంతో కేంద్ర ప్రభుత్వమే చట్టం ప్రకారం ప్రాజెక్ట్ కట్టి ఇవ్వాలనేది విభజన చట్టంలో స్పష్టం చేయబడింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రాజెక్ట్ నిర్మాణం కన్నా ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టింది. రాజకీయ లబ్ది కోసం టిడిపి, అదే తీరులో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసి హడావిడి చేయడం తప్ప శరవేగం లేదు సరికదా నత్తనడకన పనులు నడిచేలా చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1