ప్యాకేజీ చట్టబద్దత……

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత వచ్చేస్తుందంటూ రెండు వారాలుగా హడావుడి జరుగుతోంది. గత వారమే క్యాబినెట్‌ ముందుకు నోట్‌ ఫైల్‌ వస్తుందని సుజనా చౌదరి పేరిట వార్తలు వెలువడ్డాయి. ఈ వారం టేబుల్‌ ఐటెంగా వచ్చేస్తోందంటూ స్క్రోలింగ్‌లతో హడావుడి చేసినా నిరాశే ఎదురైంది. ఏపీకి ప్రత్యేక హోదా రాదు….. హోదాకు సమానమైన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కొద్ది నెలల క్రితం ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అర్ధరాత్రి ప్రెస్ మీట్‌ పెట్టి మరి ప్రకటించారు. అంతకుముందు ప్యాకేజీ-హోదా విషయంలో నానా రచ్చ జరిగి చివరకు ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రూపేణా ఏపీకి భారీ సాయం అందుతుందని కేంద్ర., రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 7న అర్ధరాత్రి వరకు ప్యాకేజీ విషయంలో ఢిల్లీలో హైడ్రామా నడిచింది. చివరకు జైట్లీ మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. అప్పట్నుంచి ఏపీ ప్రభుత్వం కొత్త డిమాండ్‌ భుజానికి ఎత్తుకుంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించింది.

ప్రత్యేక సాయమే…
జైట్లీ చేసిన ప్రకటనలో ‘విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఆదాయం తగ్గిపోయింది. కాబట్టి ఆ రాష్ట్రం ప్రత్యేక హోదా అడగడంలో తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చుతుంది. ఆ క్రమంలోనే హోదాకు బదులు ప్రత్యేక సాయం అవసరమైంది. ఏపీకి హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ ప్రకటన, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు తదితర నాలుగు అంశాల ఆధారంగా ఏపీకి ప్రత్యేక సహాయాన్ని ప్రకటిస్తున్నాం.మన్మోహన్ సింగ్ 20-2-2014న రాజ్యసభలో చెప్పినట్లు ఆరు అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. వాటిలో ఐదు అంశాలపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే చర్చ మొదలైంది. కొండ ప్రాంతాలు, ఇతర ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే హోదా దక్కుతంది. ఏపీకి హోదా ఇవ్వాలా? వద్దా? అనేదానిపై చర్చ మొదలైంది. కొత్తగా ఏ రాష్ట్రానికి హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసిన నేపథ్యంలో ఏపీకి హోదా కాకుండా ప్రత్యేకసాయం చేస్తాం. సహాయంలో భాగంగా ఏమేమి ఇస్తామో అన్ని వివరాలు అతి త్వరలోనే వెల్లడిస్తాం’ అని ముక్తాయించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 100 శాతం కేంద్రమే భరిస్తుంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా రెవిన్యూ లోటు విషయంలో ఏపీకి సహకారం ఇస్తుంది. రైల్వే జోన్ ., స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై చర్చించాల్సి ఉందని ప్రకటించారు.

ఇరుకున పడ్డ సుజనా
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అటు వైసీపీ., ఇటు జనసేన., కాంగ్రెస్, వామపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఎదురవుతోంది. తెలుగు దేశం పార్టీ కూడా హోదా సమానమైన ప్యాకేజీ చట్టబద్దంగా లభించిందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలనే తాము అమలు చేస్తున్నందున ప్రత్యేకంగా ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం లేదని జైట్లీ వాదిస్తున్నారు. గత రెండు వారాలుగా మీడియాలో వస్తున్న కథనాలపై కేంద్ర మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టేబుల్‌ ఐటెంగా ఏపీ అంశం క్యాబినెట్‌ ముందుకు వస్తుందన్న కథనాలను తప్పు పట్టారు. యూనియన్‌ క్యాబినెట్‌ భేటీ ముగిసన తర్వాత తెలుగు మీడియా ప్యాకేజీ అంశాన్ని ప్రస్తావిస్తే వార్తలు రాయించుకున్న మంత్రినే అడగాలని విసుక్కున్నారట… మరోవైపు సుజనా చౌదరి పేరుతో వార్తలు వెలువడటంతో క్యాబినెట్‌లో ఇరుకున పడ్డారని తెలుస్తోంది. తనపేరుతో వచ్చిన వార్తలు తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట.

బీజేపీ మనసులో ఏముంది….?
నిజానికి జైట్లీ ప్రకటన తర్వాత ఏపీలో బీజేపీ-టీడీపీలకు అనుకున్నంత మైలేజీ రాలేదు. హోదాకు సమానమైన ప్యాకేజీ అని కేంద్ర మంత్రులు., ముఖ్యమంత్రి పదేపదే చెప్పినా జనం అంతగా పట్టించుకోలేదు. అదే సమయంలో విపక్షాల ఆందోళనకు గట్టి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు ప్యాకేజీకి చట్టబద్దత కల్పించినా పెద్దగా ప్రజల్లో తమపై అభిమానం రాదని బీజేపీ నేతలు సందేహిస్తున్నారట. కేంద్రం ద్వారా రాష్ట్రానికి చేసే మేలు ఎన్నికలకు ముందు చేస్తే జనం గుర్తు పెట్టుకుంటారని వారి ఆలోచనట… ఇప్పటికిప్పుడు ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే అవకాశాలను కేంద్రమంత్రి వెంకయ్య తోసిపుచ్చారట… చాలా కసరత్తు జరగాల్సి ఉందని., అన్ని శాఖలతో మాట్లాడిన తర్వాతే క్యాబినెట్ ముందుకు నోట్ వస్తుందని వెంకయ్య నిన్నటి క్యాబినెట్‌ భేటీ తర్వాత తేల్చేశారు. అంటే ఇప్పటికైతే చట్టబద్ద డ్రామాకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే…..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*