ప్రకాశంలో వైసీపీకి కష్టాలేనా?

ప్రకాశం వైసీపీలో వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయి. గత ఎన్నికల్లో మంచి ఫలితాలను అందించిన ప్రకాశంలో వైసీపీ నేతలు ఆధిపత్య పోరుతో కొట్టుకు ఛస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయినా….. ఆ పార్టీ నేతల్లో మాత్రం ఇంకా ఇగోలు తగ్గలేదు. ముఖ్యంగా జగన్ బంధువులే ఆధిపత్యానికి అర్రులు చాస్తుండటంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డిల మధ్య గ్యాప్ వీడిపోలేదు. వీరిద్దరూ జగన్ కు అత్యంత సమీప బంధువులు. అయితే ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీని తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని బాలినేని వర్గం ఆరోపిస్తుంది.

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు…..

పార్టీ కార్యక్రమాల్లో కూడా ఇద్దరూ పాల్గొనడం లేదు. ఒకరు కార్యక్రమంలో పాల్గొంటే…మరొకరు డుమ్మా కొడుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీ కార్యక్రమమైన గడప గడపకూ వైసీపీ, వైఎస్ కుటుంబం వంటి కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో జరిగేలా చూస్తున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరగడం లేదని ఇటీవల బాలినేని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎంపీ వైవీ ఆగ్రహంతో ఉన్నారు. బాలినేని వల్లనే పార్టీ భ్రష‌్టుపట్టి పోయిందని జగన్ కు వైవీ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా పార్టీకి చెందిన అధినేత బంధువులే ఇలా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటుడటంతో ప్రకాశంలో పార్టీ పరిస్థిితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. మరోవైపు వైసీపీలోకి చేరదామని భావిస్తున్న సీనియర్ నేతలు కొందరు ఈ పరిణామాలను చూసి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*