ప్రకాశం జిల్లాని పట్టించుకోరా బాబూ..?

ప్రకాశం జిల్లాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీతకన్ను వేసింది. ప్రకాశం జిల్లాలో కరువును తరిమేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగా చేతల్లో మాత్రం చూపించడం లేదంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు. అందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనమని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నిత్యం కరువుతో అల్లాడుతుంటోంది. దీంతో పొరుగు రాష్ట్రాలకు ఇక్కడి రైతులు కూలీలుగా మారి వలసలు వెళుతున్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత జిల్లాలో కరవును తరిమేస్తామని చెప్పిన పాలకులు పట్టించుకోవడం లేదు.
హామీల అమలేదీ….?
ప్రకాశం జిల్లాలోని 56 మండలాలూ కరవు కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కరవు నివారణ చర్యలకు నిధులు కేటాయించక పోవడం పాలకులకున్న శ్రద్ధ బయటపడింది. ప్రకాశం జిల్లాలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా నిధులను కేటాయించలేదు. కొన్నింటికి కేటాయించినా అరకొరగానే ఇచ్చారు. దొనకొండ, పామూరు, సింగరాయకొండ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానం నేటికీ అమలు కాలేదు. ఈ బడ్జెట్ లో వీటి ఊసే లేదు. ఇక ప్రకాశం జిల్లాకు ప్రధాన నీటివనరైన వెలుగొండ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రజలు సంతోషపడ్డారు. కాని ఈ బడ్జెట్ లో వెలుగొండకు కేటాయించింది కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మూడు వేల కోట్ల అవసరమవుతుందని, కేవలం రెండు వందల కోట్లు ఇస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు ప్రజాప్రతినిధులు. ఇలా బడ్జెట్ లో అరకొర నిధులను కేటాయిస్తుంటే వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్న గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల పథకం, పాలేరు రిజర్యాయర్, రాళ్లపాడు ప్రాజెక్టులకు కూడా అరకొర నిధులను కేటాయించడం ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. అలాగే కనిగిరిలో నిమ్జ్, రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కారిడార్ లకు ఈ బడ్జెట్ లో నిధులే కేటాయించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ప్రకాశం జిల్లా మీద పాలకులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

2 Comments on ప్రకాశం జిల్లాని పట్టించుకోరా బాబూ..?

Leave a Reply

Your email address will not be published.


*