ప‌వ‌న్ ఎఫెక్ట్ … పాలకొల్లులో యమ టైట్ ఫైట్?

గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌శ్చిమగోదావ‌రి జిల్లాయే కీల‌కం. ఈ జిల్లాలో అన్ని ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసి ప‌డేసింది. జిల్లాలోని డెల్టాలో ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్ల ప్రభావం బాగా ఎక్కువ‌. 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేయ‌డంతో జిల్లాలో చావు దెబ్బ తిన్న టీడీపీ డెల్టాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో మూడో ప్లేస్‌కు ప‌డిపోయింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స‌పోర్ట్ ఉండ‌డంతో కాపు వ‌ర్గంలో మెజార్టీ ఓట్లు టీడీపీకే ప‌డ్డాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే జిల్లాలో టీటీపీ వేవ్‌, మోడీ గాలి, ప‌వ‌న్ ప్రభావంతో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసి ప‌డేసింది.

ఆరేడు నియోజకవర్గాల్లో….

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జన‌సేన ఒంట‌రి పోరుకు రెడీ అవుతోన్న వేళ‌, ప‌వ‌న్ అండ్ కాపు వ‌ర్గం ఓట‌ర్ల ప్రభావం జిల్లాలో ఆరేడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లంగా ఉండ‌నుంది. ఈ క్రమంలోనే చిరు అత్తగారి ఊరు, గ‌తంలో ప్రజారాజ్యం నుంచి ఆయ‌న పోటీ చేసి ఓడిపోయి చెత్త రికార్డు మూట‌క‌ట్టుకున్న పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన ప్రభావం ఎలా ఉంటుంది ? టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇక్కడ జ‌న‌సేనను త‌ట్టుకుని మ‌ళ్లీ గెలుస్తాడా ? లేదా ? అన్నదానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చలు స్టార్ట్ అయ్యాయి.

పాలకొల్లులో ముక్కోణపు పోటీ….

టీడీపీకి కంచుకోట అయిన పాల‌కొల్లులో గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ముక్కోణ‌పు పోటీయే జ‌రుగుతోంది. 2004లో కాంగ్రెస్ రెబ‌ల్ అభ్యర్థిగా పోటీ చేసిన మేకా శేషుబాబు ఎఫెక్ట్‌తో ఓట్లు చీలి కాంగ్రెస్ గాలిలో కూడా టీడీపీ అభ్యర్థి బాబ్జీ విజ‌యం సాధించారు. 2009లో చిరు ఇక్కడ స్వయంగా ప్రజారాజ్యం నుంచి రంగంలోకి దిగారు. చిరు ప్రజారాజ్యం నుంచి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబ్జీ పోటీలో ఉన్నారు. వీరిద్దరు కాపు వ‌ర్గానికి చెందిన వారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో వైశ్య సామాజిక‌వ‌ర్గానికి చెందిన బంగారు ఉషారాణి చిరును 6 వేల ఓట్ల తేడాతో ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ బాబ్జీని కాద‌ని నిమ్మల రామానాయుడ‌కు సీటు ఇచ్చింది. ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బాబ్జీ ఏకంగా 38 వేల ఓట్లు తెచ్చుకున్నారు. నిమ్మల రామానాయుడు 6 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.

జ‌న‌సేన నిమ్మల‌కు బ్రేక్ వేస్తుందా… ?.

పాల‌కొల్లులో ప‌వ‌న్ ఎఫెక్ట్ అయితే ఖ‌చ్చితంగా ఉంటుంది. అయితే అది ఎవ‌రిమీద ఉంటుంద‌న్నది మాత్రం గ్యారెంటీగా చెప్పలేం. 2004లో ఇద్దరు కాపుల‌తో ఓ పాట బీసీ అయిన శేషుబాబు పోటీ చేస్తే కాపు అయిన బాబ్జీ గెలిచారు. 2009లో ఇద్దరు కాపు వ‌ర్గానికి చెందిన బాబ్జీ, చిరు పోటీలో ఉన్నా వారిని కాద‌ని ఉషారాణి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో కాపు వ‌ర్గానికి చెందిన నిమ్మల‌, బాబ్జీ, బీసీ అయిన శేషుబాబు మ‌ధ్య ట్రయాంగిల్ ఫైట్ న‌డిచినా కాపు అయిన నిమ్మల గెలిచారు. దీంతో పాల‌కొల్లు ఓట‌రు నాడి అంతిమంగా ఎలా ఉంటుంది ? వ‌ర్గాలు, నాయ‌కుల మ‌ధ్య బ‌ల‌మైన పోటీ ఉన్నా మ‌న అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేయ‌డం ఇక్కడి ఓట‌ర్ల నైజం.

వైసీపీలోకి వస్తే….

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి నిమ్మల రంగంలో ఉంటే, వైసీపీ నుంచి గుణ్ణం నాగ‌బాబు ఉన్నారు. అయితే చివ‌రి క్షణంలో బాబ్జీ వైసీపీలోకి వ‌స్తే ఆయ‌నే బ‌ల‌మైన అభ్యర్థి అవుతారు. ఇక జ‌న‌సేన కూడా ఇక్కడ కాపుల‌కే సీటు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ వైపు మొగ్గు చూపిన జ‌న‌సేన అభిమానులు ఇప్పుడు ఆ పార్టీకే ఉంటారు. ఇక బాబ్జీ వ్యక్తిగ‌త ఇమేజ్‌కు తోడు వైసీపీ ఓటు బ్యాంకు తోడ‌యితే పోరు అదిరిపోవ‌డం ఖాయం. గ‌త ఎన్నిక‌ల్లోనే ట్రయాంగిల్ ఫైట్‌లో స్వల్ప ఓట్లతో గ‌ట్టెక్కిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఈ సారి గెలుపు కోసం అష్టక‌ష్టాలు ప‌డాల్సిందే. నాడు చిరు ఇక్కడ పోటీ చేయ‌డంతో టీడీపీ మూడో ప్లేస్‌కు ప‌డిపోయింది. ఇప్పుడు ఆ పార్టీకి ప‌డే కాపుల‌తో పాటు ప‌వ‌న్ అభిమానుల ఓట్ల‌లో కొన్ని జ‌న‌సేన‌కు ట్రాన్స్‌ఫ‌ర్ కావ‌డం అయితే ప‌క్కా. ఫైన‌ల్‌గా ఇక్కడ జ‌నసేన గెలిచే ఛాన్సులు లేక‌పోయినా ఆ పార్టీ దెబ్బ టీడీపీకా.. వైసీపీకా అన్నది మాత్రం చూడాలి. నాడు అన్న చిరు ఓడిన పాల‌కొల్లులో రేపు త‌మ్ముడు పార్టీ ప్రభావం ఇత‌ర పార్టీల గెలుపోట‌ముల‌ను ప్రభావితం చేయ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యేలా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*