ప‌వ‌న్ ఫ్రంట్ టార్గెట్‌… ఓట్లు చీల్చడ‌మేనా..!

ఏపీలో ప్రశ్నిస్తానంటూ రాజ‌కీయ పార్టీ పెట్టుకున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి ఏంటి ? ఆయ‌న రాష్ట్రంలో రాజ‌కీయ ప్రత్యామ్నాయ శ‌క్తిగా అవ‌త‌రిస్తున్నారా? లేక ప్రత్యామ్నాయ ఫ్రంట్‌గా అవ‌త‌రిస్తున్నారా? 2014లో ఆయ‌న టీడీపీ-బీజేపీ మిత్ర ప‌క్షానికి మ‌ద్దతిచ్చారు. ప‌ట్టుమ‌ని నాలుగేళ్లు కూడా తిర‌గ‌కుండానే ఈ రెండు పార్టీల‌పైనా క‌త్తిక‌ట్టారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయింద‌న్నారు. లోకేష్ పేరు అవినీతి ప‌రుల డైరీల్లో క‌నిపిస్తున్నాయ‌ని విమ‌ర్శలు సంధించారు. అలాగ‌ని తానేమ‌న్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రత్యామ్నాయ అధికార పార్టీగా అవ‌త‌రిస్తాన‌ని మాత్రం చెప్పడం లేదు.

తనకు అనుభవం లేదంటూనే…

త‌న‌కు అనుభ‌వం లేద‌ని, త‌న‌కు సీఎం ప‌ద‌వి అక్కర్లేద‌ని చెప్పుకొచ్చాడు. అయితే, రోజులు గ‌డిచే కొద్దీ ప‌వ‌న్ వ్యవ‌హార శైలిలో తీవ్రమైన మార్పులు వ‌చ్చేస్తున్నాయి. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల‌పై వైసీపీ, టీడీపీ భారీ ఆశ‌లే పెట్టుకున్నాయి. మ‌రోసారి అధికారాన్ని ద‌క్కించు కోవాల‌ని టీడీపీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా సీఎం పీఠం ఎక్కాల‌ని వైసీపీలు తీవ్రంగా ప్రయ‌త్నిస్తున్నాయి. ఈ త‌రుణంలో ప‌వ‌న్ టీడీపీకి అందివ‌స్తాడ‌ని, త‌మ‌కు సాయం చేస్తాడ‌ని, త‌మ‌కు గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని సీఎం చంద్ర బాబు భావించారు. అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ యూట‌ర్న్ తీసుకుని.. అదే చంద్రబాబుపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.

అనంతపురంలో దీక్ష చేయాలని….

అంతేకాదు, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వామ‌ప‌క్షాల‌తో క‌లిసి యుద్దానికి సిద్ధమ‌వుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విష‌యంపై ఇప్పటికే జేఎఫ్‌సీని ఏర్పాటు చేసి నిజాలు నిగ్గుదేలుస్తాన‌ని ప్రక‌టించిన ఆయ‌న త్వర‌లోనే త‌న ఉద్యమాన్ని ఉధృతం చేసేలా పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 4న పవన్ విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నుంచి కడప వర‌కు పర్యటించి బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. చివరగా అనంతపురంలో ఆమరణ దీక్షకు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదంతా డ్రామా అంటూ….

ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో తెలుగు ఎంపీలు పార్లమెంట్ కేంద్రంగా తీవ్ర యుద్ధం చేస్తున్నారు. రోజుకో అవిశ్వాస తీర్మానం ఇస్తున్నారు. చ‌ర్చకోసం ప‌ట్టుబ‌డుతున్నారు. వైసీపీ అయితే, మ‌రో అడుగు ముందుకు వేసి.. రాజీనామాల‌కు సిద్ధమ‌ని ప్రక‌టించింది. అయితే, ఇదంతా డ్రామా అని ప‌వ‌న్ అంటున్నారు. ఈ క్రమంలోనే హోదా అంశంపై ఏపీ అధికార, విపక్షాలు చేస్తున్న డ్రామాలను నేరుగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.

సీనియర్ల సలహాలు తీసుకుంటూ….

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త్వర‌లోనే ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే సీనియర్ రాజకీయ నాయకులు మేధావుల సలహాలు సూచనలు తీసుకున్నట్లు సమాచారం. ఇక‌, ప‌వ‌న్‌తోక‌లిసి వ‌చ్చేందుకు వామ‌ప‌క్షాలు సిద్ధంగానే ఉన్నాయి. అంతేకాదు, తామే ప‌వ‌న్‌ను దీక్ష విష‌యంలో ఆలోచించాల‌ని సూచించామ‌ని ఇటీవ‌ల వామ‌ప‌క్షాల నేత‌లు చెప్పుకొచ్చారు. అంటే దాదాపు ఏపీలో వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ప‌వ‌న్ ఓ ఫ్రంట్‌ను అనాధ‌రైజ్డ్‌గా ఏర్పాటు చేసేశారు కూడా. అధికార, విప‌క్షాల ఓట్లను చీల్చడమే ల‌క్ష్యంగా ఈ ఫ్రంట్‌ప‌ని చేస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రోప‌క్క త‌న‌కు అధికారం అవ‌స‌రం లేద‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. ఇలా ఫ్రంట్ ఏర్పాటు చేసి సాధించేంది ఏమిటో తెలియడం లేద‌నేది కొంద‌రి వాద‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*