అద్వానీ కోర్టుకు రావాల్సిందేనా

బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు నిద్రపోనిచ్చేలా లేదు. ఈ కేసులో అద్వానితో సహా 11 మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలపై అభియోగాలు నమోదు చేయనున్నట్లు లక్నో కోర్టు వెల్లడించింది. బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసును నెలరోజుల్లో మొదలు పెట్టి రెండేళ్లలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారం రోజుల నుంచి లక్నోలోని ప్రత్యేక కోర్టు ఈ కేసుపై విచారణ ప్రారంభించింది. 25, 26వ తేదీల్లో కుట్ర కేసుపై అభియోగాలను నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ కే అద్వానితో పాటు మరికొందరు బీజేపీ నేతలపైన కూడా అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. 1992 డిసెంబరు 6వ తేదీన జరిగిన బాబ్రీమసీదు విధ్వంసంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కుట్రపన్నారన్న ఆరోపణలపైనే విచారణ జరుగుతోంది.

రెండో ఎఫ్ఐఆర్ లో అద్వానీ పేరు….

25వ తేదీన మహంత్ నృత్య గోపాల్ దాస్, మహంత్ రామ్ విలాస్ వేదాంతి, వైకుంఠ లాల్ శర్మ, చంపత్ రాయ్ బన్సల్, ధర్మదాస్, సతీష్ ప్రదాన్ లపై సీబీఐ కోర్టు అభియోగాలు నమోదు చేస్తుంది. 26వ తేదీ శుక్రవారం నాడు ఎల్ కే అద్వానీ తో సహా మురళీమనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్విరితంబర తదితరులపై అభియోగాలు నమోదు చేసే అవకాశముంది. దీంతో శుక్ర, శనివారాల్లో వ్యక్తిగతంగా న్యాయస్థానానికి హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే తమను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే వీరంతా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీమసీదు విధ్వంసం కుట్ర కేసులో వీరంతా నిర్దోషులని 2011 లో అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. అయితే తిరిగి సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. రెండో ఎఫ్ ఐఆర్ లో అద్వానీ పేరు ఉండటం గమనార్హం. వ్యక్తిగత హాజరు నంచి తమకు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 30వ తేదీన కోర్టుకు హాజరుకావాల్సిందేనని సీబీఐ ప్రత్యేక  కోర్టు స్పష్టం చేయడంతో అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి 30వ తేదీన కోర్టుకు హాజరుకాక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*