బడ్జెట్ బాహుబలులు…!

రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థికమంత్రులకు ఆదేశాలిచ్చేశారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి వార్షిక బడ్జెట్ అప్పైనా సప్పైనా ఫర్వాలేదు, అదిరిపోవాలి. ప్రతిపక్షాలు బెంబేలెత్తి పోవాలి. సంక్షేమం తారకమంత్రం . సర్వజన హితం ఓట్ల తంత్రం. వాస్తవాదాయానికి, వ్యయానికి సంబంధం లేని లెక్కలతో బడ్జెట్ను పట్టాలపైకి ఎక్కించేందుకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అన్నివర్గాలకు ప్రయోజనాలలు, వ్యక్తిగత పథకాలకు భారీ కేటాయింపులతో వండి వార్చాలనేది లక్ష్యం. రుణాలు, చెల్లింపుల సమతూకం లోపించి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురీదుతున్న పరిస్థితి. అయినప్పటికీ ఈ ఏడాది మాత్రం నిధుల వ్యయానికి వెనకాడేదే లేదంటూ అధినేతలు ఇద్దరూ తమ మంత్రివర్గ సహచరులకు ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, కొత్త ఆలోచనలు, పథకాలకు సంబంధించిన విషయాల్లోనూ సలహాలు, సూచనలు ఆర్థిక శాఖకు అందించాలని సూచించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టే బడ్జెట్ పద్దులో ఎన్నికలే గమ్యంగా, లక్ష్యంగా ఉంటాయన్న విషయం సుస్పష్టం. అయితే అందులో ఏమేం తాలింపులు ఉంటాయన్న అంశమే ఆసక్తిదాయకంగా మారుతోంది. రెండు రాష్ట్రాలు కూడా భారీ బాహుబలి బడ్జెట్లపైనే దృష్టి పెడుతున్నాయి. దరిదాపుల్లో రెండు లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ఉంటుందని ఏపీ, తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

పెట్టుబడి సాయమే..పెద్ద పథకం…

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయలవరకూ బకాయి పడిన రైతుల రుణాన్ని బ్యాంకులకు మూడు విడతల్లో చెల్లించి వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రుణపరిమితి చెల్లింపును లక్షాయాభై వేల రూపాయలుగా నిర్ధరించింది. ఇంకా వాయిదాలు చెల్లిస్తోంది. మరో రెండు మూడు సంవత్సరాల వరకూ రుణవిముక్తి జరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనకు లభించిన వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం చక్కగా వినియోగించుకోవాలని చూస్తోంది. ఏడాదికి ఆరు నుంచి ఎనిమిదివేల కోట్ల రూపాయల వరకూ రైతులకు లబ్ధి చేకూరేలా వ్యవసాయ పెట్టుబడి సాయం పథకాన్ని రూపకల్పన చేసింది. ఎకరాకు ఒక పంటకు నాలుగువేల రూపాయల చొప్పున ఏడాదికి ఎనిమిదివేలు రైతులకు అందచేయబోతోంది. టీఆర్ఎస్ సర్కారు పట్ల రైతాంగంలో భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన పథకమిది. ఇది 2019 ఎన్నికల నాటికి ఓట్ల వర్షం కురిపిస్తుందనే భావనలో ఉంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం కూడా రైతాంగానికి పెట్టుబడి సాయం ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంది. రుణమాఫీ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో టీడీపీ సర్కారు ఈ విషయంలో సందిగ్ధతను ఎదుర్కొంటోంది.

నిరుద్యోగ భృతి నీడలో…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో యువతను లక్ష్యంగా చేసుకుంటూ పథకం ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఎన్నికల హామీలో ఇంకా ముందు అడుగు పడని నిరుద్యోగభృతి అంశాన్ని ఒక కొలిక్కి తేవాలని యోచిస్తున్నారు. ఏపీలో పల్స్ సర్వే అంచనాల ప్రకారం నిరుద్యోగుల సంఖ్య 32 లక్షల వరకూ ఉంది. కానీ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీల వద్ద నమోదైన సంఖ్య ఎనిమిది లక్షల వరకూ ఉంది. కొన్ని పారామీటర్లు పెట్టుకుని నెలకి పదిహేను వందల రూపాయల వరకూ నిరుద్యోగభత్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. దాదాపు 20 లక్షల మందికి నెలవారీ భత్యం ఇవ్వాలని యోచిస్తోంది. ఏడాదికి ఖజానాపై 3600 కోట్ల రూపాయల మేరకు భారం పడుతుందనేది ప్రాథమిక అంచనా. అయినప్పటికీ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజీ వస్తుందని పార్టీ వర్గాలు భావించడంతో ఈసారి బడ్జెట్ లో నిరుద్యోగ భ్రుతి అంశం కీలకం కాబోతోంది.

కుల సంక్షేమం…

రెండు రాష్ట్రాల్లోనూ కూడా కుల సంక్షేమం, వ్యక్తిగత ప్రయోజన పథకాలకు బడ్జెట్ లో పెద్ద పీట వేయబోతున్నారు. ఏపీలో కాపు సంక్షేమం నిమిత్తం కార్పొరేషన్ కు వెయ్యికోట్ల రూపాయలు కేటాయించనున్నారు. తెలంగాణలో ఎంబీసీల కు వెయ్యికోట్లు పెడుతున్నారు. అటు ఆంధ్రాలో బ్రాహ్మణ సంక్షేమం, వైశ్య సంక్షేమం ఇలా వివిధ రూపాల్లో కులాలవారీ రిజర్వేషన్ పొందలేని వర్గాలకు ఆర్థిక పథకాల రూపకల్పన ప్రధానం కానుంది. ఇటు తెలంగాణలో యాదవ, మత్స్య, విశ్వబ్రాహ్మణ , ఇలా వివిధ వర్గాలకు కులాల వారీ నిధుల పంపకం పైనా కసరత్తు సాగుతోంది. కులసంక్షేమం అనేది ఈ విడత బడ్జెట్ లో ఏపీ, తెలంగాణల బడ్జెట్ మంత్రం. మౌలిక వసతులకు సంబంధించిన పెట్టుబడి వ్యయం బాగా కుదించిపోనుంది. తెలంగాణయే ఈ విషయంలో కొంత ముందంజలో ఉండబోతోంది. సాధారణ ఖర్చులు, జీతభత్యాల రూపంలోని రెవిన్యూ వ్యయం మూడింట రెండు వంతుల వరకూ ఉండగా, పెట్టుబడి రూపంలో మూడింట ఒకవంతు వరకూ అభివ్రుద్ధి పనులకు తెలంగాణలో వెచ్చిస్తున్నారు. ఏపీలో మాత్రం ఇది పదిశాతం కూడా కనిపించడం లేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడం వల్ల మౌలిక వసతులకు ఏపీలోనే ఎక్కువ వెచ్చించాల్సి ఉండగా బడ్జెట్ లో మాత్రం ఆ సంతులనం మూడేళ్లుగా లోపించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం , రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల రూపంలో దీర్ఘకాల అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని వేల కోట్ల రూపాయలను తెలంగాణ సర్కారు పెట్టుబడి నిధులుగా ఖర్చు చేస్తోంది. వ్యక్తిగత లబ్ధి , సంక్షేమ రంగాల్లో తెలంగాణతో పోటీ పడుతున్న ఏపీ సర్కారు మౌలిక వసతుల వ్యయంలో తెలంగాణ కంటే చాలా వెనకబడి కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా అదే తంతు పునరావృతం కాకతప్పదు.
-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1