బాబు అఖిలప్రియను పక్కనపెట్టారా?

రాష్ట్రపతి ఎన్నికల హడావిడి ఉన్నప్పటికీ నంద్యాల ఉప ఎన్నిక ను మాత్రం చంద్రబాబు వదిలిపెట్టడం లేదు. ఈరోజు కూడా నంద్యాల ఉప ఎన్నికపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు. నంద్యాల ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ముగ్గురు మంత్రులను నియమించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డితో పాటుగా నంద్యాల ఉప ఎన్నికకు ప్రత్యేకంగా మరో 12 మంది ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జిలుగా చంద్రబాబు నియమించారు. వీరందరితో ఈ రోజు సమావేశమయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు ప్రతిరోజూ నంద్యాల అప్ డేట్స్ ను తెలుసుకుంటున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారంలో వస్తున్న ఇబ్బందులు ఏంటి? నంద్యాల సమస్యలపై ఇంకా ప్రభుత్వం చేయాల్సిందేమిటి? అన్న విషయాలను చంద్రబాబు నేతలతో చర్చించారు.

12 మంది ఎమ్మెల్యేలకు ఇన్ ఛార్జి బాధ్యతలు…….

అయితే ఈ భేటీలో మంత్రి అఖిలప్రియ పాల్గొనలేదు. అఖిలప్రియ కూడా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చినప్పటికీ ఈ సమావేశంలో అఖిలప్రియ పాల్గొనకపోవడం విశేషం. అఖిలప్రియపై లోకల్ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చంద్రబాబు ఈ భేటీలో చర్చించారు. తెలిసీ తెలియనితనంతో అఖిలప్రియ కొందరిని ఇప్పటికే దూరం చేసుకున్నారని, వారందరినీ కలపాల్సిన బాధ్యత అక్కడ నియోజకవర్గానికి నియమించిన ఇన్ ఛార్జులదేనని చంద్రబాబు చెప్పారు. అలాగే వైసీపీ ఓటు బ్యాంకు ఎక్కడ ఉందో పసిగట్టి వారిని తమ వైపునకు లాక్కునేందుకు కూడా ప్రయత్నించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. అలాగే ఎప్పటికప్పుడు తన నివేదికను అందించాలని, ఇకపై నంద్యాలకు నియమించిన ఇన్ ఛార్జులు నంద్యాలలోనే మకాం వేయాలని చంద్రబాబు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1