బాబు న‌మ్మిన బంటు రాం రాం..!

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ అనే పార్టీ ఒక‌టి ఉంద‌ని చెప్పుకునే ప‌రిస్థితి ఉంటుందా ? ఉండ‌దా ? అన్నదే ఇప్పుడు చ‌ర్చ. ఈ విష‌యం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా అర్థమైపోయిన‌ట్లుంది. అందుకే చంద్రబాబు సైతం తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల ఆవ‌శ్యక‌త‌ను ప్రస్తావించారు. ప్రస్తుతం పార్టీకి ఉన్న స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య సైతం వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగానే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల‌లో ఏదో ఒక పార్టీలో చేరిపోతార‌న్న వార్తలు వ‌స్తున్నాయి.

బాబుకు నమ్మకంగా ఉండి….

ఇక ఇదిలా ఉంటే పార్టీలో బాబుకు న‌మ్మిన బంటులుగా ఉన్న వారు సైతం ప‌క్క పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. బాబుకు ఎంతో స‌న్నిహితంగా ఉండే ఖ‌మ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర‌రావు పేరు ఇప్పటికే ఈ లిస్టులో ఉంది. ఇక ఇప్పుడు బాబుకు రైట్ హ్యాండ్‌గా ఉండే లీడ‌ర్లలో ముందు వ‌రుస‌లో ఉండే మాజీ మంత్రి, కార్మిక సంఘం నేత సైతం టీడీపీని వీడేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. తెలంగాణ‌లోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన పాత కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఇప్పటికే పలువురు అధికార టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు….

ప్రస్తుతం టీడీపీ నుంచి ఓ కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఆ నేత చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకుని ఈటలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది.

సీనియర్ నేతగా…

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలుపొందారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌ లో పలు మంత్రిత్వ శాఖలు నిర్వాహించారు. టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిన సమయంలోనే పెద్దిరెడ్డి కూడా టీడీపీని వీడుతారనే ప్రచారం జరిగింది. బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. కరీంనగర్‌ పార్లమెంట్ స్థానం ఆశించినప్పటికి అధిష్ఠానం నుంచి సానుకూల ప్రకటన రాలేదు. బీజేపీ త‌ర‌పున ఇప్పటికే ఆ నియోజకవర్గంపై సీనియర్ నేతలు మురళీధర్ రావు, గుజ్జుల రామకృష్ణా రెడ్డి కన్నేశారు. దీంతో ఆయన తన ప్రయత్నాలు విరమించుకున్నారు.

ఈటెలను ఎదుర్కొనేందుకు….

ఈ నేపథ్యంలోనే తన అనుచరులతో సమాలోచనలు జరిపారు. వారందరి అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దిరెడ్డిని పార్టీలో చేర్చుకొని ఆయనకు చెక్ పెట్టాలని కాంగ్రెస్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ ను ఎదుర్కొనేందుకు పెద్దిరెడ్డి సరైన నాయకుడని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే త్వరలోనే పెద్దిరెడ్డి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*