బాబు పన్నీరా? తన్నీరా?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం  యువత అడుగులు వేస్తోంది ఈ నెల 26వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ ను ఇందుకు వేదికగా చేసుకుంది. యువతకు మద్దతుగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ప్రజాసంఘాలతో పాటు సినీనటులు పవన్ కల్యాణ్, శివాజీ వంటి వారు కూడా యువత వెంట తాముంటామని ప్రకటించారు. తమిళనాడులో జరిగిన జల్లికట్టు తరహా ఉద్యమాన్ని చేపట్టాలని యువత భావిస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ ఉద్యమానికి ఏ మేరకు సహకరిస్తుందోనన్న ప్రశ్న తలెత్తుతుంది. తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమానికి….ఏపీలో జరగబోయే హోదా ఉద్యమానికి ఎలాంటి తేడా ఉండబోతోంది అంటోంది యూత్. కేంద్రం రియాక్ట్ అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకరిస్తుందా?

ఉద్యమానికి బాసటగా పన్నీర్ సెల్వం….

తమిళనాడులో జల్లికట్టు పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ అక్కడ యువత స్వచ్ఛందంగా మెరీనా బీచ్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపింది. ఐదు రోజుల పాటు కదలకుండా బీచ్ వద్దనే కూర్చుని నినదించింది. రాజకీయ పార్టీలూ యువతకు అండగా నిలిచాయి. తమిళ తారాలోకం అంతా ఒక్కటే జల్లికట్టు ఉద్యమానికి బాసటగా నిల్చింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంటనే స్పందించారు. ప్రధాని మోడీని తన ఎంపీలతో కలిసి జల్లికట్టు క్రీడపై ఆర్డినెన్స్ తేవాలని కోరారు. అలాగే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చారు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి జల్లికట్టు బిల్లును ప్రవేశపెట్టారు. తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా జల్లికట్టు బిల్లును ఆమోదించింది. కాని సోమవారం మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు కోరారు. తాము జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం చూపితేనే వెళతామని చెప్పడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని హింసాత్మకంగా మారింది. ఉద్యమంలోకి బయట శక్తులు చేరాయని పన్నీరు సెల్వం ఆరోపించారు.

నిఘా నివేదికలు ఏం చెప్తున్నాయంటే….

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే….ప్రత్యేక హోదా డిమాండ్ రెండున్నరేళ్ల నుంచి విన్పిస్తోంది. నిరసనలు తెలిపినా కేంద్రం దిగిరాలేదు. దీంతో తమిళనాడు జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ఈ నెల 26వ తేదీన నిరసనలు తెలపాలని నిర్ణయించింది. అయితే అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు విశాఖ ఆర్కే బీచ్ వద్దనే కొన్ని రోజుల పాటు బైఠాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు  ఆహారం, మంచినీటిని అందించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, విశాఖలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఇదే చెబుతున్నారు. ఒకసారి బీచ్ లోకి విద్యార్థులను అనుమతిస్తే వారు వారం రోజుల వరకూ వెళ్లరని, శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.

బాబు వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తారా?

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆర్కే బీచ్ నిరసనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి జోరుగా జరుగుతుంటే ఈ నిరసనలేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొందరు కావాలనే ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుమానిస్తున్నారు. విద్యార్థులకు తోడు జనసేన, వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిస్తే పక్క దారి పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు జల్లికట్టు ఉద్యమానికి, ప్రత్యేక హోదాకు పొంతనే లేదని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పడం దీనిపై ఆయన స్టాండ్ దాదాపుగా తెలిసిపోయింది. బాధ్యత మరిచి ప్రవర్తిస్తే సహించేది లేదని కూడా సీఎం హెచ్చరించారు. దీంతో ఈ నెల 26వ తేదీన విద్యార్థులు ఆర్కే బీచ్ లో తలపెట్టిన నిరసనను ఆదిలోనే అణిచి వేయాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కన్పిస్తోంది. ముందస్తు అరెస్టులు చేయడం, ఆర్కే బీచ్ వద్ద ఆంక్షలు విధించడం వంటివి చేయనున్నారని సమాచారం. మరి తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంతగా పరితపిస్తే….ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ఏం చేస్తారన్న టెన్షన్ సర్వత్రా నెలకొని ఉంది. చంద్రబాబు మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వాలని కోరనున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత తెచ్చి హోదా ఉద్యమాన్ని కొంత చల్లార్చే ప్రయత్నం బాబు చేస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం లా ప్రత్యేక హోదా ఉద్యమానికి బాసటగా నిలుస్తారా? లేక నిరసనపై నీళ్లు చల్లి తన్నీరుగా మారతారా? అన్నది తేలాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*