బాబు…పోతే…పోనీ…అంతా బయటపెడతాం

ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగింది. అలా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వెంటనే బీజేపీ మాటల యుద్ధాన్ని ప్రారంభించింది. పార్టీ కేంద్ర నాయకత్వమే ఈసారి స్పందించడం విశేషం. చంద్రబాబు కుట్రలు, మోసాలు, అవినీతిని త్వరలోనే బయటపెడతామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఢిల్లీలో చెప్పడం విశేషం. ఉదయం చంద్రబాబు అత్యవసరం పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్డీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఈ మేరకు అమిత్ షాకు కూడా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై విడిగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా టీడీపీ నిర్ణయించింది.

ఓటమి భయంతోనే….

ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం అసహనానికి గురయినట్లు తెలుస్తోంది. కేవలం ఎన్నికలు దగ్గరపడుతుండటం వల్లనే ఓటమి భయంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెడుతున్నారని ఆరోపించింది. అనవసరమైన ఆరోపణలు చే్స్తున్నారనిచెప్పింది. నాలుగేళ్లు నిశ్శబ్దంగా ఉన్న చంద్రబాబు ఉన్నట్లుండి ఇప్పుడు స్వరం మార్చడానికి కారణం ఎన్నికలేనని, ఆయనకు నెగిటివ్ ఫలితాలు వస్తున్నట్లు సంకేతాలు అందినట్లున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే శక్తి లేకనే కేంద్రంపై హామీలు అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారని చెప్పారు.

చేతగాని తనాన్ని…..

29 సార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ తిరిగి పనులు చేయించుకోలేక పోతే అది ఆయన అసమర్థత కాదా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ వైదొలగడం తమకు మంచే జరిగిందన్నారు. ఇది తమకు మంచి అవకాశమని, తమ వ్యూహాలను త్వరలోనే అమలు పెట్టనున్నట్లు బీజేపీ వెల్లడించింది. ఏపీలో తాము టీడీపీని ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. రాష్ట్రంలో గెలవలేని వాళ్లు ఢిల్లీలో ఏం చేయగరలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రం మొత్తాన్ని అవినీతి మయం చేసి, తన చేతగాని తనాన్ని కేంద్రంపై నెట్టేందుకు చేస్తున్న చంద్రబాబు ప్రయత్నాన్ని తాము తిప్పికొడతామన్నారు. త్వరలోనే చంద్రబాబు అవినీతిని ప్రజల ముందుంచనున్నట్లు హెచ్చరించారు. మొత్తం మీద ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం తమకు మంచిదనే ఆ పార్టీ భావిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు తప్పుకుంటున్నా మోడీ, అమిత్ షాలు పట్టించుకోక పోవడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*