బాబు వ్యూహాత్మ‌క ముంద‌డుగు.. టార్గెట్ మోడీ

విభ‌జ‌న హామీలు అమ‌లుచేయాల్సిందేనంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంపై అనేక ర‌కాలుగా ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. బ‌డ్జెట్ అనంత‌రం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ వ‌స్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు బీజేపీని అష్ట‌దిగ్బంధం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇన్నాళ్లూ బీజేపీని టార్గెట్ చేసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు నేరుగా పీఎం మోడీనే ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఎన్డీఏ నుంచి బ‌య‌టికొచ్చిన త‌ర్వాత‌.. కేంద్రంపై మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న.. తాజాగా ప్ర‌ధానికే ప్ర‌శ్న‌లు సంధించ‌డం అందరిలోనూ ఆస‌క్తి మ‌రింత పెంచుతోంది.

ఎంతచ్చింది? ఎంత వచ్చింది?

ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్ర తీరుపై తీవ్రంగా స్పంది స్తున్న ఆయ‌న‌.. ఇప్పుడు మోడీతోనే ఢీ అంటే ఢీ అనేంత‌గా వ్యాఖ్యానించ‌డం రాజ‌కీయాల్లో దుమారం రేపుతోంది. ఏపీకి వ‌చ్చిన స‌మ‌యంలో.. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు ఉటంకిస్తూ.. వాటికి బ‌దులు చెప్పాల‌ని ప్ర‌శ్నించ‌డం ఏ ప‌రిణామాల‌కు దారి తీస్తుందోన‌నే చ‌ర్చ మొద‌లైంది. అసెంబ్లీ వేదికగా కేంద్రంపై విరుచుకుప‌డుతున్న చంద్ర‌బాబు.. మ‌రోసారి ప్ర‌ధాని మోడీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం రాష్ట్రానికి ఎంతిచ్చింది, రాష్ట్రం ఆ నిధులను ఏం చేసింద‌నే అంశాలపైనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మోడీని ఎండగట్టే యత్నం……

ఈ క్రమంలో ఆయ‌న‌ మరో ముందడుగు వేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదంటూ ప్ర‌ధాని మోడీని ఉద్దేశిస్తూ.. అసెంబ్లీలో ఎల్ఈడీ స్క్రీన్‌ వేసి మరీ చంద్రబాబు చూపించారు. కేంద్రం వైఖరికి నిరసనగా జపాన్ తరహాలో ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చిన ఆయ‌న‌.. అసెంబ్లీకి నల్లబ్యాడ్జీ ధరించి వచ్చారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ.. విభజన చట్టాన్ని అమలు చేయమంటే.. కేంద్రం ఎదురుదాడి చేస్తోందని ఆయన విమర్శించారు. అమరావతి తిరుపతి నెల్లూరు సభల్లో మోడీ చేసిన వాగ్దానాలను మరోసారి తోటి ఎమ్మెల్యేలకు గుర్తుచేసే ప్రయత్నం చేశారు. విభజన చట్టం అమలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును అసెంబ్లీ కేంద్రంగా చంద్రబాబు తప్పుబట్టారు. నాలుగేళ్ల క్రితం ఒక జాతీయ పార్టీ రోడ్డున పడేస్తే… మరో జాతీయ పార్టీ మోసం చేసిందన్న ఆవేదన ప్రజలు ఉందన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని కావాలనే ఇబ్బంది పెట్టే యోచనలో ఉందని పేర్కొన్నారు.

రుణమాఫీకి సహకరించడం లేదు…..

కేంద్రం అడిగిన విధంగా లెక్కలు చెప్పాలని అధికారులకు సూచించానన్నారు. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య విషయమని పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో రుణమాఫీకి కేంద్రం సహకరించలేదని యూపీలో కేంద్రం రుణమాఫీ చేయలేదా? అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలోని అన్ని అంశాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తామని చెప్పారని ఈ విషయంలో ప్రజలకు విశ్వాసం కలిగించడానికే వచ్చానని మోడీ ఆనాడు ప్రకటించారని చంద్రబాబు అన్నారు.

దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు…..

మాట ఇచ్చిన వాళ్లే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్ర‌శ్నించారు. `కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా తూట్లు పొడవడం ఎంత దుర్మార్గం? జాతీయ పార్టీలు రెండింటికీ బాధ్యత ఉంది. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చరో ఐదు కోట్ల మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్రానికి ఉంది.` అంటూనే యూసీలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆగ్రహంలో వాస్తవం ఉందంటూనే ఏపీకి జరిగిన అన్యాయంలో ఆయ‌న పాత్ర సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు మారిన అనంతరం ఇప్పుడు ఏపీకి అన్యాయం అంటూ అనడం వల్లే ఆయనకు మద్దతు దక్కడం లేదని గుర్తు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*