బాబ్బాబూ.. భలే చాన్సులే

ఒకవైపు సమస్యల సుడిగుండం..మరోవైపు అవకాశాల అందలం. తెలుగుదేశం పార్టీని ఊరిస్తున్నాయి. అధినేత చంద్రబాబు నాయుడు అటూ ఇటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు జాతీయ పాత్ర రమ్మని పిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో హాట్ హాట్ రాజకీయం ఆవిర్లెత్తిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశాన్ని రారమ్మని పిలుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రసమితి, కాంగ్రెసు పార్టీలు. లాభనష్టాలు బేరీజు వేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. కాంగ్రెసుతో కలిసి వెళితే జాతీయంగా ఒక అండ దొరుకుతుంది. టీఆర్ఎస్ తో కలిసి నడిస్తే ప్రాంతీయంగా రేపొద్దున్న మూడో ఫ్రంట్ లేదా లౌకిక కూటమిలో కీలక భూమిక పోషించే అవకాశం దక్కుతుంది. రెంటినీ కాదని ఒంటరిగా బరిలో నిలిస్తే ఇప్పటికే బలహీన పడిన ఓటు బ్యాంకుతో తెలంగాణలో పార్టీకి జీవన్మరణ సమస్య ఎదురవుతుంది. టీఆర్ఎస్, కాంగ్రెసు కూడా ఢిల్లీ రాజకీయాల్లో దూరంగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించేందుకూ ప్రయత్నించవచ్చు.

కేసీఆర్ ఈక్వేషన్…

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నప్పటికీ సామాజిక సమీకరణలు తనకు అనుకూలంగా లేవన్న వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. న్యాయస్థానాలు కూడా వివిధ అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సర్కారీ స్పీడుకు బ్రేకులు వేస్తున్నాయి. కేంద్రం నుంచి సహకారం లోపించింది. భారతీయ జనతాపార్టీ, ప్రధాని మోడీపై ధ్వజమెత్తడం ఒక రెగ్యులర్ ప్రాక్టీసుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కలుపుకుని వెళ్లడం వల్ల బీసీ వర్గాల్లో కొంత సానుకూలత లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2014 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. అప్పట్లో 15 శాసనసభ స్థానాలు, ఒక లోక్ సభ స్థానం టీడీపీ దక్కించుకోగలిగింది. బీజేపీకి అయిదు శాసనసభ స్థానాలు, ఒక లోక్ సభ స్థానంలో గెలుపునకు సహకరించింది. టీఆర్ ఎస్ , రెడ్డి దళిత కాంబినేషన్ తో కూడిన కాంగ్రెసును ఢీకొనాల్సి ఉంటుంది. మరోవైపు అజారుద్దీన్, గులాంనబీ అజాద్ వంటివారిని ప్రచార రంగంలోకి దింపడం ద్వారా మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు సైతం కాంగ్రెసు వ్యూహరచన చేస్తోంది. రిజర్వేషన్ల పేరిట శాసనసభ బిల్లును ఆమోదించినా కేంద్రం అనుమతించే ప్రసక్తే లేదు. అందువల్ల ముస్లింలలో పెద్దగా టీఆర్ఎస్ కు లభించే ప్రయోజనాలేమీ లేకుండా పోయాయి. టీడీపీ తో కలిస్తే కనీసం ఆరుశాతం ఓటింగు ఆ పార్టీ నుంచి లభిస్తుందని టీఆర్ఎస్ అధినాయకత్వం గుర్తించింది. రెగ్యులర్ సర్వేల్లో భాగంగా కేసీఆర్ ప్రతిపక్షాల బలాబలాలపై కూడా శాంపిల్ తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 24 నియోజకవర్గాల్లో కాంగ్రెసు, టీఆర్ఎస్ ల మధ్య బలాబలాలను తారుమారు చేయగల ఓటింగు టీడీపీకి ఉన్నట్లుగా ఈ సర్వే చాటిచెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో 10 నుంచి 12 అసెంబ్లీ సీట్లు, ఒక లోక్ సభ స్థానం ఇవ్వడం ద్వారా టీడీపీని మిత్రపక్షంగా చేర్చుకోవచ్చని కేసీఆర్ తనకు సన్నిహితంగా ఉండే మంత్రులతో చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనివల్ల టీఆర్ఎస్ కు అనుకూలంగా స్పష్టమైన వేవ్ సృష్టించవచ్చంటున్నారు. అంతేకాకుండా జాతీయ ఫ్రంట్ ఆలోచనలకూ ఈ మైత్రి నాందిగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కాంగ్రెసు కమామిషు…

కాంగ్రెసు కంటే బీజేపీనే ఎక్కువ మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కాంగ్రెసు నేతల్లో ఆనందం నింపింది. ఏపీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత క్రమేపీ కరిగిపోతోంది. రాహుల్ ప్రత్యేక హోదా ప్రకటనతో కొంత సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకతను బీజేపీ మూటగట్టుకొంటోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెసుకు , ఆంధ్రప్రదేశ్ స్థాయిలో టీడీపీకి ఇప్పుడు ప్రథమ శత్రువు బీజేపీనే. బీజేపీపై ప్రజావ్యతిరేక ముద్ర వేస్తేనే చంద్రబాబు నాయుడికి ఓట్లు లభిస్తాయి. ఏపీలో పొత్తు పెట్టుకోకపోయినా తెలంగాణలో ఆ మేరకు సహకారం అందిస్తే జాతీయంగా టీడీపీకి అండగా నిలవడానికి తమకు అభ్యంతరం లేదని కాంగ్రెసు నాయకులు పరోక్షంగా ఆపర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి ఉన్న ఆరుశాతం ఓటు బ్యాంకే దీనికి ప్రధాన కారణం. దీంతో బలాబలాలు తారుమారు చేయవచ్చని కేసీఆర్ ను నిరోధించవచ్చని కాంగ్రెసు నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ లో కాంగ్రెసు పార్టీ ప్రధాన పోటీదారు పాత్ర నుంచి తప్పుకుంది. తెలంగాణలో టీడీపీ కూడా ప్రధాన పోటీదారు కాదు. అందువల్ల తెలంగాణలో కాంగ్రెసుతో చేతులు కలిపితే వచ్చే నష్టమేమీ లేదు. ఇదే ప్రతిపాదనను టీడీపీ ముందు ఉంచి ఒక పలవంతమైన పొత్తు లేదా అవగాహనకు వస్తేబాగుంటుందని కాంగ్రెసు నేతలు యోచిస్తున్నారు.

బాబు లో సందేహాలు…

చంద్రబాబునాయుడికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్కసీటు కూడా గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. పొత్తు తప్పదు. ఎవరితో అన్నదే సమస్య. ఈ విషయాన్ని టీటీడీపీ నేతలకు కూడా చేప్పేశారాయన. పార్టీ తెలంగాణలో పుంజుకొని కనీస పోటీ ఇవ్వాలంటే నందమూరి లేదా నారా వారసుల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలన్న విజ్ణప్తిని కూడా బాబు తోసిపుచ్చారు. పంక్చర్ తప్పదని తెలిసిన సైకిల్ పై ఎన్నికల ప్రయాణం చేసి ఆ ఓటమిని తమ కుటుంబంపై వేసుకోవడం ఎందుకనేది ఆయన భావన. పార్టీని మీరే చూసుకోవాలంటూ స్థానిక నాయకులకు స్పష్టంగా చెప్పారు. పొత్తులుంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయమని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే టీడీపీ భవితవ్యం ఏమిటనే భయాందోళనలు చంద్రబాబులో ఉన్నాయి. అందులోనూ కాంగ్రెసుతో చేయి కలిపితే కాంగ్రెసు ముక్త భారత్ నినాదాన్నెత్తుకున్న మోడీ సహిస్తారా? టీడీపీపై కక్ష కడతారా? అనే భయాలు న్నాయి. మరోవైపు తన మంత్రివర్గంలో జూనియర్ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ తో చేయి కలిపి ఆయన విదిల్చే సీట్లకు కక్కుర్తి పడితే సహాయకపాత్రకే టీడీపీ పరిమితమవుతుందనే భయమూ ఉంది. అలాగని కాంగ్రెసు, టీఆర్ఎస్ రెంటినీ దూరంగా ఉంచి ఒంటరిగా వెళితే పార్టీకి ఆత్మహత్యాసదృశమే. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. 2019 లో తిరిగి ఏపీలో టీడీపీ గెలిస్తే లోకేశ్ కు క్రమేపీ బాధ్యతలు అప్పగించి కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న చంద్రబాబు తన కౌంటర్ పార్ట్ అయిన కేసీఆర్ తనకు పోటీగా మారతారనీ సందేహిస్తున్నారు. మొత్తమ్మీద అత్యంత కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతోంది తెలుగుదేశం. రెండు వైపుల నుంచీ ఆపర్లు రావడం టీటీడీపీ నాయకులకు మాత్రం సంబరం కలిగిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*