బాలకృష్ణ పీఏ ఏం చేస్తున్నాడో తెలుసా?

balakrishna film with vinayak

యువరత్న, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పెద్ద చిక్కొచ్చి పడింది. సొంత నియోజకవర్గంలోనే బాలయ్య నిరసనను ఎదుర్కొంటున్నారు. అదీ విపక్ష నేతలు కాదు. సొంత పార్టీ నేతలే. ఇంతకీ వాళ్ల కోపం బాలయ్య బాబు మీద కాదట. నియోజకవర్గంలో బాలకృష్ణ పీఏగా వ్యవహరిస్తున్న శేఖర్ మీద. బాలయ్య బాబు పీఏ ఆగడాలు మితిమీరి పోయాయంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మీటింగ్ లు పెట్టుకున్నారు. శేఖర్ ను హిందూపూర్ నుంచి సాగనంపాల్సిందేనని ప్రతిన బూనారు. అందరూ ఒక్కటై తీర్మానం కూడా చేసేశారు.

ప్రతి పనికీ ఒక రేటు….
నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎక్కువగా సినిమాల షూటింగ్ లలోనే ఉండటం, ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే గడుపుతుండటంతో ఆయనకు ఒక పీఏ కావాల్సి వచ్చింది. ఇందుకోసం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బాలయ్య బాబు శేఖర్ అనే వ్యక్తి ని పీఏ గా నియమించుకున్నారు. నియోజకవర్గంలో బాలయ్య బాబు ఒక ఇల్లు కూడా తీసుకున్నారు. శేఖర్ అందులోనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కాని జరుగుతున్నది వేరే విషయమంటున్నారు టీడీపీ నేతలు. ప్రతి పనికీ రేటు కట్టి టీడీపీ శ్రేణుల నుంచే శేఖర్ వసూలు చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఒక నియంతలాగా వ్యవహరిస్తూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అనేకసార్లు బాలయ్య దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో అంతా ఒక్కటయ్యారు. తెలుగు తమ్ముళ్ల ఒకే గొంతును విన్పించారు. శేఖర్ ను ఇక్కడి నుంచి పంపించాల్సిందేనని తీర్మానించారు. లేపాక్షి మండలం చోళ సముద్రం లోని సత్తార్ తోటలో సమావేశమై ఈ మేరకు నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, సీనియర్ టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం విశేషం. ప్రతి పనికీ ఒక రేటును పెట్టి టీడీపీ కార్యకర్తల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం మంచోడనే చెబుతున్నారు. మరి దీనిపై బాలయ్య బాబు స్పందన ఎలా ఉంటుందో మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*