బీజేపీతో జత కడితే ఎవరైనా ఇంటికేనా?

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన 2018-19 వార్షిక బ‌డ్జెట్‌తో ఏపీలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారిపోయాయి. ఏపీకి ఎలాంటి సాంత్వ‌న లేకుండా పోవ‌డంతో బ‌డ్జెట్‌పై తీవ్ర ఆగ్ర‌హ జ్వాల‌లు పెల్లుబుకుతున్నాయి. రాజ‌ధాని నిర్మాణానికి ఒక్క‌రూపాయి కూడా విదిలించ‌క‌పోవ‌డం, ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రం ప్రాజెక్టు మాటైనా ఎత్త‌క‌పోవ‌డం, ప్యాకేజీ కేటాయింపుల‌పై ఒక్క‌మాటైనా మాట్లాడ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు ఏపీలో తీవ్ర ప్ర‌భావం చూపించాయి. దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇప్పుడు బీజేపీ అంటేనే నిప్పులు చెరుగుతున్నారు. ఏపీని ఆదుకుంటామ‌ని, విభ‌జ‌న క‌ష్టాలు తీరుస్తామ‌ని, అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని మోడీ చెప్పిన మాట‌లు ఏమ‌య్యాయ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, బీజేపీ నేత‌లు ఏ ముఖాలు పెట్టుకుని ఏపీలో తిరుగుతార‌ని కూడా వారు ప్ర‌శ్నిస్తున్నారు.

బీజేపీతో చెలిమి చేస్తే….

విభ‌జ‌న త‌ర్వాత ఏపీ పూర్తిగా ఆదాయం కోల్పోయింది.ఆస్తులు కోల్పోయి నానాతిప్ప‌లు ప‌డుతోంది. దీంతో రాష్ట్రానికి కేంద్రం కొండంత అండ‌గా ఉంటుంద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు భావించారు. అయితే, అనూహ్యంగా కేంద్రం తాజా బ‌డ్జెట్‌లో ఏపీకి ఎలాంటి వరాలూ ఇవ్వక‌పోగా.. క‌నీసం కేటాయింపులు కూడా లేకుండా చేయ‌డంతో అంద‌రిలోనూ ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టి బుద్ధి చెప్పాల‌ని ఏపీ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీతో చెలిమి చేసే పార్టీల‌కు సైతం ఈ దెబ్బ తీవ్రంగా త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు 2014లో పొత్తు పెట్టుకుని తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈ వేడి ఇప్ప‌టికే తాకుతోంది. దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీని వ‌దిలించుకోవాల‌ని ధృఢంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఆయ‌న ద‌ణ్ణం పెట్టి ప‌క్క‌కు త‌ప్పుకొంటామ‌ని చెప్పినా.. త్వ‌ర‌లో చంద్ర‌బాబే స్వ‌యంగా బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

జగన్ కూడా….

ఇక‌, ప్ర‌త్యేక హోదా ఇస్తే.. బీజేపీతో పొత్తుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యం ఇప్ప‌డు పూర్తిగా డోలాయ‌మానంలో ప‌డింది. ఇప్ప‌టికే ఒక‌సారి అధికారం అంచుల‌దాకా వ‌చ్చి త‌ప్పిపోయిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ప‌రిస్థితి ఇప్పుడు మ‌రీ దారుణంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న జ‌గ‌న్‌.. దీనికి సంబంధించి తీవ్ర క‌స‌ర‌త్తే చేస్తున్నారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో ఇప్ప‌టికే అలుపెరుగ‌కుండా 1000 కిలో మీట‌ర్లు న‌డిచారు. ఈ క్ర‌మంలో ఇంత క‌ష్ట‌ప‌డి అధికారంలోకి రావాల‌నుకుంటున్న జ‌గన్ బీజేపీతో పొత్తుకుంటే.. ప్ర‌జా గ్ర‌హం చ‌విచూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఎదుర‌య్యేలా ఉంద‌ని అంద‌రూ అంటున్నారు.

అందుకే చంద్రబాబు…

ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌.. ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తిని రెచ్చ‌గొట్టింద‌ని, ఈ క్ర‌మంలో ఆ పార్టీనే భూస్థాపితం చేయాల‌ని ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకున్నార‌ని, ఇక‌, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే పార్టీకి సైతం ఇదే గ‌తి ప‌ట్ట‌క త‌ప్ప‌ద‌ని వారు అంటున్నారు. మ‌రి.. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ గ్ర‌హిస్తాడో లేదో చూడాలి. ఏదేమైనా ఏపీ జ‌నాలు బీజేపీ పేరు విన్నా, ఆ పార్టీ నాయ‌కులు అన్నా ప‌ట్ట‌రాని ఆగ్ర‌హంతో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ జ‌నాలు బీజేపీకి యాంటీ పార్టీల‌కు క‌సితీరా ఓట్లు గుద్ది మ‌రీ ఓడించ‌డానికి రెడీ అవుతున్నారు. మ‌రి అలాంటి పార్టీతో పొత్తుతో వెళ్లిన వారు ఎవ‌రైనా వారు బీజేపీతో పాటు క‌లిసిక‌ట్టుగా ఓడాల్సిందే. అందుకే చంద్రబాబు హడావిడిగా సమావేశాల మీద సమావేశాలు ఏర్పాటుచేసి సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఆదివారం ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*