బీజేపీ ఛాన్స్ మిస్సవుతుందా?

ప్రతిపక్షం లేకపోవడంతో నాయకుడు లేని సినిమాలా మారింది అసెంబ్లీ పరిస్థితి అంటూ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు బీజేపీ శాసనసభాపక్షం నేత విష్ణుకుమార్ రాజు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన పార్టీగా నిలదొక్కుకునేందుకు భారతీయ జనతాపార్టీ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉండటం వల్ల వీలు పడటం లేదు. అసెంబ్లీ సమావేశాల సందర్బంలో ప్రతిసారీ ప్రతిపక్ష వై.సి.పి. తీవ్రంగా దాడి చేస్తోంది. పోలవరం,ప్రత్యేక హోదా వంటి కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అంశాలూ వారి దాడిలో భాగమవుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ అండగా నిలవాల్సి వస్తోంది. అందువల్ల ప్రజాసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే పక్షంగా ఆ పార్టీ నిలదొక్కుకోలేకపోతోంది. దీర్ఘకాలంగా సొంతకాళ్లపై నిలబడుతూ స్వతంత్రంగా పోటీ చేయాలన్న కోరిక కూడా నెరవేరే సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెసు నుంచి ఇతర పక్షాల నుంచి వచ్చి బీజేపీ లో చేరిన అగ్రనాయకులు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నాలక్ష్మీనారాయణ వంటి వారు చంద్రబాబు నాయుడికి , తెలుగుదేశం పార్టీకి బద్ధ వ్యతిరేకులు.పార్టీ హైకమాండ్ అనుమతి లేకపోవడంతో టీడీపీపై విరుచుకుపడే విషయంలో వారు మౌనం వహించాల్సి వస్తోంది.

అనుకోని అవకాశం …

టీడీపీతో తేల్చుకోవాల్సిన అంశాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. కేంద్రప్రభుత్వ పథకాల నిధులను రాష్ట్రం దారిమళ్లించడం, వాటికి సొంతముసుగు వేసి పేర్లు మార్చి అవి రాష్ట్రప్రభుత్వమే అందచేస్తోందన్న భావన కల్పించడం వంటి అంశాలపై బీజేపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో రచ్చ చేసేందుకు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగినంత బలం, బలగం కమలనాథులకు లేవు. అక్కడక్కడ నాయకులు, అంతంతమాత్రం కార్యకర్తలతో పార్టీ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వై.సి.పి అసెంబ్లీని బహిష్కరించడంతో తమ వాణిని వినిపించేందుకు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు అరుదైన అవకాశం బీజేపీకి లభించింది. నిర్మాణాత్మక విమర్శలు చేయడంతోపాటు ప్రభుత్వ విధానాలను కడిగిపారేయడానికి ఈ వేదికను వినియోగించుకోవచ్చు. ప్రతిపక్షం లేని లోటు పూరించడంతోపాటు బీజేపీ విధానాలను, కేంద్ర పథకాలను చెప్పుకునేందుకు కూడా ఇదో అవకాశం. సమస్య తీవ్రత ప్రజల్లోకి కూడా వెళుతుంది. కానీ ఆ మేరకు బీజేపీలో కసరత్తు సాగుతున్నట్లు కనిపించడం లేదు. సాధారణ సమావేశాల్లో బీజేపీ పక్షం , టీడీపీకి పక్కవాయిద్యంగా మారుతోంది. కనీసం వై.సి.పి. లేని సందర్బంలోనైనా తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యానికి మేలు చేకూరుతుంది. ప్రభుత్వ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చు. అసెంబ్లీ వేదికను ప్రభుత్వ పథకాల ప్రచారానికి వినియోగపడేలా తెలుగుదేశం పక్కా ప్లానింగ్ తో వెళుతోంది. వీటిని అడ్డుకుంటూ నిలదీయాల్సిన బాధ్యత ప్రస్తుతం బీజేపీపైనే ఉంది. ఈ అంశంలో ఫెయిలైతే పార్టీగా కూడా బీజేపీ తన స్కోరింగు పాయింట్లను కోల్పోతుంది. అసలే ప్రతిపక్షం లేని సభలో ఏకపక్ష అజెండానే అమలవుతుంది. సభా స్సూర్తికి ఇది విరుద్దం. చట్టసభలో చర్చలు సాగాలి. ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలు బయటపెట్టాలి. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయాలి. నిలదీయడమే కాదు, నిరసనను వ్యక్తం చేసేందుకూ ఇదే వేదిక. బీజేపీ మేలుకుంటే వారికే మంచిది.

సమస్యల సంగతేంటి?

ఉపాధి హామీ నిధులు పక్కదారిపడుతున్నాయనే ఆరోపణలున్నాయి. దాంతో కేంద్రప్రభుత్వం కొంతకాలం పాటు రాష్ట్రానికి ఆ నిధుల మంజూరునే నిలిపివేసింది. దీనిపై వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉంది. కేంద్రప్రభుత్వం ప్రదానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తుంటే ఆ పథకం ఇక్కడ ఎన్టీయార్ గృహ నిర్మాణంగా రూపాంతరం చెంది రాష్ట్రప్రభుత్వ పథకంగా ప్రజల్లో గుర్తింపు పొందుతోంది. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా మారింది తంతు. ఇలా అనేక రకాల పథకాలకు సంబంధించి కేంద్రం ముద్ర లేకుండా చూసుకోవడంలో టీడీపీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. పార్టీ ప్రయోజనాలను కాపాడుకునేందుకైనా బీజేపీ నాయకులు నిజానిజాలను అసెంబ్లీలో నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తే మంచిది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, స్వల్పవ్యవధి చర్చ, వాయిదా తీర్మానం వంటి అనేక రూపాల్లో సమస్యలను ప్రస్తావించవచ్చు. సమాధానం రాబట్టవచ్చు. ఆ మేరకు కృషి సాగడం లేదు. ఎమ్మెల్యేల్లో ఈ విషయంలో డైలమా కొనసాగుతోంది. పోలవరం, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ వంటి విషయాల్లో ప్రభుత్వపక్షం కూడా కేంద్రంపై ఎదురుదాడి చేస్తుందనే భయం ఆయా నాయకులను వెంటాడుతోంది. అలాగని ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటే ప్రజలకు నిజానిజాలెలా తెలుస్తాయి? కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కేంద్ర సహకారం ఎంతమేరకు ఉంది? ఏ రకమైన విధానాలతో గరిష్టంగా నిధులు, పథకాలను రాబట్టగలం? ఇందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏవిధమైన సహకారాన్ని అందిస్తుంది? వంటి అంశాల్లో చర్చలు జరిపితే ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం సమకూరుతుంది. ఈ విషయంలో బీజేపీ నిర్మాణాత్మకంగా, విమర్శనాత్మకంగా వ్యవహరించగలిగితే ప్రతిపక్షం లేని లోటు తీరుతుంది. ఆ పార్టీకి కూడా ప్రజల్లో మంచి పేరు దక్కుతుంది. పరిస్థితులు అనుకూలిస్తే స్వతంత్రపక్షంగా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అవసరమైన నైతిక పునాది ఏర్పడుతుంది. మొహమాటాలకు పోకుండా, ప్రభుత్వంతో తెరవెనుక రాజీలు లేకుండా సూటిగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. అదే ప్రజాస్వామ్యానికి శ్రేయోదాయకం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1