బీజేపీ-టీడీపీపై సూప‌ర్ సెటైర్లు….!

మేం మీకు సాయం చేశాం కాబ‌ట్టి.. మీరు మాకు సాయం చేయాలి- ఇన్నాళ్లు ఓపిక‌గా ఉన్నాం కాబ‌ట్టి ఏపీని ప‌ట్టించుకోవాలి- మిత్రధ‌ర్మం పాటిస్తున్నాం కాబ‌ట్టి మీరు మ‌మ్మల్ని కాపాడాలి- ఇవీ తాజాగా రెండు మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు వినిపిస్తున్న డైలాగులు. ఇక‌, ఇదే స‌మ‌యంలో మిత్రధ‌ర్మం అంటూనే మాపై ధ‌ర్నా చేయిస్తారా?- వైసీపీ దొంగ‌ల పార్టీ అంటూనే ఆ పార్టీ పార్టిసిపేట్ చేసిన బంద్‌కు స‌హ‌క‌రిస్తారా?- ఇవి బీజేపీ నేత‌ల డైలాగులు. ఇక‌, వీటి నుంచి పుడుతున్నవే.. ఏపీ ప్రజ‌ల చెవిలో పూలు- తామ‌ర పూలు తొడిగేసి.. సైకిల్‌పై ఊరేగించారుగా.. పొత్తులంటూ క‌త్తులు.. ఇవి సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్న కామెంట్లు. కాన్సెప్ట్ ఏదైనా ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా విస్తృతంగా స్పందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రాజ‌కీయాల‌పై రెండు రోజులుగా సోష‌ల్ మీడియా లైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌ల‌లో చిత్రవిచిత్రమైన కామెంట్లు కుమ్మేస్తున్నారు నెటిజ‌న్లు.

ఇద్దరిదీ తప్పేనంటున్న…..

ఈ క్రమంలోనే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, టీడీపీ అధినేత చంద్రబాబు వైఖ‌రి, బీజేపీ నేత‌ల ధోర‌ణిని క‌లిపి కామెంట్ల రూపంలో కుమ్మేస్తున్నారు. నిజానికి ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం కేంద్రం చేయాల్సిన‌వి చేయాలి. అదే స‌మ‌యంలో ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం రాష్ట్రం కూడా ఎప్పటిక‌ప్పుడు కాబూలీ వాడి మాదిరిగా కేంద్రం గొంతుపై కూర్చోవాలి. ఈ రెండు విష‌యాల్లో రెండు ప్రభుత్వాలు త‌ప్పు చేశాయి. దీంతో ఏపీ న‌ష్టపోయిన మాట వాస్తవం. ఏపీకి ఇవ్వాల్సినవి ఇస్తున్నామ‌ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఏం ఇచ్చార‌ని, ఇదిగో లెక్కల‌ని బాబు కూడా కొన్ని గ‌ణాంకాలు చూపిస్తున్నారు. ఈ రెండు లెక్కల మ‌ధ్య కాలం గ‌డిచి పోతోందేత‌ప్ప.. క‌లిసొచ్చిన అంశాలు మాత్రం ఏమీ లేవు. ఇప్పుడు ఏకంగా బీజేపీపై ధ‌ర్నాకు కూడా పిలుపు నిచ్చేందుకు అవ‌స‌ర‌మైతే.. క‌టీఫ్‌కు సిద్ధప‌డేందుకు కూడా చంద్రబాబు సిద్ధమ‌య్యారు. అంతాబాగానే ఉంది. అయితే, ఏపీ భ‌విష్యత్తు ప‌రిస్థితి ఏమిటి ? అని ప్రశ్నిస్తున్నారు నెటిజ‌న్లు.

పశ్చిమ బెంగాల్ కు ఇవ్వలేదా?

మేం స‌హ‌కారం చేశాం కాబ‌ట్టి మీరు చేయాలి! అన‌డం స‌రైన వాద‌నేనా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి స‌హ‌క‌రించ‌ని ప‌శ్చిమ బెంగాల్‌కు కేంద్ర బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌లేదా? అంటున్నారు. నిజానికి చంద్రబాబు తాజాగా వెల్లడించిన స‌మాచారం ప్రకారం .. కేంద్రం మ‌న‌కు ప్రత్యేకంగా ఏమిచ్చింద‌న్నారు. మ‌రి ఏమీ ఇవ్వన‌ప్పుడు మిత్ర ప‌క్షంగా ఉండి ప్రయోజ‌నం ఏమిట‌న్నది కొంద‌రు నెటిజ‌న్లు సూటిగా సంధిస్తున్న ప్రశ్న. అదేస‌మ‌యంలో.. ప్రత్యేక హోదా విష‌యాన్ని ప్రస్థావించిన బీజేపీనే ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని.. 14వ ఆర్థిక సంఘంపై నెట్టివేయ‌డాన్ని కూడా త‌ప్పుప‌డుతున్నారు. మొత్తంగా ఏపీ విష‌యంలో మిత్రప‌క్షాలుగా ఉన్న బీజేపీ-టీడీపీలు అనుస‌రిస్తున్న వైఖ‌రిని నెటిజ‌న్లు మాత్రం ఏ ఒక్క బిట్‌ను కూడా మిస్ చేసుకోకుండా ఫాలొ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలోనే ఏ వాట్సప్ మెసేజ్ చూసినా, ఏ ఫేస్‌బుక్ పోస్ట్ చూసినా.. ఏపీ గురించి, బీజేపీ-టీడీపీల బంధం గురించి ఉంటున్నాయి. మ‌రి వీటిని ఇరు పార్టీలూ ఎలా తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1