బెంబేలెత్తిన బొబ్బిలి కోట‌.. రీజ‌న్ ఇదే!

విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార టీడీపీలో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. ఒక‌రిపై ఒక‌రు దుర్భాష‌లాడు కున్నారు. తాము ద‌శాద్బాలుగా పార్టీని న‌మ్ముకుని ఉన్నామ‌ని, పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని, అయినా కూడా ఎక్క‌డా త‌మ‌కు గుర్తింపు ద‌క్క‌డం లేద‌ని నేత‌లు చెల‌రేగిపోయారు. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయ‌ని, ఇప్ప‌టికైనా త‌మ‌కు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వ‌క‌పోతే.. ప‌రిస్థితులు తారు మారు కావ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. మొత్తానికి తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించిన ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

బొబ్బిలి రాజుల కంచుకోటలో…..

వాస్త‌వానికి ఇక్క‌డ నుంచి 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలుపొందిన సుజ‌య కృష్ణ రంగారావు.. త‌ర్వాత చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో ఆయ‌న ఏడాది కింద‌టే టీడీపీలో చేరిపోయారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు చంద్ర‌బాబు కేబినెట్‌లో బెర్త్ కూడా కేటాయించారు. 1999 నుంచి టీడీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పుడూ గెల‌వ‌లేదు. 2004 నుంచి బొబ్బిలి రాజులే గెలుస్తూ వ‌స్తున్నారు. ఇది వాళ్ల‌కు కంచుకోట‌గా మారింది. అయితే,ఆది నుంచి అంత‌గా ఎవ‌రితోనూ క‌ల‌పుగోలుగా ఉండ‌ర‌నే పేరు తెచ్చుకున్న సుజ‌య్‌.. టీడీపీలోనూ అదేవిధంగా వ్య‌వ‌హ‌రించారు.

టీడీపీ నేతలను పట్టించుకోకపోవడంతో…..

అంతేకాదు, టీడీపీలోకి తాను చేరినా.. తీర్థం పుచ్చుకున్నా… మంత్రి ప‌ద‌విని అనుభ‌విస్తున్నా.. కూడా స్థానిక టీడీపీ నేత‌ల‌ను ఏనాడూ ఆయ‌న ప‌ట్టించుకోలేదు. అంతేకాదు, స్థానికంగా టీడీపీ నేత‌లు ఎదుర్కొంటున్న స‌మస్య ల‌ను సైతం ఆయ‌న ప‌ట్టించుకోలేదు. దీంతో ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు నాగంబొట్టు మాదిరిగా మారిపోయింది. ఇది చినుకు చినుకు గాలివాన‌గా మారి.. ఇప్పుడు వీధుల్లోకి ఎక్కేలా త‌మ్ముళ్ల‌ను రెచ్చ‌గొట్టింది. టీడీపీ ఆవిర్బావ సభ సందర్భంగా ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణ రంగారావు సొంత నియోజకవర్గం బొబ్బిలి లో టిడిపి పాత కార్యకర్తలకు, మంత్రి అనుచరులకు నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి.

మంత్రి నిలదీసిన కార్యకర్తలు…..

పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీలో పాతికేళ్లగా ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. సీనియర్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు మంత్రిని నిలదీశారు. సమావేశాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని…. పనులు కూడా తమవర్గం వారికే ఇచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా మంత్రి సుజయకృష్ణ రంగారావు అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు చొక్కాలు చింపుకున్నారు. దీంతో సమావేశం కాసేపు రసాభాసగా మారింది.

ఎప్పటి నుంచో ఉన్న తమను కాదని….

పార్టీలు మారితేనే గుర్తింపు ఉంటుందా? అని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నించ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. పార్టీలు మారినంత మాత్రాన త‌మ‌ను ప‌ట్టించుకోరా? తాము చేసిన అభివృద్ధితోనే ఇక్క‌డ టీడీపీ బ‌తికి ఉంద‌ని తమ్ముళ్లు వ్యాఖ్యానించారు. కాగా, ఈ ర‌గ‌డ చంద్ర‌బాబు వ‌ర‌కు చేర‌డంతో.. ఆయ‌న మంత్రి సుజ‌య కృష్ణ‌ను అమ‌రావ‌తికి పిలిచి న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితి ఇలా మార‌డం సుజ‌య్ భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్థ‌కం చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*