బెజవాడ టీడీపీ బ‌జారున పడిందే…!

రాజ‌ధాని ప్రాంతం బెజ‌వాడలో అధికార పార్టీ రెండుగా చీలిపోయింది. నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ ప‌ద‌వి విష‌యంలో త‌లెత్తిన వివాదాలు.. తీవ్ర రూపం దాల్చాయి. విష‌యంలోకి వెళ్తే.. విజ‌య‌వాడ న‌గ‌ర మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. ఇక్క‌డ టీడీపీ సీనియ‌ర్ నేత కోనేరు శ్రీధ‌ర్ మేయ‌ర్‌గా ఉన్నారు. మొద‌ట్లో ఎంతో సౌమ్యుడు, నిదాన‌స్తుడు, అంద‌రినీ క‌లుపుకొని ముందుకు వెళ్తాడు అని భావించి ఏక‌గ్రీవంగా ఆయ‌న‌ను మేయ‌ర్‌గా ఎన్నుకున్నారు. అయితే, గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని సొంత పార్టీలోనే ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. త‌మ‌కు ఎలాంటి గుర్తింపు లేకుండా చేస్తున్నార‌ని కూడా టీడీపీ కార్పొరేట‌ర్లే బాహాటంగా విమ‌ర్శిస్తున్నారు.

మేయర్ ను మార్చాల్సిందేనంటూ….

దీంతో గ‌త నాలుగైదు రోజులుగా మేయ‌ర్‌కు, కార్పొరేట‌ర్లే విమ‌ర్శ‌లు ప్రారంభించారు. ఇది ఇప్పుడు చినికి చినికి గాలి వాన అయిన చందంగా మొత్తానికి మేయ‌ర్ ను గ‌ద్దె దింపాల్సిందే అనే డిమాండ్ వ‌ర‌కు వెళ్లింది. దీంతో మేయ‌ర్‌ను స‌మ‌ర్ధించేవారు ఓ వ‌ర్గంగా..మేయ‌ర్‌ను వ్య‌తిరేకించేవారు మ‌రో వ‌ర్గంగా విడిపోయారు. మేయర్‌ను వెంటనే మార్చాలం టూ వ్య‌తిరేక వ‌ర్గం కార్పొరేట‌ర్లు.. పార్టీ నేతలకు లేఖాస్త్రాన్ని సంధించారు. మేయర్‌పై ఎదురుతిరిగిన అసమ్మతి కార్పొరేటర్లకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్‌ అండగా నిలిచారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ముందే పంచాయితీ పెట్టాలని అసంతృప్త కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ విజయవాడ అర్బన్‌ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నతో కార్పొరేటర్లు భేటీ అయ్యారు.

మధ్యవర్తిగా బుద్ధా వెంకన్న…..

మేయ‌ర్‌ను గ‌ద్దె దింపాల‌ని, రొటేష‌న్ ప‌ద్ద‌తిలో ఈ ప‌దివిని వేరేవారికి అప్ప‌గించాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో క‌లుగ జేసుకున్న బుద్ధా వెంక‌న్న కార్పొరేటర్ల అభిప్రాయాలను హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. స‌మ‌స్య‌ల‌ను సానుకూలంగా సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న సీనియ‌ర్లు ఈ పొగ ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ అత్యంత కీల‌క న‌గ‌రంగా ఉంద‌ని, ఇక్క‌డ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టామ‌ని, ఈ క్ర‌మంలోనే ఇలా నేత‌ల మ‌ధ్య విభేదాలు రావ‌డం అంత మంచి ప‌రిణామం కాద‌ని అంటున్నారు. మ‌రి ఈ వివాదం ఏ మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1