బొజ్జల కోటలో జగన్ బోణీ కొడతారా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేరుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. 1989 నుంచి 2014 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఇక్కడ ఉందన్నది స్పష్టమవుతోంది. 1989, 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వరుసగా గెలుపొందారు. హ్యాట్రిక్ విజయాలను సాధించారు. అయితే 2004లో మాత్రం బొజ్జల ఇక్కడ ఓటమి పాలయ్యారు. 2004లోకాంగ్రెస్ అభ్యర్థి ఎన్.సి.వి నాయుడు గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన 2009, 2014 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించడం విశేషం. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బొజ్జలపై కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు.

బొజ్జల అసంతృప్తితో….

దీంతో జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీని పటిష్టపర్చే ఉద్దేశ్యంతో పాదయాత్ర చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇప్పటికే కొంత అనారోగ్యంతో నియోజకవర్గంలో పెద్దగా తిరగడం లేదు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమాలకు కూడా బొజ్జల దూరంగానే ఉన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత బొజ్జల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖను కూడా అప్పట్లో స్పీకర్ కు పంపారు. అయితే తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో మౌనంగా ఉండిపోయారు. మంత్రిగా పనికిరాకుంటే ఎమ్మెల్యేగా కూడా పనికిరానని ఆయనే బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీంతో ప్రజలకు దూరంగా ఉంటున్న బొజ్జల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా కష్టమే.

బీసీలతో ఆత్మీయ సదస్సు…

ఈ నేపథ్యంలో అక్కడ పార్టీని పటిష్టం చేసేందుకు జగన్ పాదయాత్ర ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అందుకోసం జగన్ ఈ నియోజకవర్గంలోని పాపనాయుడిపేట లో బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీసీల కోసం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత బీసీ గర్జన ఏర్పాటు చేసి బీసీల కోసం డిక్లరేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభించింది. వైసీపీ క్యాడర్ మొత్తం జగన్ పాదయాత్ర వెంటే నడిచింది. మొత్తం మీద జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఈసారి పాగా వేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

నేటి పాదయాత్ర ఇలా…..

65వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని యేర్పేడు మండలంలోని వికృతమల నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి గోవిందాపురం, చెల్లూరు క్రాస్ రోడ్స్, మూలకండ్రిగ, ఎం.డి. పుత్తూరు, మడిబాక క్రాస్ రోడ్స్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. రాజుల కండ్రిగలో వైఎస్ జగన్ భోజన విరామానికి ఆగుతారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. దర్వాత సదాశివపురం క్రాస్ రోడ్స్ వరకూ పాదయాత్ర కొనసాగనుంది. అక్కడే జగన్ రాత్రి బస చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*