భర్తను చంపి ప్రియుడిని భర్తగా మార్చాలనుకుని….! ఎవడు సినిమాచూసి….

భర్తను చంపేసింది.. ప్రియుడిని భర్తగా మార్చాలనుకుంది. ఇందుకోసం ఓ స్కెచ్ వేసింది. ఇంతలోనే స్టోరీలో సూపర్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం. ఎవడు సినిమా చూశారుగా..? యాసిడ్ దాడిలో పూర్తిగా కాలిపోయిన అల్లూ అర్జున్ బాడీకి రామ్ చరణ్ మొహం అతికిస్తారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూర్తిగా దెబ్బతిన్న అల్లo అర్జున్ మొహాన్ని పూర్తిగా మార్చేశారు. అయితే ఈ సినిమా స్టోరీతోనే ఓ భార్య తన భర్తను హతమార్చింది. ఆ స్థానంలో ప్రియుడిని తీసుకొచ్చేందుకు పెద్ద ప్లాన్ వేసింది.

ఎవడు సినిమా ప్రేరణతో….

నాగర్‌కర్నూల్‌కు చెందిన స్వాతి, సుధాకర్ రెడ్డి భార్యాభర్త. అయితే రెండేళ్ల క్రితం స్వాతి నడుము నొప్పితో బాధపడుతుండగా చికిత్స కోసం రాజేశ్ అనే ఫిజియోథెరపిస్ట్ వద్దకు వెళ్లింది. ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే నవంబర్ 26న రాజేశ్, స్వాతి బైక్‌పై మహబూబ్‌నగర్ వెళ్లారు. అక్కడ వీళ్లిద్దరిని సుధాకర్ రెడ్డి సన్నిహితులు చూసి సుధాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. మహబూబ్‌నగర్‌కు వచ్చావా? అని అడిగిన సుధాకర్ రెడ్డి ఫ్రెండ్స్.. అతని బైక్‌ని అక్కడ చూసినట్లు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన సుధాకర్ రెడ్డి.. భార్యను నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. విషయం బయటకు రావడంతో స్వాతికి, సుధాకర్ రెడ్డికి గొడవ అయింది. భర్తకు అసలు గుట్టు తెలియడంతో అతన్ని చంపేందుకు రాజేశ్‌తో కలిసి ప్లాన్ వేసింది.

పెద్ద స్కెచ్చే వేసి….

ఈ హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు స్వాతి పెద్ద స్కెచ్చే వేసింది. చూసేందుకు… రాజేశ్, సుధాకర్ రెడ్డి ఒకేలా కనిపిస్తారు. దాంతో భర్తను చంపేసి ఆ ప్లేస్‌లో ప్రియుడిని తీసుకురావాలని నిర్ణయించింది. అందుకోసం ‘ఎవడు’ సినిమా నుంచి ప్రేరణ పొంది.. ప్రియుడి రాజేశ్‌తో కలిసి సుధాకర్ రెడ్డిని హతమార్చింది స్వాతి. అంతేకాదు.. భర్తను చంపేసి ప్రియుడు రాజేశ్‌పై యాసిడ్ పోసింది. ముఖ కవళికలు సరిగ్గా గుర్తుపట్టకుండా అక్కడక్కడా యాసిడ్ పోసి.. తన భర్తపై ఎవరో యాసిడ్ దాడి చేశారంటూ డ్రామా ఆడింది. ఇంట్లో అత్త, మామకు అదే చెప్పింది. మొహం నిండా యాసిడ్ గాయాలు ఉండే సరికి.. సుధాకర్ తల్లిదండ్రులు రాజేశ్‌ను తమ కొడుకు అనే నమ్మారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చేర్పించి….

యాసిడ్ గాయాలతో ఉన్న రాజేశ్‌కు చికిత్స జరుగుతోంది. అంతా స్వాతి అనుకున్నట్లుగానే జరుగుతోంది. ఆస్పత్రి నుంచి బయటకు రాగానే రాజేశే సుధాకర్ రెడ్డి అని అంతా నమ్ముతారని భావించింది. అందుకు తగ్గట్లు అత్తమామల ముందు ఆస్కార్ రేంజ్‌లో నటించింది స్వాతి. అచ్చం సుధాకర్ రెడ్డిలా పోలికలు ఉన్నా.. మొహంపై యాసిడ్ గాయాలు ఉన్నా.. కన్నతల్లికి తన కొడుకు గురించి తెలుసు. సరిగ్గా ఇక్కడే సుధాకర్ రెడ్డి తల్లికి అనుమానం వచ్చింది. రాను రాను అది మరింత బలపడింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది తన కొడుకు కాదని అనుమానం ఉందంటూ సుధాకర్ రెడ్డి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తల్లికి అనుమానమొచ్చి…..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైలెంట్‌గా విచారణ చేపట్టారు. బిల్లు కట్టే సమయంలో ఆస్పత్రి సిబ్బంది ద్వారా ఆధార్ కార్డ్ తీసుకున్నారు. వేలిముద్రల ద్వారా వేరిఫై చేస్తున్న సమయంలో గుట్టంతా బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది సుధాకర్ రెడ్డి కాదని తేలింది. అది రాజేశ్ అని గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి మర్డర్ మిస్టరీ మొత్తం చెప్పేశారు. ప్రియుడు రాజేశ్‌తో కలిసి స్వాతి ‘ఎవడు’ రేంజ్‌లో ఆడిన నాటకం బయటపడింది. భర్తను చంపేసి.. ప్రియుడిని ఆ స్థానంలో తీసుకువచ్చేందుకు స్వాతి ఆడిన డ్రామాతో అటు పోలీసులు కూడా షాక్ అయ్యారు. అయితే ఇన్నాళ్లు తమ కొడుకే అనుకున్న సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు.. కోడలే తమ కొడుకును చంపిందనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1