మంత్రి కామినేని పక్కాగా బయటపడి పోయారే….!

బిజెపి నుంచి వెళ్ళి టిడిపి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నా పసుపు చొక్కా తొడిగేశారనే టాక్ మొదట నుంచి కామినేని శ్రీనివాస్ పై వున్నదే. కామినేని కి బిజెపి టికెట్ ఇప్పించింది చంద్రబాబే అన్నది పొలిటికల్ సర్కిల్ మాట. చంద్రబాబు బిజెపి నుంచి ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా కామినేని ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసి తన స్వామి భక్తిని బాబుకు చాటి చెబుతుండటం పరిపాటి. తాజాగా రాష్ట్రంలో బిజెపి,టిడిపి నడుమ ఎప్పటినుంచో నడుస్తున్న కోల్డ్ వార్ కాస్తా రోడ్డెక్కి హాట్ వార్ గా మారింది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పదునైన విమర్శలు ఆరోపణలతో టిడిపి శిబిరాన్ని కల్లోల పరిచారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టిడిపి యుద్ధం చేసే తరుణంలో ప్రధాని మోడీ టార్గెట్ గా తమ్ముళ్లు యుద్ధం ప్రారంభించడంతో సోము రంగంలోకి దిగి ఒక రేంజ్ లో తమ మిత్రపక్షానికి హెచ్చరికలు చేశారు. ఆ పరిణామాలపై స్పందించిన మంత్రి కామినేని సొంత పార్టీ నాయకుడిని వెనకేసుకు రాకుండా వీర్రాజు కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

సోము మిత్ర ధర్మం మరిచిపోతే ఎలా …?

సోము వీర్రాజు టిడిపి పై దాడి చేయడం ఆయన వ్యక్తిగతమన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. ఇలా మాట్లాడటం ఆయనకు తగదన్నారు. తాను ఏమి మాట్లాడినా పార్టీ అధ్యక్షుడి అనుమతి తోనే స్పందిస్తానని చెప్పుకొచ్చారు. మిత్రులుగా ఉన్నప్పుడు పొత్తు ధర్మం పాటించాలని హితవు చెప్పారు. ఇక ఇదే రీతిలో బిజెపి శాసన సభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు స్పందించారు. సోము ముఖ్యమంత్రి పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వీర్రాజు విమర్శలు ఎవ్వరు హర్షించే పరిస్థితి లేదన్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన ఎమ్యెల్యేలను మంత్రులుగా చేయడం ఏమిటంటూ విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం అంతా మరువకముందే ఆయన టిడిపి కి అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి కామినేని, విష్ణు కుమార్ రాజు సోము పై చేసిన కామెంట్స్ బిజెపి వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*