మనలో కోటీశ్వరులు ఎలా అయ్యారంటే…?

ఇరుగు పొరుగు దేశాలపై భారత్, చైనాల మధ్య వైరుథ్యాలతో పాటు పలు విశిష్టతలు, సారూప్యతలు ఉన్నాయి. జనాభా పరంగా రెండూ ప్రపంచంలో అతిపెద్ద దేశాలు. రమారమి 137 కోట్ల జనాభాతో చైనా ప్రధమ స్థానంలో ఉండగా, సుమారు 127 కోట్లతో భారత్ ద్వితీయ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్నదేశాలు భారత్, చైనాలు కావడం విశేషం. చైనా ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా, భారత్ తన నైతికతతో, నిజాయితీతో ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు, ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఆసియా టైగర్లుగా పేరుగాంచిన ఈ రెండు దేశాలు అంతర్జాతీయ యవనికపై ముఖ్యపాత్ర పోషిస్తుండటం ముదావహం.

సంపదను సృష్టించడంలో….

తాజాగా మరో ప్రత్యేకతను పొందాయి ఈ రెండు దేశాలు. సంపద సృష్టిలో పోటీ పడుతున్నాయి. సంపదను సృష్టించడంలో చైనా ప్రధమ స్థానంలో ఉండగా, భారత్ ద్వితీయ స్థానంలో ఉండటం విశేషం. యూబ్రీస్, ప్రైజ్ వాటర్ హౌజ్ కూపర్స్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఐరోపా దేశాలను, అగ్రరాజ్యమైన అమెరికాను ఆలోచింప చేస్తోంది. భవిష్యత్తులో చైనా, భారత్ లు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. విస్తృతమైన సహజ వనరులు, మానవ వనరులు, శ్రమించేతత్వం, నైపుణ్యం గల ఈ దేశాలు మున్ముందు మరింత ప్రగతి సాధించగలవన్న అభిప్రాయాన్ని యూబీఎస్, ప్పైజ్ వాటర్ హౌజ్ కూపర్స్ వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని నిపుణులు కూడా తోసిపుచ్చ లేక పోతున్నారు.ఇప్పటి వరకూ సంపద సృష్టిలో అగ్రరాజ్యమైన అమెరికానే ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇది చరిత్రే. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆసియా ఖండం దక్కించుకుంటోంది. సంపదలను సృష్టించడంలో ఈ ఖండవాసులు దూసుకుపోతున్నారు. చైనాలో ప్రతి మూడు వారాలకు ఒక బిలియనీర్ పుట్టుకొస్తున్నాడు. ఫలితంగా కోటీశ్వరుల సంఖ్యలో ఆసియాలోనే చైనా ముందంజలో ఉంది. ఇదే వేగంతో ఆసియా ముందుకెళితే వచ్చే నాలుగేళ్లలో ప్రపంచంలో అత్యధిక సంపద పోగైన అమెరికాను అధిగమించి ఆసియా ముందుకు వస్తుందని యూబీఎస్, ప్రైజ్ వాటర్ హౌజ్ కూపర్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో నయా బిలియనీర్లలో 75 శాతం మంది చైనా, భారత్ ల నుంచే ఆవిర్భవించారని ఈ నివేదిక పేర్కొంటుంది. ప్రపంచ బిలియనీర్ల క్లబ్ లో 637 మంది ఆసియా వాసులు ఉండగా, వారిలో 117 మంది కొత్తగా చేరిన వారే కావడం గమనార్హం. ఇలా కొత్తగా ఆవిర్భవించిన కుబేరుల్లో అత్యధికులు కళాత్మక వ్యాపారాలు, క్రీడారంగాలకు చెందిన వారే. ప్రపంచంలో 140కి పైగా గల ప్రముఖ స్పోర్ట్స్ క్లబ్ లను 109 మంది బిలియనీర్లు నిర్వహిస్తున్నారు. వీరంతా సగటున 500 కోట్ల డాలర్ల సంపద కలిగిన 68 సంవత్సరాల వయసు పైబడిన వారే కావడం గమనార్హం. ఈ ఏడాది 500 మంది కుబేరులు కూడబెట్టిన సంపద 53 లక్షల కోట్ల రూపాయలు. బ్లూమ్ బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది పెరిగిన సంపన్నుల సంపద 19 శఆతం. ఈ ఏడాది అక్టోబరు 25 నాటికి ప్రపంచ బిలీనియర్లు మొత్తం ఆస్తులు రూ.3.38 లక్షల కోట్లు. అమెరికాలో ఇప్పటికే ఉన్న 563 మంది బిలీనియర్ల జబాతాలోకి అదనంగా 25 మంది చేరారు. ఇదే సయమంలో యూరప్ లో కొత్తగా బిలీనియర్లు అయిన వారు లేరు. 342 మంది వద్దే ఈ సంఖ్య ఆగిపోయింది. తరతరాలుగా వ్యాపారం చేస్తున్న కుటుంబాల్లోని వారి కన్నా సొంతంగా వ్యాపారాలను ప్రారంభించినవారే వేగంగా సంపన్నులవుతున్నారు.

మూడో స్థానంలో భారత్…..

వ్యాపార రంగానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ సూయిజ్ విడుదల చేసిన నివేదిక కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. కుటుంబ వ్యాపారాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. చైనా, అమెరికాలు ప్రధమ, ద్వితీయ స్తానాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్, హాంకాంగ్, దక్షిణ కొరియా, మలేసియా, థాయ్ లాండ్, ఇండోనేసియా, మెక్సికో నాలుగు నుంచి పదిస్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో మొత్తం 108 స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కుటుంబ వ్యాపారాలున్నాయి. 167 లిస్టెడ్ కుటుంబ వ్యాపారాలతోచైనా ప్రధమ స్థానంలో ఉండగా, 121 కంపెనీలతో అగ్రరాజ్యమైన అమెరికా రెండో స్థానంలో ఉండటం విశేషం. భారత్ నుంచిఅథ్యయనానికి పరిగణనలోకి తీసుకున్న కంపెనీల్లో పరిణితి ఎక్కువ. దేశంలో 60 శాతం కుటుంబ వ్యాపారులు ప్రస్తుతం మూడోతరం చేతిలో ఉన్నాయి. చైనాలో మాత్రం 30 శాతం కంపెనీలే కుటుంబాల చేతుల్లో ఉండటం గమనార్హం. కుటుంబేతర కంపెనీలతో పోలిస్తే కుటుంబ సంస్థల ఆర్థిక పనితీరే మెరుగ్గా ఉంది. కుటుంబ కంపెనీలు దీర్ఘకాలిక వృద్థిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. వాటాదారులకు లాభాల పంపకంలో ఇతర సంస్థలతో పోలిస్తే మెరుగైన సంబంధాలున్నాయి. మొత్తం మీద కుటుంబ వ్యాపారాలే భారత్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మన రాష్ట్రంలోనూ…..

భారత్ లో వ్యాపారానికి, కుటుంబానికి అవినాభావ సంబంధ ముంది. కుటుంబాలే వ్యాపారరంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని కుటుంబాలకు కొన్ని వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్లగా నిలుస్తున్నాయి. రిలయన్స్, టాటా, బిర్లా, బజాజ్, గోద్రెజ్ వంటి సంస్థల్లో కుటుంబాలదే కీలకపాత్ర. ఆయా సంస్థల అభివృద్ధికి కుటుంబ సభ్యుల పాత్ర అనన్యం. ఇక ప్రాంతీయ, రాష్ట్రాల స్థాయుల్లో కూడా పలు సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్నాయి. తమ పరిధిని నానాటికీ విస్తరించుకుంటున్నాయి. కేసీపీ, రెడ్డీ ల్యాబ్స్, ఆంధ్రాషుగర్స్, అపోలో హాస్పిటల్స్ వంటి సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలోనే ప్రారంభమయ్యాయి. తమ పరిధులను విస్తరించుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో కుటుంబాల పాత్ర కీలకం. పెద్దయెత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే….!

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*