మళ్లీ కాంగ్రెస్ లోకి ఈ ఏపీ మాజీ ఎంపీలు…?

ఒకప్పటి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్, దళిత ఉద్యమ నేత మాజీ ఎంపి జివి హర్ష కుమార్ పాత కాంగ్రెస్ వాదులను కలిసి చేయి కలిపారు. వీరిద్దరిని అశాస్త్రీయ రాష్ట్ర విభజన చేస్తున్నారని అధిష్టానంపై తిరుగుబాటు చేసిన కారణంగా పార్టీ బహిష్కరించింది. వీరితో పాటు మరో ముగ్గురిపై వేటు వేసి వెలి వేసింది. నాటినుంచి సుమారు నాలుగేళ్ళుగా పార్టీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ లో చేరి హర్ష కుమార్ అమలాపురం ఎంపిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉండవల్లి మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు వారిద్దరూ దశాబ్దాల తరబడి కొనసాగిన తమ మాతృ పార్టీ వేదికపై దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు నాలుగు రోజుల పాటు చేపట్టిన మహా పాదయాత్ర కార్యక్రమ ప్రారంభానికి హాజరయ్యి తమ సంఘీభావం తెలపడం చర్చనీయాంశం అయ్యింది. వేదికపై తమ పాత మిత్రులతో ఆత్మీయంగా మాట్లాడారు. వారిద్దరు ఇప్పటివరకు అధికారికంగా ఏ పార్టీలో లేకపోయినా ప్రజాక్షేత్రంలో తమదైన శైలిలో కేంద్ర రాష్ట్రాలపై పోరాడుతున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ కాంగ్రెస్ దే: హర్ష కుమార్

పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దే అన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ ప్రాజెక్ట్ పునాది రాయి వేసింది కాంగ్రెస్. నిర్మాణం ప్రారంభించి జాతీయ ప్రాజెక్ట్ చేసింది కాంగ్రెస్ అన్నది జనం మర్చిపోరని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణం అంశంలో ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని హర్ష కుమార్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ ఉద్యమానికి తానూ సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

పోలవరం కోసం అవసరమైతే టిడిపి రమ్మంటే వెళతా : ఉండవల్లి

పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకత గుర్తించే కాంగ్రెస్ ఉద్యమానికి మద్దత్తు ప్రకటించడానికి వచ్చానని మీడియా కు ఉండవల్లి వెల్లడించారు. తనను కాంగ్రెస్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించినందుకు వెలి వేసిందని ఒక కుటుంబం గా వున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సంబంధాలు అలాగే ఉన్నాయని అన్నారు ఉండవల్లి. గతంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం ఉద్యమాలు చేసిన సిపిఐ, సిపిఎం, వైసిపి లకు కూడా మద్దతు తెలిపానని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తన సహాకారం కోరితే వెళతా అని చెప్పారు ఉండవల్లి. పోలవరం ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది, జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించింది కాంగ్రెస్ కాబట్టి ఆ పార్టీకి ఈ నిర్మాణం పూర్తి అయ్యేవరకు అందరికన్నా బాధ్యత ఉందన్నారు అరుణ కుమార్.

1 Comment on మళ్లీ కాంగ్రెస్ లోకి ఈ ఏపీ మాజీ ఎంపీలు…?

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1