మార్చి 13 తర్వాత మీ డబ్బులు… మీ…ఇష్టం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు చెప్పేసింది. సేవింగ్స్ ఖాతాలకు కూడా నగదు విత్ డ్రా పరిమితి పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలున్న వారు వారానికి 24 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంది. అయితే దీనిని 50 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే నగదు విత్ డ్రా పరిమితి పెంపుదల ఈ నెల 20వతేదీ నుంచి అమల్లోకి రానుంది. అలాగే మార్చి 13 నుంచి నగదు విత్ డ్రాలపై ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అంటే మార్చి 13నుంచి ఎంత డబ్బైనా మీరు విత్ డ్రా చేసుకునే వీలుంది.

ఏటీఎంలు అన్నీ తెరుచుకున్నాయి….

గత ఏడాది నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సందర్భంలో నగదు విత్ డ్రాపై ఆంక్షలను విధించింది ఆర్బీఐ. దాదాపు రెండు నెలల పాటు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎం ల వద్ద జనం క్యూ కట్టారు. ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయోనని జనం విమర్శలు కూడా చేశారు. అయితే గత నెల నుంచే ఏటీఎంలు దాదాపుగా అన్నీ తెరుచుకున్నాయి. నగదు పూర్తిగా అందుబాటులోకి రావడంతో ప్రజల ఇబ్బందులు కూడా తీరాయి. తొలిరోజుల్లో కేవలం రెండు వేల నోట్లే అందుబాటులో ఉండటంతో చిల్లర సమస్యలు తీవ్రంగా తలెత్తాయి. అయితే ఇది గమనించిన ఆర్బీఐ వంద, ఐదొందల నోట్లను ఎక్కువ సంఖ్యలో ముద్రించడంతో ఇప్పుడు ఆ సమస్య కూడా తీరింది. సో…మార్చి 13 తర్వాత మీ డబ్బులు…మీ ఇష్టం…అంటుంది ఆర్బీఐ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*