మా కంటెంట్ మా ఇష్టం …!

జనసేనాని మీడియా పై ప్రకటించిన యుద్ధం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఒక పక్క పవన్, మీడియా కొందరు ఒకరిపై మరొకరు న్యాయపోరాటం, పోలీస్ స్టేషన్లో కేసులు మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు అక్కడితో ఆగేలా లేవు. సినిమా కంటెంట్ మీడియా కు ఇవ్వకూడదని ఒక వర్గం ఫిలిం ఇండస్ట్రీ సీరియస్ గానే యోచన చేస్తుంది. పవన్ కు ఈ విషయంలో వ్యతిరేకించేవారు సైతం ఫిలిం ఛాంబర్ ఆవిధంగా నిర్ణయం తీసుకోవాలనే కోరుకుంటున్నారు. కారణం సెలబ్రిటీలు అనే ఒకే ఒక్క కారణంతో వున్నవి లేనివి మిక్స్ చేసి తమపై అన్యాయంగా షో లు రన్ చేస్తున్నారనేది చిత్రపరిశ్రమలో మెజారిటీ వర్గాల వేదన.

సోషల్ మీడియా తోనూ తలపోటు…

ఒక పక్క సోషల్ మీడియా లో రకరకాలు వైరల్ చేస్తుంటే మరోపక్క సంప్రదాయ మీడియా సోషల్ మీడియా ను మించి అతి చేస్తుందనేది వారి వాదం. రేటింగ్స్ ఉంటేనే ప్రకటనలు వస్తాయి. రేటింగ్స్ రావాలంటే మసాలా జోడీ అవ్వాలి. కనుక నిత్యం ఎదో ఒక మసాలా కోసం వేటాడటం పోటీ ప్రపంచంలో మీడియా కు అలవాటుగా మారింది. ఏ మసాలా లేనప్పుడు సినిమా జనం మీద ఎదో ఒకటి సృష్ట్టించడం ఆ వేడి చల్లారకుండా ప్రేక్షకులకు విసుగుపుట్టేదాకా చర్చలు నడిపించడం మీడియా కు రివాజుగా మారిందన్నది ఇండస్ట్రీ టాక్. ఒక్క ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే తప్పులు చేస్తున్నట్లు ఇంక ఎక్కడ కూడా ఏమి జరగనట్లు మీడియా చిత్రీకరించడం పై ఆ వర్గం మండిపడుతూ పవన్ పోరాటంతో జతకలిసి ఈ ధోరణికి చెక్ పెట్టాలన్నది టాలీవుడ్ టార్గెట్ గా కనిపిస్తుంది.

నియంత్రించడానికి మీరెవరు …

ఇక టాలీవుడ్ పట్టు క్రమంగా బిగుస్తున్న నేపథ్యంలో అసలు మా కంటెంట్ మాదే. మీరెవరు చెప్పడానికి అంటున్నారు కొందరు మీడియా పెద్దలు. పవన్ వెర్సెస్ మీడియా గా సాగుతున్న పోరాటం పై కొన్ని ఛానెల్స్ కు చెందిన మీడియా పెద్దలు ఒక సమావేశం నిర్వహించారు. జనసేన ఫిలిం ఛాంబర్ పెడుతున్న పెట్టబోయే ఆంక్షలపై ఘాటుగానే స్పందించారు. మీడియా లో ఏమి చూపించాలి? ఏది చూపించకూడదు అనేది మా ఇష్టం అందులో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం తగదని హెచ్చరించారు. ఇప్పటికైనా టాలీవుడ్ పెద్దలు నిర్ణయం మార్చుకోవాలని కోరారు. మీడియాను వెలివేయాలనేది సహించేది లేదని తీవ్రంగానే పోరాటం చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆంక్షలు అమలు …

అల్లు అర్జున్ నటించిన త్వరలో రాబోయే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆడియో రిలీజ్, ప్రి రిలీజ్ కార్యక్రమాలు తమకు నచ్చిన ఛానెల్స్ కు ప్రసార హక్కులు ఇచ్చేశారు. యూట్యూబ్ హక్కులు ఆదిత్యకు కట్టబెట్టారు. ఇప్పటికే ఇంతకుముందు ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి కొత్త దారి యూట్యూబ్ ద్వారా చూపించారు. ఆయన బాహుబలి చిత్రానికి సంబంధించి అన్ని యూట్యూబ్ వేదిక నుంచే ప్రసారాలు చేశారు. అందులో నుంచే మిగిలిన అన్ని ఛానెల్స్ తీసుకుని ఉపయోగించుకోవాలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో సినిమా కంటెంట్ ఇక వివిధ సామాజిక మాధ్యమాల్లో హక్కుల రూపంలో విక్రయించడమో లేక సొంతంగా ఆ చిత్రం ప్రొడక్షన్ అకౌంట్ నుంచే ప్రసారం చేయడమో చేసే అవకాశాలే వున్నాయి. ఈ నేపథ్యంలో అటు పవన్, ఇటు మీడియా కూడా ఎవ్వరు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలతో నష్టం ఇరు వర్గాలకు వుండే అవకాశాలు వున్నాయి. పవన్ సినిమాల వరకు పరిమితం అయితే ఒకలా ఉండేది కానీ ఆయన రాజకీయాల్లో ఉండటంతో ఎంతో కొంత నష్టం కలిగే అవకాశాలు వున్నాయి.