మిత్రులెవ‌రు.. శత్రువులెవ‌రు?

`ఏపీని స్కామాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చ‌కుండా చేస్తామ‌ని 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మోదీ-చంద్ర‌బాబు మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు అవినీతి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చేశారు. ఇందుకేనా 2014లో మ‌ద్ద‌తు ఇచ్చింది. ఇలా అయితే 2019లో ఎందుకు మ‌ద్ద‌తివ్వాలి` అంటూ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబును ప్ర‌శ్నించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీసింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చిన ప‌వ‌న్‌.. మొన్న‌టి వ‌ర‌కూ బీజేపీని ఎండ‌గ‌డుతున్న తీరు చూసి.. టీడీపీతో జ‌త క‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప‌వ‌న్ క్లారిటీ ఇవ్వ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో జ‌త క‌డ‌తార‌నే అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఇన్నాళ్లూ టీడీపీ-వైసీపీ మ‌ధ్య పోరు త‌ప్ప‌ద‌ని ఖాయ‌మైపోగా.. ఇప్పుడు ప‌వ‌న్ కూడా సొంతంగానే దిగుతాన‌ని స్ప‌ష్టంచేయ‌డం స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు వేదిక‌గా నిలుస్తోంది.

బంధం ఉండదని….

టీడీపీ-జ‌న‌సేన ఒక‌వైపు, వైసీపీ-బీజేపీ మ‌రోవైపు.. ఇదీ ఇన్నాళ్లుగా ఏపీలో పొత్తుల విష‌య‌మై వినిపిస్తున్న మాట‌! టీడీపీతో కొన్ని విభేదాలు, కొన్ని సమస్యలు ఉన్నా.. వాటిని పరిష్కరించుకుని కొన్ని సీట్లు తీసుకుని పవన్.. టీడీపీతో ఎన్నికలకు వెళతారని అంచనా వేశారు. కానీ ఇప్పుడు జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌తో ఇవ‌న్నీ తారుమార‌య్యాయి. టీడీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ తిరుగుబాటు చేస్తాన‌ని, టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డ‌తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ-జ‌న‌సేన బంధం ఉండ‌బోద‌ని స్ప‌ష్టం చేసేశాడు. తాను ఒంటరిగానే బరిలోకి దిగుతాననే సంకేతాలను స్పష్టంగా వెల్లడించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ముక్కోణపు పోటీ తప్పదని స్పష్టమైంది.

ఆ రెండూ కూడా…..

ఇదే స‌మ‌యంలో 2014లో టీడీపీతో జ‌త‌క‌ట్టిన బీజేపీ.. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉండ‌గానే క‌టీఫ్ చెప్పేసింది. ఏపీలో త‌మ‌కు అవ‌కాశాలు ద‌క్క‌కుండా, ఎదిగేందుకు అవ‌కాశం లేకుండా చేశార‌నే అభిప్రాయం ఏపీ బీజేపీ నేత‌ల్లో ఉంది. అంతేగాక కేంద్రం ఇచ్చిన‌ నిధుల‌న్నీ వాడేసుకుని.. ఇప్పుడు త‌మ‌పైనే టీడీపీ నేరం మోపుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ త‌రుణంలో ఏపీ బీజేపీ- టీడీపీతో జ‌త‌క‌ట్టే అవ‌కాశాలు చాలా త‌క్కువే. అంతేగాక బీజేపీలోని కొంద‌రు నేత‌లు వైసీపీతో దోస్తీపైనా ఆరా తీస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్‌తో వెళితే త‌మ పార్టీ ఏపీలో ఎద‌గ‌డంతో పాటు అన్ని విధాలుగా ల‌బ్ధి చేకూరుతుంద‌ని భావిస్తున్నారు. అయితే కేంద్రంపై జ‌గ‌న్‌.. అవిశ్వాసం పెట్ట‌నున్న త‌రుణంలో.. పొత్తు ఎంతవ‌ర‌కూ పొడుస్తుంద‌నేది కూడా అనుమాన‌మే!

ఎవరికి వారే…

గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ప్రత్యర్థి వైకాపాను చిత్తు చేయగా.. ఇప్పుడు ఈ పార్టీలు ఎవరికి వారు పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎన్నికల నాటికి జనసేనతో వామపక్షాలు జత కట్టే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తొలి నుంచి వామ‌ప‌క్షాల‌పై ప‌వ‌న్ సానుకూల దృక్ప‌థంతోనే ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి క‌నిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీగా టీడీపీని ఓడించడమే లక్ష్యంగా వైసీపీ, జనసేన బరిలోకి దిగుతున్నాయి. వీటికి ఎవరెవరు మద్దతు ఇస్తారనే అంశంపై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొన్ని రోజులు వేచిచూడాల్సిందే!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*