ముద్రగడను ఇరుకున పెట్టేందుకేనా …?

అనేక దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న కాపుల రిజర్వేషన్ అంశం చిటికెలో చంద్రబాబు పరిష్కరించేశారు అనుకుంటే పొరపాటు అంటున్నారు విశ్లేషకులు. దీని వెనుక చాలా వ్యూహమే తెలుగుదేశం అధినేత అమలు చేయబోతున్నారని చెబుతున్నారు. కమిషన్ చైర్మన్ గా వున్న వ్యక్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయకుండానే, ఆ కమిషన్ లో మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు కేబినెట్ లో తీర్మానించి, అసెంబ్లీలో తీర్మానం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపినా అనేక సాంకేతిక అడ్డంకులు ఎదురౌతాయని లెక్కలు వేస్తున్నారు. ముందుగా కమిషన్ ఛైర్మన్ మంజునాథ నివేదికను ప్రభుత్వానికి నివేదిక అందజేయాలిసి ఉంటుంది. ఆ తరువాత కేబినెట్ లో చర్చించి ప్రోసెస్ ముందుకు తీసుకువెళ్లాలి.

కోర్టునో చెప్పే అవకాశం వుంది…

అసెంబ్లీలో చర్చ ఆ తరువాత కేంద్ర ప్రభుత్వానికి పంపడం సాంకేతికంగా చేపట్టాలి. కానీ దీనికి భిన్నంగా బాబు తొందరపడటం వల్ల బిసి సంఘాలు కోర్టు కి వెళ్లడమే తరువాయి రిజర్వేషన్లు నిలిపి వేయాలని ఆదేశాలు వచ్చి తీరుతాయని న్యాయనిపుణులు అనుమానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 9 వ షెడ్యూల్ లో ఈ అంశం చేర్చడం ఇప్పట్లో అయ్యేపనికాదని అలా చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో బిజెపి సర్కార్ కి తలనొప్పులు మొదలౌతాయని అంటున్నారు. దాంతో నెపాన్ని కేంద్రంలోని బిజెపి సర్కార్ పై నెట్టి వేయడం సులువు అవుతుందని చెబుతున్నారు.

కోట్ల ఇచ్చిన జీవో కి కోర్టు మెలిక ….

గతంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా కాపులను బిసిల్లో చేరుస్తూ జీవో ఇచ్చారు. ఆయన కూడా పుట్టుస్వామి కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ తో మధ్యంతర నివేదిక రప్పించుకుని రిజర్వేషన్ ప్రకటించారు. ఇలా చేయడాన్ని హై కోర్టు తప్పు పట్టింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం లో ఇద్దరు జడ్జీలు రిజర్వేషన్ లు ఇవ్వడాన్ని తప్పు పట్టలేదు కానీ సాంకేతిక అంశాలనే తప్పు పట్టారు. తిరిగి చట్టబద్ధంగా జరగాల్సిన పని చూడమని నాటి కోర్టు ఆదేశించింది. ఆ తరువాత 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నా ఈ రిజర్వేషన్ల అంశాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. 2004 , 2009 ఎన్నికల్లో ఘోర పరాజయాలతో 2014 ఎన్నికల ముందు బాబు టిడిపి మ్యానిఫెస్టో లో కాపు రిజర్వేషన్ అంశాన్ని పెట్టడం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇచ్చిన హామీ అమలు చేయాలంటూ ఉద్యమ నేపథ్యంలో బాబు మరోసారి తన పాత వ్యూహానికి పదును పెట్టారన్న విమర్శలు వినవస్తున్నాయి.

ముద్రగడ వల్లే అలా అయ్యిందంటారా …?

కాపు రిజర్వేషన్ల అంశం హడావిడిగా చేయడానికి కాపు పోరాట నేత ముద్రగడ పద్మనాభమే కారణమని టిడిపి ఆరోపించనుందా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. బాబు వ్యూహాత్మకంగా అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకుని ముద్రగడను ఇరుకున పెట్టబోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ముద్రగడ డిసెంబర్ 6 డెడ్ లైన్ విధించడాన్ని ఆయన ఇస్తున్న అల్టిమేటం ల వల్ల కమిషన్ ఛైర్మెన్ నివేదిక రాకుండానే ఇలా చేయాలిసి వచ్చిందని చంద్రబాబు రిజర్వేషన్ల అంశంలో జారుకుంటారన్నది టాక్. కోర్ట్ ఎలాగూ ప్రస్తుతం జరిగిన ప్రక్రియను అడ్డుకుంటుందని, ఫలితంగా రిజర్వేషన్ల ప్రక్రియ మరోసారి విజయవంతంగా అటక ఎక్కించేస్తారని విశ్లేషిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*