ముస్తాఫా…ముస్తాఫా…డోన్ట్ వర్రీ

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో? ప్ర‌జ‌ల ఆలోచ‌న ఏమిటో కూడా చెప్ప‌డం చాలా క‌ష్టం. మ‌నం నిధులు ఆపేస్తే.. అక్క‌డ అభివృద్ధి ఆగిపోతుంది. ఫ‌లితంగా ఆ నియోజ‌క వ‌ర్గం ఎమ్మెల్యేకి సెగ‌త‌గ‌ల‌డం ఖాయం. దీంతో ఆ ఎమ్మెల్యే పార్టీ అయినా మారిపోతాడు. లేదా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయి.. ఇంటికైనా పోతాడు!! ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాలు ఇలాంటివి. అధికార పార్టీ నేత‌ల ఆలోచ‌న‌లు ఇవీ!! అయితే, ప్ర‌జ‌లు అలా అనుకుంటారా? ఇలాగే జ‌రిగితే.,. ఇది నిజ‌మ ని న‌మ్ముతారా? అభివృద్ది చేయ‌డం లేదు లేదా జ‌ర‌గ‌డం లేదు కాబ‌ట్టి.. స‌దరు ఎమ్మెల్యేని ఇంటికి పంపాల‌ని క‌క్ష క‌డ‌తా రా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు వేయ‌డం మానేస్తారా? అంటే.. రాజ‌ధాని జిల్లా గుంటూరు న‌డిబొడ్డున ఉన్న తూర్పు నియోజక వ‌ర్గం ప‌రిధిలోని ఓట‌ర్లు మాత్రం కానేకాద‌ని ముక్త‌కంఠంతో చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు తాము ఎదుర్కొంటున్నా.. వాటికి, ఎమ్మెల్యేకి సంబంధం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతున్నారు.

గుంటూరులో ఐదు నియోజకవర్గాల్లో….

మ‌రి అక్క‌డ ఏంజ‌రుగుతోంది? అంత‌గా ప్ర‌జ‌ల అభిమానం సంపాయించుకున్న ఆ ఎమ్మెల్యే ఎవ‌రు? వ‌ంటి విష‌యాలు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరులోని తూర్పు నియోజ‌క వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర ఫున మ‌హమ్మ‌ద్ ముస్తాఫా 2014లో ఘ‌న విజ‌యం సాధించారు. పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా వైసీపీ ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం అయిపోయింది. అయితే, ఈ పార్టీ త‌ర‌ఫున గెలుపొందిన ఎమ్మెల్యే లున్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై సాధార‌ణంగానే అధికార పార్టీ వివ‌క్ష చూపుతోంది. నిధులు విడుద‌ల చేయ‌కుండా, అభివృద్ధి జ‌ర‌గ‌నీయ‌కుండా కూడా అడుగ‌డుగునా అడ్డు త‌గులుతోంది. ప్ర‌ధానంగా గుంటూరు జిల్లాలో మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ టీడీపీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుపొందింది.

పార్టీ మారనంటే మారనని…..

దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ సామ‌దాన భేద దండోపా యాలు ప్ర‌యోగించింది. ఈ క్ర‌మంలోనే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాను కూడా లొంగ‌దీసుకునేం దుకు అనేక ప్ర య‌త్నాలు జ‌రిగాయి. కానీ, ఆయ‌న మాత్రం పార్టీ మార‌లేదు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అధికార పార్టీ శీత‌క‌న్నేసింది. నిధుల విడుద‌ల ఆగిపోయింది. దీంతో ఇక్క‌డ శివారు స‌హా.. చాలా ప్రాంతాల్లో నీటికి క‌ట‌క‌ట ఏర్ప డింది. కృష్ణాన‌ది ప‌క్క‌నే ఉన్నా.. తాగు నీరులేక ప‌నులు జ‌ర‌గ‌క జ‌నాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక‌, పేద‌ల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. రేష‌న్ కార్డులు ఇవ్వాల‌ని కోరుతున్నా ఇవ్వ‌ని ప‌రిస్థితి ఉంది. దీనికోసం ఎమ్మెల్యే ముస్తాఫా త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నిధుల‌ను టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇన్ చార్జ్ ఖాతాలో వేస్తోంద‌నే వాద‌న‌లు ఉన్నాయి.

టీడీపీ అనుకూల ప్రాంతాల్లోనే….

దీంతో స్థానిక టీడీపీ నేత‌లు వారికి మ‌ద్ద‌తుగా ఉండే ప్రాంతాల‌ను ఎంచుకుని అక్కడ మాత్ర‌మే అభివృద్ధి ప‌నులు చేస్తూ.. మిగిలిన ప్రాంతాల‌ను ముఖ్యంగా వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న ప్రాంతాల‌ను వ‌దిలేశారు. దీంతో ముస్త‌ఫా త‌న సొంత నిధుల‌ను ఖ‌ర్చు చేసి ప్ర‌తి ఇంటికీ డ్ర‌మ్ములు కొనిచ్చారు. మునిసిపాలిటీ అధికారుల‌తో మాట్లాడి, రోజూ ఇళ్ల వ‌ద్ద‌కు ట్యాంకులు తెచ్చే ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఏ ఇంటి ముందు చూసినా ముస్తాఫా ఇచ్చిన నీటి డ్ర‌మ్ములే క‌నిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో ప‌రిస్థితి ఎందుకు ఇలా ఉంది. అనే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి ఆయ‌న విస్తృ తంగా తీసుకు వెళ్లారు.

విపక్షంలో ఉండబట్టే…..

తాను విప‌క్షంలో ఉండ‌బ‌ట్టే అధికార పార్టీ నేత‌లు ఇలా నిధులు విడుద‌ల చేయ‌కుండా అడ్డుకుంటు న్నారని, అధికారులు సైతం త‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకు వెళ్లారు. ఫ‌లితంగా ఇప్పుడు టీడీపీ ఆశించిన దానికి విరుద్ధంగా ముస్తాఫాకే జ‌నాలు జై కొడుతున్నారు. ఎప్ప‌టికీ త‌మ నేత ముస్తాఫానే అంటున్నారు. మ‌రి టీడీపీ ఏం సాధించిందో ఆ పార్టీ నేత‌ల‌కే తెలియాలి. ఇక ఇటీవ‌ల ఆయ‌న్ను టీడీపీలోకి తీసుకు వ‌చ్చేందుకు టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు విశ్వ ప్ర‌యత్నాలు చేశారు. ఇటీవ‌ల ముస్త‌ఫా సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌డంతో ఆయ‌న పార్టీ మారిపోతున్న‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న ఇవ‌న్నీ పుకార్లే అని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా గుంటూరు తూర్పులో ముస్త‌ఫాను అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా జ‌నాల్లో మాత్రం ఆయ‌న‌పై పాజిటివ్ వేవ్ ఉంద‌న్న‌ది పార్టీల‌కు అతీతంగా వినిపిస్తోన్న టాక్‌.

 

-గుంటూరు నుంచి స్పెషల్ రిపోర్ట్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*